ETV Bharat / sitara

చివరి వరకు ఆ సినిమా తీయలేకపోయిన ఎన్టీఆర్​!

author img

By

Published : Dec 21, 2020, 9:29 PM IST

why senior ntr did not get film of alluri sita rama raju
'అల్లూరి'గా ఎన్​టీఆర్​ తీరని కోరిక!

నాటి బ్రిటిష్‌ పాలకులను గజగజ వణికించిన మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు. ఆయన కథను తెరకెక్కించాలనేది నందమూరి తారకరామారావు(ఎన్​.టి.ఆర్​) చిరకాల వాంఛ. కానీ, ఆ కోరిక నెరవేరలేదు. అయితే ఆయన ఈ సినిమా తీయకపోవడానికి అడ్డంకులుగా నిలిచిన సంఘటనలు ఏంటంటే?

ఎన్నో వైవిధ్యమైన చిత్రాల్లో నటించి తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో సుస్థిర స్థానం సంపాదించారు నందమూరి తారక రామారావు(ఎన్​.టి.ఆర్​). కానీ మన్యం వీరుడు అల్లూరి సీతారామారాజు కథను తెరకెక్కించాలన్న ఆయన చిరకాల వాంఛను మాత్రం నెరవేర్చుకోలేకపోయారు. అసలు ఇంతకీ ఎన్టీఆర్​కు అల్లూరి కథపై ఆసక్తి ఎలా కలిగిందంటే?

అలా అల్లూరి కథపై

1954లో పక్షిరాజా ఫిలిమ్స్‌ అధినేత ఎస్‌. శ్రీరాములు నాయుడు నిర్మించిన 'అగ్గిరాముడు'లో దాదాపు పదిహేను నిమిషాలపాటు సాగే మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు బుర్రకథా రూపకం ఉంది. ప్రముఖ బుర్రకథా కళాకారుడు నాజర్‌ తన బృంద సభ్యులు లక్ష్మినరసయ్య, రామకోటి, పెరియనాయకి, జయలక్ష్మిలతో కలిసి అభినయించిన ఆ కథా రూపకం 'శ్రీ విలసిల్లెడి తెలుగు దేశమున జననమందినాడా.. వినరా ఆంధ్రుడ మన్యసోదరుల వీరగాధ నేడు' అంటూ సాగుతుంది. ఈ బుర్రకథ సాగుతుండగా అల్లూరి సీతారామరాజు వేషంలో రామారావు కొద్దిసేపు కనిపిస్తారు. ఆ పాత్ర రామారావును ఎంతగానో కదిలించి వేసింది. వెంటనే అల్లూరి సీతారామరాజు పేరుతో సినిమా నిర్మించాలనే నిర్ణయానికి వచ్చేశారు.

పొంగరా ఉప్పొంగి ఓ తెలుగు బిడ్డా..

ఆ రోజుల్లో 'అల్లూరి' జీవితం ఆధారంగా.. పడాల రామారావు రచించిన నాటకం విస్తృత ప్రచారంలో ఉండేది. దానినే అనేక కళాసమితుల్లో నాటకంగా ప్రదర్శించేవారు. ఆయనకే ఈ సినిమా స్క్రిప్టు రాసే బాధ్యతలను ఎన్టీఆర్ అప్పగించారు. అప్పట్లో రామారావు తన సొంత బ్యానర్‌ మీద 'జయసింహ' చిత్రాన్ని నిర్మిస్తూ ఉన్నారు. ఆ సినిమా తరువాత అల్లూరి సీతారామరాజు చిత్రానికి శ్రీకారం చుట్టాలని నిర్ణయించారు. 1954 అక్టోబర్‌ 21న 'జయసింహ' సినిమా విడుదలై అఖండ విజయాన్ని సాధించింది. వాహినీ స్టూడియోలో అల్లూరి సీతారామ రాజు సినిమా కోసం తొలి పాటను 1957 జనవరి 17న రికార్డు చేశారు. 'హర హర హర మహా ఓంకార నాదాన... పొంగరా ఉప్పొంగి ఓ తెలుగు బిడ్డా' అంటూ సాగే ఈ పాటను పడాల రామారావు రాయగా టి.వి.రాజు సంగీత దర్శకత్వంలో ఘంటసాల, మాధవపెద్ది, ఎమ్‌.ఎస్‌. రామారావు, పిఠాపురం ఆలపించారు. పత్రికా సమావేశం ఏర్పాటు చేసి చిత్రాన్ని త్వరలో ప్రారంభిస్తామని రామారావు ప్రకటించారు.

