ETV Bharat / opinion

సుగంధ ద్రవ్యాల సాగులో రైతుకు దక్కని ప్రోత్సాహం

author img

By

Published : May 9, 2021, 6:45 AM IST

spices
సుగంధ ద్రవ్యాల సాగులో రైతులకు దక్కని ప్రోత్సాహం

2020-21 ఆర్థిక సంవత్సరం తొలి తొమ్మిది నెలల్లోనే భారత సుగంధ ద్రవ్యాల ఎగుమతులు 26 శాతం పెరిగాయి. ఇంతటి గిరాకీ ఉన్నా ఈ పంటలను సాగు చేసే రైతులకు ప్రభుత్వాల నుంచి సరైన ప్రోత్సాహం లభించడం లేదు. రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయాలన్న కేంద్రం లక్ష్యం నెరవేరాలంటే సుగంధ ద్రవ్యాల పంటల సాగును బాగా ప్రోత్సహించాలని మూడేళ్ల క్రితమే నీతి ఆయోగ్‌ చెప్పినా, ఇప్పటికీ ఆ మేరకు చర్యలు కొరవడ్డాయి.

కొవిడ్‌ను ఎదుర్కొనే క్రమంలో ప్రపంచవ్యాప్తంగా సుగంధ ద్రవ్యాల వినియోగంపై ప్రజలు ఆసక్తి చూపిస్తున్నారు. రోగనిరోధకశక్తిని పెంచుకునేందుకు రోజువారీ ఆహారంలో వీటి వాడకం బాగా పెరిగింది. 2020-21 ఆర్థిక సంవత్సరం తొలి తొమ్మిది నెలల్లోనే భారత సుగంధ ద్రవ్యాల ఎగుమతులు 26 శాతం పెరిగాయి. ఇంతటి గిరాకీ ఉన్నా ఈ పంటలను సాగు చేసే రైతులకు ప్రభుత్వాల నుంచి సరైన ప్రోత్సాహం లభించడం లేదు. పంటల సాగును పెంచే ప్రణాళికలూ లేవు. రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయాలన్న కేంద్రం లక్ష్యం నెరవేరాలంటే సుగంధ ద్రవ్యాల పంటల సాగును బాగా ప్రోత్సహించాలని మూడేళ్ల క్రితమే నీతిఆయోగ్‌ చెప్పినా, ఇప్పటికీ ఆ మేరకు చర్యలు కొరవడ్డాయి. పంటల శుద్ధి, విలువ ఆధారిత ఉత్పత్తుల తయారీ, మార్కెటింగ్‌ అవకాశాలు, ఆదాయాల పెంపులో రైతులకు సాయపడే విధానాలూ కరవయ్యాయి.

