ETV Bharat / opinion

మానవ తప్పిదాలతో పర్యావరణ ప్రతీకారం

author img

By

Published : Feb 9, 2021, 7:48 AM IST

natural disasters occur due to human activities
మానవ తప్పిదాలతో పర్యావరణ ప్రతీకారం

మానవ తప్పిదాలతో భూతాపం అంతకంతకూ పెరిగిపోతోంది. దీంతో మంచు కొండలు కరిగిపోతున్నాయి. ఇది మానవ జాతి మనుగడకే ప్రమాదం అని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ప్రకృతి ప్రకోపిస్తే.. దాని పర్యవసానాలు ఎంతో భయానకంగా ఉంటాయో.. ఇటీవల జరిగిన ఉత్తరాఖండ్​ ధౌలిగంగ ఘటన ఉదాహరణగా నిలిచింది. ఇలా వైపరీత్యానికి మానవ తప్పిదాలూ జతపడబట్టే ఈ ఊహాతీత ఉత్పాతాలు జరుగుతున్నాయని విశ్లేషకులు చెబుతున్నారు.

ఆర్కిటిక్‌లో అమితవేగంతో కరిగిపోతున్న మంచు, పెరిగిపోతున్న భూతాపం కారణంగా ముంచుకొస్తున్న పెనుముప్పునకు సంకేతమని దశాబ్దాలుగా శాస్త్రవేత్తలు మొత్తుకొంటున్నా పట్టించుకొంటున్నదెవరు? కనువిందు చేసే ప్రకృతి కన్నెర్ర చేస్తే పర్యవసానాలెంత భయానకంగా ఉంటాయో అనుభవంలోకి వచ్చినా, ప్రాప్తకాలజ్ఞత ప్రదర్శించకపోబట్టే ఉత్తరాఖండ్‌ అనూహ్య ఉపద్రవం పాలబడి కుములుతోందిప్పుడు! చమోలీ జిల్లా జోషిమఠ్‌ సమీపంలో నందాదేవి హిమానీనదంలోని మంచు చరియలు విరిగి ధౌలిగంగ నదిలో పడటంతో- రాకాసి వరద కోరసాచింది. ఆ భయానక వరద ఉద్ధృతికి 13.32 మెగావాట్ల రిషిగంగ జలవిద్యుత్‌ కేంద్రం పూర్తిగా కొట్టుకుపోగా, ఎన్‌టీపీసీ ఆధ్వర్యంలోని 480 మెగావాట్ల విద్యుత్‌ కేంద్రానికీ భారీ నష్టం వాటిల్లింది. ఆకస్మిక వరద వేగం అయిదు వంతెనల్ని ఊడ్చేసి, 17 గ్రామాలతో సంబంధాల్ని తెంచేసి, 26మంది అభాగ్యుల ఉసురు తీసి మరో 171మంది ఆచూకీ గల్లంతు చేసింది. 2013లో దాదాపు ఆరువేల మంది భక్తుల్ని బలిగొని, మరెన్నో వేలమందికి వెంటాడే పీడకలగా మారిన 'హిమాలయన్‌ సునామీ' తరవాత ఉత్తరాఖండ్‌పై ఉరిమిన విషాదమిది. హిమనదీయ సరస్సు బద్దలై ఉద్భవించిన వరద ఏడేళ్లక్రితం కేదార్‌నాథ్‌ను పీనుగుల దిబ్బగా మార్చేసిందని నిర్ధరించిన నిపుణులు- తాజా ఉత్పాతం ఎందుకు, ఎలా సంభవించిందో లోతుగా పరిశీలించాలంటున్నారు. వానకాలంలో కొండచరియలు విరిగిపడటం సాధారణమే అయినా శీతకాలంలో ఇలా మంచు చరియల ముప్పు మున్నెన్నడూ ఎరుగనిది. నాలుగు దశాబ్దాల ఉపగ్రహ సమాచారాన్ని మధించి సాగించిన అధ్యయనం- భూతాపం కారణంగా హిమాలయ హిమానీ నదాలు గుల్లబారుతున్నట్లు 2019 జూన్‌లో ధ్రువీకరించింది. ఘనీభవించిన మంచులో శీతలం గతంలో మైనస్‌ 6 నుంచి మైనస్‌ 20 డిగ్రీల సెల్సియస్‌ ఉంటే, ఇప్పుడది మైనస్‌ రెండు డిగ్రీలకు పడిపోవడానికి భూతాపమే కారణమని శాస్త్రవేత్తలు అంటున్నారు. ఆ వైపరీత్యానికి మానవ తప్పిదాలూ జతపడబట్టే ఈ ఊహాతీత ఉత్పాతాలు!