స్క్రిప్టు విషయంలో అనుమానాలు

రామరాజు సమకాలికుడు మల్లుదొర అప్పట్లో పార్లమెంటు సభ్యునిగా కొనసాగుతున్నారు. ఆయనతో చర్చలు జరిపి కొన్ని సలహాలు స్వీకరించారు. అయితే స్క్రిప్టు విషయంలో ఇంకా కొన్ని అనుమానాలు రావడం వల్ల విస్తృత పరిశోధనచేసి సినిమా తీద్దామని నిర్ణయించి 'పాండురంగ మహాత్మ్యం' చిత్ర నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. ఈ సినిమా కూడా 1957 నవంబర్‌ 28న విడుదలై విజయవంతమైంది. ఈలోగా అల్లూరి సీతారామరాజు కథలో స్త్రీ పాత్రలు ఉండకపోవడం, వాటిని సృష్టిస్తే అవాస్తవికతకు ఆస్కారమిచ్చినట్లవుతుందని భావించి ఆ స్క్రిప్టును పక్కనపెట్టి 'సీతారామకల్యాణం' సినిమా నిర్మాణానికి పూనుకున్నారు. అదికూడా 1961 జనవరి 6న విడుదలై అఖండ విజయాన్ని సాధించింది. కానీ సీతారామరాజు సినిమా మాత్రం వెలుగు చూడలేకపోయింది. ఆ విషయాన్ని ఎవరడిగినా రామారావు ఉద్వేగానికి గురయ్యేవారు.

అదీ జరగలేదు..

అల్లూరి కథను ఒక కావ్యంగా రూపకల్పన చేస్తున్నట్లు ఎన్టీఆర్ అప్పట్లో​ చెప్పేవారు. 'విప్లవజ్యోతి అల్లూరి సీతారామరాజు' అని నామకరణం చేసి రికార్డు చేసిన పాటను పాండురంగమహాత్మ్యం పాటలతోపాటుగా విడుదల చేశారు. తరవాత 1968లో 'వరకట్నం' సినిమా మొదలుపెడుతూ, సీతారామరాజు సినిమాను కూడా ఈ చిత్రంతో పాటు సమాంతరంగా నిర్మిస్తానని రామారావు ప్రకటించారు. కానీ అదీ జరగలేదు.

అలా సూపర్​స్టార్​ చేతుల్లోకి..

'దేవదాసు' నిర్మించిన డి.ఎల్‌.నారాయణ.. సీతారామరాజు కథను శోభన్‌ బాబును హీరోగా పెట్టి తీద్దామని స్క్రిప్టు తయారు చేశారు. కానీ, ఆర్ధిక పరిస్థితులు అనుకూలించక ఆ స్క్రిప్టును హీరో కృష్ణకు అందజేశారు. కృష్ణకు కథ నచ్చడం వల్ల త్రిపురనేని మహారథితో మాటలు రాయించి 'అల్లూరి సీతారామరాజు' సినిమా విడుదల చేశారు.

ఆయన కన్నా ఎవరూ బాగా తీయలేరని..

కృష్ణ తీశారని తెలిసినా... ఎన్టీఆర్​​ ఈ సినిమా తీయాలనే సంకల్పం అధికమై పరుచూరి సోదరులను స్క్రిప్టు రూపొందించమని కోరారు. వారి సలహా మేరకు సినిమా తీసేందుకు ముందు కృష్ణ నిర్మించిన చిత్రాన్ని తెరమీద చూశారు. అది చూశాక కృష్ణ చిత్రం కన్నా ఎవరూ బాగా తీయలేరనే నిర్ణయానికి వచ్చి సీతారామరాజు సినిమా విషయాన్ని విరమించుకున్నారు. అయితే దాసరి నారాయణరావు సినిమా 'సర్దార్‌ పాపారాయుడు', మోహన్‌ బాబు చిత్రం 'మేజర్‌ చంద్రకాంత్‌' సినిమాల్లో అల్లూరి సీతారామరాజు గెటప్‌లో రామారావు కాసేపు దర్శనమిచ్చారు. అలా 'విప్లవజ్యోతి అల్లూరి సీతారామరాజు' సినిమా నిర్మాణం ఆగిపోయింది.

---ఆచారం షణ్ముఖాచారి.

ఇదీ చూడండి:ఆకాశవీధిలో అందాల జాబిలి...సావిత్రి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.