ETV Bharat / sitara

ఆ పాత్ర నాకు సవాల్​ విసిరింది: శ్రియ

author img

By

Published : Dec 8, 2021, 6:50 AM IST

శ్రియ గమనం సినిమా, Gamanam Movie Shreya
శ్రియ గమనం సినిమా

Gamanam Shriya Saran: జీవితంలోని చివరి క్షణం వరకు నటిస్తూనే ఉండాలనేది తన కోరిక అని చెప్పింది నటి శ్రియ. సినీ పరిశ్రమలోని అన్ని విభాగాల్లోనూ ప్రస్తుతం మహిళలు కనపడటం ఓ విప్లవాత్మక మార్పు అని తెలిపింది. ఈ నెల 10న ఆమె నటించిన 'గమనం' మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా చిత్ర విశేషాలు సహా కెరీర్​ గురించి పలు ఆసక్తికర సంగతులను వెల్లడించింది. అవన్నీ ఆమె మాటల్లోనే..

Gamanam Movie Shreya: "వెండితెర నలుపు తెలుపు నుంచి... రంగుల సినిమాగా రూపాంతరం చెందడం ఎంత విప్లవాత్మకమో... ఇప్పుడూ అంతటి కీలకమైన మార్పునే సెట్స్‌లో చూస్తున్నాం" అంటోంది ప్రముఖ కథానాయిక శ్రియ శరణ్‌. ఇలా వచ్చి అలా కనుమరుగవుతున్న పరిస్థితుల్లోనూ... నటిగా తనదైన ముద్ర వేసి ఇరవయ్యేళ్లుగా తెలుగు తెరపై సందడి చేస్తున్న అరుదైన కథానాయిక ఈమె. తొలినాళ్లలో ఎలా కనిపించేదో, ఇప్పుడూ అంతే అందంతో సందడి చేస్తోంది. ఓ బిడ్డకి జన్మనిచ్చిన శ్రియ ఇటీవల 'గమనం', 'ఆర్‌ఆర్‌ఆర్‌' చిత్రాల్లో నటించింది. సుజనా రావు దర్శకత్వం వహంచిన 'గమనం' ఈ నెల 10న ప్రేక్షకుల ముందుకొస్తోంది. ఈ సందర్భంగా విలేకర్లతో ముచ్చటించింది శ్రియ.

"చిన్నప్పట్నుంచే ఆరోగ్యంపై అవగాహన ఎక్కువ. అదంతా మా అమ్మ చలవే. యోగా, నృత్యం నేర్పించారు. అవే నా అందం వెనక రహస్యం. గర్భం దాల్చాక నాలోనూ చాలా మార్పులు వచ్చాయి. ఆ సమయంలోనూ కథక్‌ చేస్తూ ఫిట్‌ నెస్‌పై దృష్టిపెట్టేదాన్ని. పిల్లలు పుట్టాక మన ప్రపంచమే మారిపోతుంది. రాధ పుట్టాక నాలోనూ చాలా మార్పులు వచ్చాయి. మేం ఎక్కడికి వెళ్లినా బ్యాగ్‌లు, సూట్‌కేసుల గురించే ఆలోచించేవాళ్లం. ఇప్పుడు ఎక్కడికెళ్లినా మా పాపని వెంటబెట్టుకుని వెళుతున్నాం. నాలో మార్పులు రావడమే కాదు, అమ్మగా బాధ్యతలూ పెరిగాయి".

Gamanam Movie Shreya
శ్రియ

"మహిళా దర్శకులతో పనిచేయడం నాకు కొత్త కాదు. కన్నడలోనూ, దీపా మెహతా దర్శకత్వంలో 'మిడ్‌నైట్‌ చిల్డ్రన్‌' అనే ఆంగ్ల చిత్రమూ చేశా. తెలుగులో సుజనా రావుతో ఇదే తొలిసారి. ఇదివరకు సెట్స్‌లో నేను, నా హెయిర్‌ డ్రెస్సరే అమ్మాయిలు ఉండేవాళ్లం. కానీ ఇప్పుడు అన్ని విభాగాల్లోనూ అమ్మాయిలు కనిపిస్తున్నారు. అదొక విప్లవాత్మకమైన మార్పు. మహిళల కథల్ని చెప్పడంతోపాటు... మహిళల సమస్యల్ని చర్చిస్తున్నాం. ఆ విషయంలో చాలా ఆనందంగా ఉంది. ఇప్పుడొక విషయం చెప్పడానికి నేను ఏమాత్రం సిగ్గు పడటం లేదు. ఇదివరకు నెలసరి వస్తే, ఎంత నొప్పి ఉన్నా దర్శకులకి చెప్పే పరిస్థితి ఉండేది కాదు. ఇప్పుడు సెట్లో ఎక్కడ చూసినా అమ్మాయిలే కాబట్టి ఎవ్వరితోనైనా ఇలాంటి సమస్యల గురించి చెప్పుకోవచ్చు. కెమెరా వెనకాల అమ్మాయిలు ఎంత ఎక్కువగా ఉంటే, అంతగా అమ్మాయిల కథలు తెరపైకొస్తాయి".