మిగులు విద్యుత్‌ రాష్ట్రంగా ఎదగాలన్న ఉత్తరాఖండ్‌ ఆశయంలో తప్పుపట్టాల్సింది ఏమీ లేకపోయినా, జల విద్యుదుత్పత్తికి గల అవకాశాల్ని సద్వినియోగం చేసుకొనే క్రమంలో పర్యావరణ విధ్వంసమే ప్రాణాంతకంగా మారుతోంది. అలక్‌నందపైనే ఎకాయెకి 60 జల విద్యుత్‌ ప్రాజెక్టుల నిర్మాణంతో నదీలోయ జీవావరణ వ్యవస్థ ధ్వంసమైపోనుందని 'కాగ్‌' నివేదిక పదేళ్లక్రితమే హెచ్చరించింది. ఆ హితవును లక్ష్యపెట్టని పాపం పెనుశాపమై 2013నాటి విలయం విరుచుకుపడ్డ నేపథ్యంలో సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన ఉన్నతాధికార కమిటీ- సముద్ర మట్టానికి రెండు వేల మీటర్ల ఎత్తున జలవిద్యుత్‌ ప్రాజెక్టు నిర్మాణం అత్యంత ప్రమాదకరమని స్పష్టీకరించింది. అలా తలపెట్టిన 23 ప్రాజెక్టుల్ని రద్దు చెయ్యాలని సిఫార్సు చేసింది. సొరంగాల కోసం కొండల్ని తొలిచి, ఆ మట్టిని నదుల్లో గుమ్మరించి, విచ్చలవిడిగా వృక్షాలను నరికి, నదీప్రవాహాల్ని దారి మళ్ళించి సాగిస్తున్న ప్రకృతి విధ్వంసం తాలూకు పర్యవసానాలు ఎంత తీవ్రంగా ఉంటాయో తెలిసివస్తోంది. అభివృద్ధి పనులకు 50వేల హెక్టార్లు, ఆక్రమణల్లో మరో 10,600 హెక్టార్లు, ఇంకో 44,500 హెక్టార్లు అగ్ని ప్రమాదాల్లో హరాయించుకుపోగా- ఉత్తరాఖండ్‌ అడవులు దీనవదనగా సాక్షాత్కరిస్తున్నాయి. పర్యావరణపరంగా అత్యంత సున్నితమైన ప్రాంతాలనుంచి విద్యుత్‌ ప్రాజెక్టుల్ని ఇతర చోట్లకు తరలిస్తే ఎలా ఉంటుందన్న సుప్రీంకోర్టు- 'ప్రాణాలకు ముప్పు ముంచుకు రాకూడ'దని నిరుడు ఫిబ్రవరిలో పేర్కొంది. పేలుడు పదార్థాలు వాడి కొండల్ని తొలిచేస్తున్నారంటూ రిషిగంగ పవర్‌ ప్రాజెక్టుపై స్థానికులు చేసిన ఫిర్యాదు బధిర శంఖారావమైపోగా, ఇప్పటి రాకాసి వరద ధాటికి అదే పత్తాలేకుండా పోయింది. ఉత్తరాఖండ్‌కే కాదు- యావద్దేశానికీ ప్రకృతి నేర్పిన గుణపాఠమిది!

ఇదీ చూడండి: 2013 వరదలా.. అమ్మ బాబోయ్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.