spices
సుగంధ ద్రవ్యాలు

విలువకు తగ్గ ఫలితమేది?
ప్రపంచవ్యాప్తంగా 180 దేశాలు భారత సుగంధ ద్రవ్యాలను కొనుగోలు చేస్తున్నాయి. కరోనా కారణంగా పసుపు, అల్లం, వెల్లుల్లి వంటి సుగంధ ద్రవ్యాల పంటలకు జాతీయ, అంతర్జాతీయ మార్కెట్లలో భారీ డిమాండు ఏర్పడింది. నిరుడు ఏప్రిల్‌ నుంచి డిసెంబరు వరకు 11.26 లక్షల టన్నుల ఎగుమతుల ద్వారా రూ.19,740 కోట్ల ఆదాయం వచ్చింది. ఇటీవలి కాలంలో దేశంలో మరే రంగం ఉత్పత్తుల ఎగుమతులూ ఈ స్థాయిలో పెరగలేదు. అత్యంత విలువైన ఆరోగ్య, ఔషధ విలువలు ఉన్న 109 రకాల సుగంధ ద్రవ్యాల పంటలను ‘ప్రపంచ సుగంధ ద్రవ్యాల ప్రమాణాల సంస్థ’ గుర్తించింది. వీటిలో 75 రకాల పంటలను భారత రైతులు పండిస్తున్నారు. దేశంలో 94 లక్షల టన్నుల సుగంధ ద్రవ్యాల పంటల దిగుబడులొస్తే అందులో సగానికి సగం 47 లక్షల టన్నులను మధ్యప్రదేశ్‌, గుజరాత్‌, రాజస్థాన్‌ రైతులే పండిస్తున్నారు. మిరప సాగులో ఆంధ్రప్రదేశ్‌, పసుపు సాగు విస్తీర్ణంలో తెలంగాణ అగ్రస్థానంలో ఉన్నాయి. ఈ పంటల ధరలు అస్థిరంగా ఉండటంతో తెలుగు రైతుల కష్టానికి తగిన ప్రతిఫలం రావడం లేదు. వీటికి గిట్టుబాటు ధర లభించేలా సరైన మార్కెటింగ్‌ అవకాశాలు పెరగడం లేదు. పక్కనే ఉన్న మహారాష్ట్రలో పసుపు పంటకు పలికే ధరను తెలంగాణ మార్కెట్లలో ఇవ్వడం లేదు. ఇక్కడ పంట శుద్ధి, నాణ్యత పెంపునకు సరైన చర్యలు లేనందు వల్ల ధర రావడం లేదని వ్యాపార వర్గాలు ఏళ్ల తరబడి చెబుతున్నా పట్టించుకునేవారే లేరు. గుజరాత్‌, కర్ణాటక, రాజస్థాన్‌, తమిళనాడు, అసోమ్‌, కేరళ, మధ్యప్రదేశ్‌, మహారాష్ట్ర, ఉత్తర్‌ ప్రదేశ్‌, ఒడిశా, పశ్చిమ్‌ బంగ రాష్ట్రాలు సుగంధ ద్రవ్యాల పంటల సాగు, ఉత్పత్తుల్లో కీలకపాత్ర పోషిస్తున్నాయి. అల్లం, వెల్లుల్లి, జీలకర్ర, ఆవాలు వంటి పంటలు పండటానికి తెలుగు రాష్ట్రాల్లో అనువైన వాతావరణం, సారవంతమైన భూములున్నా రైతులను ఆ దిశగా నడిపించే వ్యవస్థలు సరిగా లేవు. పసుపు బోర్డు ఏర్పాటు చేస్తే తెలంగాణలో ఈ పంట సాగు, దిగుబడుల పెంపునకు మరింత ఊతం లభిస్తుందన్న రైతుల మొర ప్రభుత్వాలకు పట్టడం లేదు. ఇప్పటికే దేశవ్యాప్తంగా ఉన్న వివిధ పంటల బోర్డులను రద్దు చేయాలా, లేక ఒకదానిలో మరొకటి విలీనం చేసి ఆర్థిక నిర్వహణ భారం తగ్గించుకోవాలా అనే కోణంలో కేంద్రం అధ్యయనం చేస్తోంది. ఈ పరిస్థితుల్లో తెలంగాణలో ప్రత్యేకంగా పసుపు పంటకు బోర్డు ఏర్పాటు కష్టమే కావచ్చు.