"దేవుడిపై నాకు నమ్మకం ఎక్కువ. మనల్ని నడిపించే ఓ బలమైన శక్తి ఉందని నమ్ముతాను. ఆ దేవుడు, ప్రేక్షకుల ప్రేమ వల్లే నేను ఇరవయ్యేళ్లుగా ప్రయాణం చేస్తున్నా. మా నాన్న బీహెచ్‌ఈఎల్‌ ఉద్యోగి, మా అమ్మ లెక్కల టీచర్‌. అలాంటి ఓ మధ్య తరగతి కుటుంబం నుంచి వచ్చిన నేను తెలుగు ప్రేక్షకులకు పక్కింటి అమ్మాయిలా మారిపోయా. నా తొలి సినిమా 'ఇష్టం' రోజులు నాకు ఇప్పటికీ గుర్తే. ఇన్నాళ్లూ సినీ పరిశ్రమలో ఉన్నందుకు గర్వపడుతున్నా. చేసిన సినిమాలు కొన్ని ఫలితాల్నిచ్చాయి, కొన్ని ఇవ్వలేదు. మంచి కలయికల్లోనూ, మంచి బృందాలతో కలిసి పనిచేసే అవకాశం నాకు లభించింది. ఇరవయ్యేళ్లే కాదు, ఇంకో ఇరవయ్యేళ్లు ఇలాగే నటిస్తూనే ఉంటా. కరోనా సమయంలో నాకు సినిమాతో మరింత అనుబంధం ఏర్పడింది. చేసిన చిత్రాల్ని మళ్లీ మళ్లీ చూసుకున్నా. 'మనం' సమయంలో ఏఎన్నార్‌ సర్‌ చివరి సన్నివేశం చేస్తున్నప్పుడు నేనక్కడే ఉన్నా. ఒకవేళ నేను చనిపోతే, ఈ సినిమా చేసే చనిపోతా అనేవారు. అలా చివరి క్షణం వరకు నటిస్తూనే ఉండాలనేది నా కోరిక".

"ఎప్పుడూ మనసుకు నచ్చిన పాత్రలే చేశా. ఇప్పుడైతే సినిమాల విషయంలో నా ధృక్పథం మరింతగా మారింది. నా కూతురు, నా కుటుంబం నా సినిమాలు చూస్తే గర్వపడేలా ఉండాలి. అలాంటి పాత్రల్లోనే నటించాలనేది నా సిద్ధాంతం. ఇలాంటి ఆలోచనలతో ఉన్నప్పుడే 'గమనం' కథ విన్నా. వినగానే నా కంట్లో నీళ్లు సుడులు తిరిగాయి. వెంటనే చేస్తానని చెప్పా. మనుషుల్లో జరిగే అంతర్గత సంఘర్షణ, వాళ్ల ప్రయాణమే ఈ చిత్రం. నిస్సహాయురాలైన కమల అనే మహిళగా కనిపిస్తా. కమలలా మా అమ్మ ఇప్పటికీ ఇంట్లో టైలరింగ్‌ చేస్తూ ఉంటారు. దివ్యాంగురాలిగా కనిపించే కమల నాకు చాలా రకాలుగా సవాల్‌ విసిరిన పాత్ర. మూడు కథల సమాహారం ఈ చిత్రం. ఈ కథలకీ, ప్రకృతి విపత్తుకీ సంబంధం ఉంటుంది. అదెలా అనేది తెరపైనే చూడాలి. బుర్రా సాయి మాధవ్‌, జ్ఞానశేఖర్‌, ఇళయరాజాలతో కలిసి చేసిన ఈ సినిమా ప్రయాణం గుర్తుండిపోతుంది".

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

ఇదీ చూడండి: Gamanam movie: 'అలాంటి సినిమాల్లో నటించలేను'

ఇదీ చూడండి: బోల్డ్​ క్యారెక్టర్​ చేయడానికైనా సిద్ధమే: ప్రియాంక

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.