ETV Bharat / opinion

కార్మిక రంగంపై కరోనా కాటు!

author img

By

Published : Jun 10, 2021, 9:07 AM IST

కరోనా రెండో దశ నేపథ్యంలో విధించిన లాక్​డౌన్ ఆంక్షలు.. కార్మికలోకాన్ని కోలుకోలేని విధంగా దెబ్బతీశాయి. దేశంలో ఉపాధి అవకాశాలకు భారీగా గండికొట్టాయి. కార్మికుల కుటుంబాలు ఆదాయ మార్గాల్ని కోల్పోవడంతో సరైన తిండికీ నోచుకోలేకపోతున్నాయి. చాలామంది అప్పులపాలయ్యారని అజీమ్‌ప్రేమ్‌జీ విశ్వవిద్యాలయానికి చెందిన సుస్థిర ఉపాధి కల్పన కేంద్రం నివేదిక వెల్లడించింది.

migrant labours
వలస కూలీలు, వలస కార్మికులు

కొవిడ్‌ రెండో దశ వ్యాప్తితో దేశవ్యాప్తంగా ఉపాధి కల్పన రంగంలో అనిశ్చితి నెలకొంది. అత్యధిక శాతం కార్మికుల వేతనాలు కోసుకుపోయి పేదరికం పెరిగింది. నిరుడు మార్చిలో మొదలైన కొవిడ్‌ మొదటి ఉద్ధృతి, దాన్ని కట్టడి చేయడానికి విధించిన లాక్‌డౌన్‌ ఆంక్షలు కార్మికలోకాన్ని కోలుకోలేని విధంగా దెబ్బతీశాయి. రెక్కాడితేకాని డొక్కాడని వలస కూలీలు మూటా ముల్లె సర్దుకొని వందలాది కిలోమీటర్లు కాలినడకన ప్రయాణించి సొంతూళ్లకు చేరుకున్నారు.

పరిస్థితులు చక్కబడుతున్న తరుణంలోనే కరోనా రెండో ఉద్ధృతి ఉరుముకు రావడంతో రాష్ట్ర ప్రభుత్వాలు ఎక్కడికక్కడ కఠిన ఆంక్షలను అమలు చేస్తున్నాయి. ఈ పరిస్థితులన్నీ కలిసి దేశంలో ఉపాధి అవకాశాలకు భారీగా గండికొట్టాయి. కార్మికుల కుటుంబాలు ఆదాయ మార్గాల్ని కోల్పోవడంతో సరైన తిండికీ నోచుకోలేకపోతున్నాయి. చాలామంది అప్పులపాలయ్యారని అజీమ్‌ప్రేమ్‌జీ విశ్వవిద్యాలయానికి చెందిన సుస్థిర ఉపాధి కల్పన కేంద్రం నివేదిక వెల్లడించింది. గతేడాది మార్చి నుంచి డిసెంబరు వరకు దేశంలో ఉపాధి కల్పన, ఆదాయ అసమానతలు, పేదరిక పరిస్థితులపై కొవిడ్‌ ప్రభావాన్ని అధ్యయనం చేసిన ఈ కేంద్రం, కార్మికుల దైన్యాన్ని కళ్లకు కట్టినట్లుగా నివేదించింది.

15 లక్షల మంది...
నిరుడు లాక్‌డౌన్‌ అమలైన ఏప్రిల్‌-మే మధ్యకాలంలో దేశవ్యాప్తంగా కోటి మంది ప్రజలు ఉపాధి కోల్పోయారు. జూన్‌ నాటికి వీరిలో 85 శాతం ఉద్యోగాలను తిరిగి పొందగలిగారు. కానీ, దాదాపు 15 లక్షల మంది కార్మికులు తమ ఉపాధిని పూర్తిగా కోల్పోయారు. గడచిన ఏడాది జనవరిలో నలుగురు సభ్యులు ఉన్న కుటుంబం తలసరి నెలవారీ ఆదాయం రూ.5,989గా ఉంటే, అక్టోబరు నాటికి రూ.4,979కి పడిపోయింది. దేశవ్యాప్తంగా వేతనజీవుల్లో యాభై శాతం వరకు లాక్‌డౌన్‌ తదనంతర కాలంలో నిరుద్యోగులుగా మిగిలిపోయారు. వీరిలో 30 శాతం స్వయంఉపాధిని ఎంచుకున్నారు. పది శాతం రోజువారీ కూలీలుగా, మరో తొమ్మిది శాతం అసంఘటిత రంగంలో తాత్కాలిక కూలీలుగా మారిపోయారని అజీమ్‌ప్రేమ్‌జీ విశ్వవిద్యాలయ నివేదిక వెల్లడించింది.

