ETV Bharat / opinion

దేశ ఆర్థికానికి అంకురాలే ఆశాకిరణాలు

author img

By

Published : Feb 1, 2021, 8:59 AM IST

దేశ ఆర్థిక వ్యవస్థకు అంకుర సంస్థలు ఇరుసుగా మారుతున్నాయి. ఉద్యోగాల వేట మానేసి.. ఉపాధి కల్పించే స్థాయికి ఎదగాలన్న లక్ష్యంతో అంకుర సంస్థలు పుట్టుకొస్తున్నాయి. గతేడాది చివరి నాటికి భారీ స్థాయిలో అంకురాలు ప్రభుత్వ గుర్తింపు సాధించినట్టు కేంద్ర ఆర్థిక సర్వేతేల్చింది. పర్యటకం, ఈ-కామర్స్​ రంగాలే కాకుండా.. విద్య, వైద్యంలోనూ భారీ స్థాయిలో స్టార్టప్​లు వెలుగుచూడటం శుభపరిణామం. సరైన ఆలోచన, సాధించాలన్న పట్టుదల, నిలదొక్కుకోవాలన్న తపన ఉంటే అంకురాలకు ఇది సువర్ణావకాశమంటున్నారు మార్కెట్​ నిపుణులు.

Startups are becoming main key role for the Indian Economy
అంకురాలే ఆశాకిరణాలు

త్సాహికులు తమ నవ్యమైన ఆలోచనలే పెట్టుబడిగా స్థాపిస్తున్న అంకుర సంస్థలు ఇప్పుడు దేశ ఆర్థిక వ్యవస్థకు కొత్త ఇరుసుగా మారుతున్నాయి. కొలువుల కోసం వెతకడం మాని ఉద్యోగాలిచ్చే స్థాయికి ఎదగాలన్న యువత ఆకాంక్ష అంకుర సంస్థలకు ప్రాణం పోస్తోంది. దేశంలో 2020 చివరి నాటికి ఏకంగా 41,061 అంకుర సంస్థలు ప్రభుత్వ గుర్తింపు పొందినట్లు కేంద్ర ఆర్థిక సర్వే తేల్చిచెప్పింది. ఇందులో అత్యధిక సంస్థలు వందల మందికి ఉపాధి చూపుతున్నాయి. వీటిలో 39 వేల అంకురాలు 4.70 లక్షల మందికి ఉపాధి కల్పిస్తున్నాయని వెల్లడించింది. పర్యాటకం, ఈ-కామర్స్‌ వంటి సేవా రంగాలే కాదు- విద్య, వైద్యం వంటి ప్రాధాన్య రంగాల్లోనూ అంకుర సంస్థలు వేళ్లూనుకుంటుండటం శుభపరిణామం. అంతరిక్ష పరిశోధన రంగంలో ప్రైవేటు సంస్థల ప్రవేశానికి కేంద్రం ద్వారాలు తెరవగానే 40 అంకుర సంస్థలు పెట్టుబడులు పెట్టడం- ఈ వ్యవస్థ బహుముఖాభివృద్ధికి ప్రత్యక్ష నిదర్శనం.

ప్రభుత్వ చేయూత

ఉద్యోగాల కల్పన కష్టమవుతుండటం, సరికొత్త ఆలోచనలతో పది మందికి ఉపాధి కల్పించేలా యువత ముందుకొస్తుండటంతో అంకుర సంస్థలకు కేంద్ర ప్రభుత్వం కూడా ప్రోత్సాహకాలు అందిస్తోంది. ఇందుకోసం 'స్టార్టప్‌ ఇండియా - స్టాండప్‌ ఇండియా' పథకాన్ని ప్రారంభించింది. దీనికింద అంకుర సంస్థల మేధాహక్కులకు రక్షణ కల్పిస్తోంది. అంకురాలకు ఆర్థిక ఊతమిచ్చేందుకు 14వ, 15వ ఆర్థిక సంఘాల సహకారంతో రూ.10 వేల కోట్ల మూలనిధిని సమకూర్చింది. చిన్న పరిశ్రమల అభివృద్ధి బ్యాంకు (సిడ్బీ) ఆధ్వర్యంలో ఈ మూలనిధికి మరిన్ని ప్రత్యామ్నాయ పెట్టుబడి నిధులు జోడించి దాదాపు రూ.31,598 కోట్లు పోగేయగలిగారు. దీని నుంచి ఇప్పటి వరకు 384 అంకుర సంస్థల్లో రూ.4,509 కోట్ల పెట్టుబడులు పెట్టారు. మరోవైపు అంకుర సంస్థలకు ప్రారంభదశలో కొన్నాళ్లపాటు ఆదాయపన్ను మినహాయింపు వంటి ప్రోత్సాహకాలు అందిస్తుంది.