statistics
గణాంకాలు

సుగంధ ద్రవ్యాల పంటలపై ఉద్యాన విశ్వవిద్యాలయాల్లో పరిశోధనలు సాగాలి. శాస్త్ర వేత్తలు రైతులకు మేలైన వంగడాలను అందించాలి. ఈ వర్సిటీల శాస్త్రవేత్తలు పంటల సాగు ప్రదర్శనా క్షేత్రాలను రైతుల పొలాల్లోనే ఏర్పాటు చేసి మంచి దిగుబడులను సాధించడం ఎలాగో ప్రత్యక్షంగా చూపిస్తే ఎక్కువ మంది ఆకర్షితులవుతారు. కానీ తెలుగు రాష్ట్రాల్లో ఉద్యాన వర్సిటీలు ఆ చొరవ చూపించడం లేదు. తెలంగాణ ఉద్యాన వర్సిటీ ఏర్పాటై అయిదేళ్లు దాటినా ఇప్పటిదాకా పూర్తిస్థాయిలో సిబ్బంది, పాలకవర్గం నియామకాలు జరగలేదు. మొక్కుబడిగా సాగుతున్న ఈ వర్సిటీ నిర్వహణతో రైతులకు కొత్తగా అందుతున్న పరిశోధనా ఫలాలే లేవు. రాజస్థాన్‌లాంటి చోట్ల జీలకర్ర, ఆవాలు వంటి పంటలు పండిస్తున్నారు. అక్కడి శాస్త్రవేత్తలు తెలంగాణ, ఆంధ్రలకు వచ్చి ఇక్కడి భూములు, వాతావరణం సుగంధ ద్రవ్యాల పంటలకు ఎంతో అనువైనవని చెప్పారు. వాళ్ల సిఫార్సుల ప్రకారం రైతులను ఆ దిశగా ప్రోత్సహించడానికి రెండు రాష్ట్రాల ఉద్యాన శాఖలు, విశ్వవిద్యాలయాలు పెద్దగా కృషి చేయడం లేదు. ఈ పంటలు పండిస్తే పంటలు ఎక్కడ అమ్మాలి, ఎవరు కొంటారనేది తెలుగు రైతులకు పెద్ద సవాళ్లుగా మారాయి. ఉత్తర భారతదేశంలో ఆవనూనెకు ఎంతో డిమాండు ఉంది. కానీ ఇక్కడ ఆవాల పంటను ఎక్కువగా సాగు చేయడం లేదు.

మార్గదర్శకత్వం అవసరం
కేరళ, తమిళనాడు, కర్ణాటక వంటి రాష్ట్రాల్లో పండే అనేక రకాల సుగంధ ద్రవ్యాలను తెలుగు రాష్ట్రాల్లోనూ పండించడానికి రైతులకు మార్గదర్శకత్వం చేయాల్సి ఉంది. కర్ణాటకలో ఈ పంటల సాగుకు ఉద్యానశాఖ ప్రత్యేకంగా కృషి చేస్తోంది. ఏ పంట సాగు చేయాలని రైతులకు చెప్పినా అది మార్కెట్‌కు వచ్చే సమయానికి గిట్టుబాటు ధర ఇప్పించేలా వ్యవస్థలు ఉండాలి. తెలుగు రాష్ట్రాల్లో సుగంధ ద్రవ్యాల పంటలకు ఈ పూచీకత్తు కరవైంది. దేశంలోనే నాణ్యమైన మిరప, పసుపు పంటలను పండిస్తున్నా వాటికి మద్దతు ధర ఎంత ఇవ్వాలో కేంద్ర ప్రభుత్వం చెప్పడం లేదు. కేంద్రం ఏటా మద్దతు ధర ప్రకటించే 24 రకాల పంటల్లో ఒక్క సుగంధ ద్రవ్యాల పంటయినా లేదు! సుగంధ ద్రవ్యాల పార్కులు ఏర్పాటు చేసి, శుద్ధి, మార్కెటింగ్‌ సదుపాయాలు కల్పిస్తే ఈ పంటల అమ్మకాలు, ఎగుమతులు బాగా పెరుగుతాయి. ప్రపంచ వ్యాప్తంగా మన సుగంధ ద్రవ్యాలకు ఉన్న గిరాకీని దృష్టిలో పెట్టుకుని రైతులకు చేయూత అందించడంపై పాలకులు తక్షణం దృష్టి సారించాలి.

- మంగమూరి శ్రీనివాస్‌

ఇదీ చూడండి: ఊరంతా వృద్ధులున్నా.. కరోనా అడుగుపెట్టలేదు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.