సామాజిక వర్గాల వారీగా పరిశీలించినప్పుడు ఓసీ, బీసీ వర్గాలకు చెందిన కార్మికులు స్వయంఉపాధి వైపు వెళ్లారు. ముస్లిములు, అణగారిన వర్గాల శ్రామికులు రోజూవారీ కూలీలుగా మారడం గమనార్హం. మహిళా కార్మికులు, యువతపైనా కొవిడ్‌ తీవ్ర ప్రభావాన్ని చూపింది. మహిళా కార్మికుల్లో 19 శాతమే లాక్‌డౌన్‌ అనంతరం తిరిగి ఏదో ఒక పనిలో కుదురుకున్నారు. 47 శాతం శాశ్వతంగా ఉపాధిని కోల్పోయారు. రంగాల వారీగా విశ్లేషిస్తే విద్య, సేవారంగాలకు చెందినవారు అత్యధికంగా ఉపాధికోసం ఇతర రంగాలను ఆశ్రయించవలసి వచ్చింది. వ్యవసాయం, భవన నిర్మాణ రంగాల్లో కూలీలుగా పనిచేస్తూ చాలామంది తమ కుటుంబాలను పోషించుకుంటున్నారు.

17 శాతం కోత..
కొవిడ్‌తో ఉపాధి, ఆదాయాలు కోసుకుపోవడంతో స్థూల దేశీయోత్పత్తి(జీడీపీ)లో శ్రామికశక్తి వాటా అయిదు శాతం తగ్గిపోయింది. 2019-20 రెండో త్రైమాసికంలో 32.5 శాతంగా ఉన్న ఈ వాటా, 2020-21 రెండో త్రైమాసికానికి వచ్చేసరికి 27 శాతానికి పడిపోయింది. దీనికి ప్రధాన కారణం 90 శాతం కార్మికుల ఆదాయాలు తగ్గడం, మరో పది శాతం శ్రామికులు శాశ్వతంగా ఉపాధిని కోల్పోవడమే! చేస్తున్న పనిలోంచి అర్ధాంతరంగా తప్పుకోవాల్సి రావడంతో చాలామంది తక్కువ వేతనాలతోనే ఏదో ఒక ఉపాధి మార్గంలో సర్దుకుపోవాల్సి వచ్చింది. ఫలితంగా కార్మికుల నెలవారీ సగటు ఆదాయాల్లో 17 శాతం వరకు కోతపడింది.

మరోవైపు, కరోనా విలయం ధాటికి దాదాపు 23 కోట్ల మంది దేశీయుల రోజూవారీ ఆదాయం జాతీయ కనీస వేతనమైన రూ.375 కన్నా తక్కువకు దిగజారిపోవడం ఆందోళన కలిగిస్తోంది. దీనితో దేశవ్యాప్తంగా అసంఘటిత రంగంలో పనిచేస్తున్న 45 కోట్ల మంది కార్మికుల్లో అత్యధికులు కటిక పేదరికంలోకి జారిపోయి ఆకలి బాధలతో అలమటిస్తున్నారు. కొవిడ్‌ రెండో దశ విజృంభణ కొనసాగితే దేశంలో ఆకలి చావులు పెరిగే ప్రమాదం పొంచి ఉందని సామాజికవేత్తలు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. ఈ దుర్భర పరిస్థితుల దృష్ట్యా దేశంలో సామాజిక సంక్షేమ కార్యక్రమాలను పునర్‌వ్యవస్థీకరించడం తక్షణావసరం. గరీబ్‌ కల్యాణ్‌ యోజన కింద కేంద్రం ప్రకటించిన సాయం క్షేత్రస్థాయిలో ఆపన్నులకు పక్కాగా చేరేలా చూడాలి. ప్రజా పంపిణీ వ్యవస్థలోని లోపాలను సరిదిద్ది ఈ గండం గడిచే వరకు ఉచిత రేషన్‌ సదుపాయాన్ని కొనసాగించాలి. ఉపాధి హామీ పథకం పనిదినాలను పెంచి పట్టణ ప్రాంతాలకూ విస్తరించాలి. కొవిడ్‌ ముప్పును తప్పించడానికి టీకాలు వేయడం ఎంత ముఖ్యమో- ఉపాధి మార్గాలు మూసుకుపోయి కునారిల్లుతున్న సామాన్యులకు అండదండలు అందించడమూ అంతే అవసరం!

- డాక్టర్‌ జీవీఎల్‌ విజయ్‌కుమార్‌ (భూ విజ్ఞానశాస్త్ర నిపుణులు)

ఇదీ చదవండి:లాక్‌డౌన్​తో ఇంటికే పరిమితమైనా విధుల్లో ఉన్నట్లే..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.