68 సంస్థలకు యూనికార్న్​ హోదా

కరోనాతో అన్ని రంగాలూ అతలాకుతలమయ్యాయి. ఇప్పుడిప్పుడే ప్రయాణం మొదలుపెట్టిన అంకుర సంస్థలకు కొవిడ్‌ శరాఘాతంలా తాకింది. ఇంత సంక్షోభంలోనూ కొన్ని అంకుర సంస్థలు దూసుకెళ్లాయి. కరోనా సృష్టించిన విపత్కర పరిస్థితులనే అవకాశాలుగా మలచుకుంటూ అత్యధిక మార్కెట్‌ విలువ వైపు పరుగులు పెట్టాయి. ప్రపంచ వ్యాప్తంగా 68 అంకుర సంస్థలు ఈ ఏడాది యూనికార్న్‌ హోదా పొందాయి. (100 కోట్ల డాలర్ల మార్కెట్‌ విలువ సాధించిన సంస్థలను యూనికార్న్‌లుగా వ్యవహరిస్తారు). దాదాపు రూ.7,300 కోట్ల మార్కెట్‌ విలువను సాధించిన 12 భారతీయ కంపెనీలు ఈ ఏడాది జాబితాలో చోటు సంపాదించుకున్నాయి. ఇందులో ఏడు కంపెనీలు కొవిడ్‌ తరవాతే యూనికార్న్‌ హోదా పొందడం విశేషం. చిన్నారుల దుస్తులు, ఇతర సామగ్రి విక్రయించే 'ఫస్ట్‌ క్రై' సంస్థ గత ఫిబ్రవరిలోనే యూనికార్న్‌గా నిలిచింది. అయితే కరోనా తరవాత సంక్షోభ పరిస్థితుల్లోనూ నైకా, పోస్ట్‌మ్యాన్‌, జెరోధా, ఎన్‌ఎక్స్‌ట్రా డేటా, అన్‌అకాడమీ, రేజర్‌పే సంస్థలు ఈ జాబితాలోకి వచ్చాయి.

సాంకేతికే ఆలంబనగా..

కరోనా వేళ దేశంలో డిజిటల్‌ వినియోగం భారీగా పెరిగింది. ఆన్‌లైన్‌ తరగతులు, ఇంటి నుంచే పని చేయడం, ఈ-కామర్స్‌, ఆన్‌లైన్‌లో వైద్య సంప్రదింపులు, బీమా కొనుగోళ్లు ఇలా అన్నింటికీ సాంకేతికతే ఆలంబనగా నిలిచింది. ఈ పరిణామం ఆన్‌లైన్‌ సేవలు అందించే అంకుర సంస్థలకు వరంగా మారింది. ఉదాహరణకు దుస్తులు, పాలసీసాల నుంచి ఆటవస్తువుల వరకు చిన్నారులకు కావాల్సిన వస్తువులన్నీ ఆన్‌లైన్‌లో అందించే ఫస్ట్‌ క్రై సంస్థ 2016లోనే మహీంద్రా గ్రూప్‌నకు చెందిన బేబీఓయ్‌ను రూ.362 కోట్లతో కొనుగోలు చేసి ఆ రంగంలో అతిపెద్ద సంస్థగా అవతరించింది. నాలుగేళ్లు తిరగకుండానే ఇప్పుడు ఫస్ట్‌ క్రై మార్కెట్‌ విలువ వందకోట్ల డాలర్లకు చేరింది. లాక్‌డౌన్‌ కాలంలో చిన్నపిల్లల దుస్తులు, ఇతర ఉపకరణాల కొనుగోళ్లకు ఎక్కువ మంది ఆన్‌లైన్‌ను నమ్ముకోవడం తమకు కలిసొచ్చిందని ఫస్ట్‌ క్రై చెబుతోంది. ఆరు వేల బ్రాండ్లకు చెందిన రెండు లక్షల ఉత్పత్తులతో ఫస్ట్‌క్రై ఏకంగా 40 లక్షల మంది వినియోగదారులను సంపాదించుకుంది. సౌందర్య, సంరక్షణ ఉత్పత్తులమ్మే నైకా కూడా యూనికార్న్‌ హోదా సంపాదించుకుంది. ఆన్‌లైన్‌ స్టాక్‌ ట్రేడింగ్‌ స్టార్టప్‌ జెరోధా, ఆన్‌లైన్‌ పాఠాల వేదిక అన్‌అకాడమీ, ఏపీఐ అభివృద్ధి వేదిక పోస్ట్‌మాన్‌, కార్డు ఆధారిత చెల్లింపు సేవల సంస్థ పైన్‌ ల్యాబ్స్‌ కూడా కరోనా సంక్షోభం దాపురించాకనే యూనికార్న్‌ హోదా పొందాయి.

ప్రోత్సాహకర వాతావరణం

తమ ఆలోచన విజయవంతం అవుతుందన్న నమ్మకంతో ఇవన్నీ దాదాపు పదేళ్లుగా ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొని నిలబడ్డాయి. ఆర్థికంగా ప్రభుత్వం నుంచి ఎలాంటి ప్రోత్సాహకాలు లేకపోయినా ఎదురీది... ఇప్పుడు భారతీయ అంకుర వ్యవస్థకు తలమానికంగా నిలిచాయి. వీటితో పోల్చితే ఇప్పుడు కొత్తగా వచ్చే అంకురాలకు ప్రభుత్వ పరంగానే కాకుండా మార్కెట్‌పరంగానూ ఇంతకు ముందెన్నడూ లేనంత ప్రోత్సాహకర వాతావరణం ఉందని మార్కెట్‌ నిపుణులు చెబుతున్నారు. సరైన ఆలోచన, సాధించాలన్న పట్టుదల, నిలదొక్కుకోవాలన్న తపన ఉంటే అంకురాలకు ఇది సువర్ణావకాశమంటున్నారు. ప్రజలు సాంకేతికతను ఎక్కువగా వినియోగిస్తుండటం కూడా అంకురాల లక్ష్యసాధనకు ఆలంబనగా నిలుస్తుందని గుర్తు చేస్తున్నారు.

- కె.ఎస్‌.పి.ముఖర్జీ, రచయిత

ఇదీ చదవండి: నేడే పార్లమెంటు ముందుకు 'ఆత్మనిర్భర్​ భారత్​' బడ్జెట్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.