ETV Bharat / opinion

ఎవరికో కొమ్ము కాస్తూ.. సంస్కారానికి నిప్పు పెట్టేశారే!

author img

By

Published : Oct 4, 2020, 7:33 AM IST

ఆధునిక భారతంలో ఆగకుండా సాగుతున్న మానభంగ పర్వంలో ఉత్తర్​ప్రదేశ్ ఖ్యాతి మరింతగా విస్తారమవుతోంది. దేశంలో నిరుడు మహిళలపై హత్యాచారాలు, హింసాకాండ, వేధింపులు, దాడులకు సంబంధించి నమోదైన కేసులు నాలుగు లక్షలకు మించిపోయాయి. అందులో యూపీవంతు దాదాపు అరవై వేలు. ఇటీవల దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన హాథ్రస్, బలరాంపుర్​ అత్యాచార ఘటనల్లో యూపీ పోలీసులు, ప్రభుత్వం తీరు ప్రశ్నార్థకంగా మారింది.

Hathras case
కుబుసం విడిచిన కుసంస్కారం

జనారణ్యంలో మదోన్మత్త మానవ క్రూరమృగాలు నిస్సహాయ లేడికూనలను వేటాడుతూ వినోదిస్తున్న అంతులేని కథలో మరో విషాద ఘట్టమిది. 'నిర్భయ' తరహా ఉదంతం నేపథ్యంలో ఉత్తర్‌ప్రదేశ్‌లోని హాథ్రస్‌ జిల్లా బుల్‌గర్హి గ్రామం పేరిప్పుడు దేశ విదేశాల్లో మార్మోగుతోంది. పందొమ్మిదేళ్ల దళిత యువతిపై అదే ఊరికి చెందిన నలుగురి అమానుష దమనకాండ వింటే ఎవరికైనా ఒళ్లు గగుర్పొడుస్తుంది.

గడ్డి కోసుకోవడానికి తల్లితోపాటు పొలాల వద్దకు వెళ్ళిన అభాగ్యురాలు మృగాళ్ల పాలబడి కడకు దిల్లీ సఫ్దర్‌జంగ్‌ ఆస్పత్రిలో తేలి పక్షం రోజుల విఫల పోరాటం దరిమిలా విగతజీవురాలైంది. ఆమె వెన్నెముక ఛిద్రమైంది, నాలుక కోసేశారు. తల్లి వెతుక్కుంటూ వచ్చేసరికి ఒంటిమీద దుస్తులు లేని స్థితిలో కంటపడిన ఆ అమ్మాయి సామూహిక అత్యాచారానికి గురైందన్నది వట్టి అసత్య ప్రచారమని యూపీ పోలీసు గణం సెలవిచ్చింది.

ఘటన చోటుచేసుకున్న 96 గంటల్లోపు కీలక సాక్ష్యాధారాల సేకరణ జరిగితీరాలన్న నిబంధనల్ని తుంగలో తొక్కిన పోలీసులు, ఆమెను ఆస్పత్రికి తరలించిన 11 రోజుల తరవాత తీరిగ్గా విశ్లేషణలు చేపట్టి- 'గ్యాంగ్‌రేప్‌' ఆరోపణలు బూటకమని అడ్డగోలుగా నిర్ధారించారు. బాధితురాలి మరణ వాంగ్మూలాన్నీ దారుణంగా అపహసించారు.

"ఏ ఠాకూర్‌ సంతానమో అయితే నా బిడ్డకు ఈ గతి పట్టేదా... దళితులుగా పుట్టడమే మా ఖర్మ!" అని గుండెలు బాదుకుంటున్న ఆ కన్నతల్లి ఆక్రందనలకు ఎవరు సమాధానం చెప్పగలరు?

అర్ధరాత్రి వేళ శవదహనమా?

సామూహిక అత్యాచారమన్నది పచ్చి అబద్ధమని చాటడానికే పోలీసుల ఘనత పరిమితం కాలేదు. ఆస్పత్రిలో ప్రాణాలు విడిచిన యువతి శవాన్ని కుటుంబసభ్యులకు అప్పజెప్పలేదు. ఎవరి ఆదేశాలో తు.చ. తప్పకుండా పాటిస్తున్న చందంగా, బాధితురాలి భౌతిక కాయాన్ని ఊరికి తరలించి చీకటిమాటున రాత్రి రెండున్నర గంటల వేళ హడావుడిగా శవదహనం కానిచ్చేశారు. అవమానకరమైన రీతిలో అంత్యక్రియలు జరిపించారన్నది చిన్నమాట. వాళ్లు- సంస్కారానికి అక్షరాలా నిప్పుపెట్టారు!

తమకు మాటమాత్రంగానైనా చెప్పకుండా అపరాత్రి వేళ శవదహనం చేయడమేమిటన్న ఆ కుటుంబసభ్యుల సూటిప్రశ్నకు ఇప్పటికీ సరైన సమాధానం దొరకలేదు. హాథ్రస్‌ యువతి విషాదాంతం దేశాన్ని పట్టి కుదిపేస్తుండగానే, అదే యూపీలోని బలరామ్‌పూర్‌లో అటువంటి దుర్ఘటనే పునరావృతమైంది.

కళాశాలలో ప్రవేశం కోసం వెళ్ళిన 22ఏళ్ల యువతిని ముగ్గురు మృగాళ్లు అపహరించుకుపోయి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డాక, తీవ్రగాయాలూ రక్తస్రావంతో ఆ అభాగినీ మృతి చెందింది. ఆస్పత్రినుంచి మృతదేహాన్ని తీసుకెళ్ళిన పోలీసులు మొన్న బుధవారం రాత్రి ఆదరాబాదరా ఆమె అంత్యక్రియలు నిర్వహించారు.

ఎవరెంతగా ఛీత్కరించినా తమ తీరు మారేది కాదని యూపీ పోలీసులు నిర్లజ్జగా చాటుకుంటుంటే- దోషుల్ని ఉపేక్షించేది లేదని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ ఘనంగా చెబుతున్నారు. ఎస్పీతోపాటు కొందరు అధికారులపై వేటువేసి, ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్‌) నియమించినట్లు ఆయన ప్రకటించారు. సిట్‌ వేశారు సరే, బాధిత యువతి కుటుంబంతో ఎవరూ మాట్లాడకుండా ఊళ్లో బారికేడ్లు ఏర్పాటు చేసి, హాథ్రస్‌ జిల్లా అంతటా సెక్షన్‌ 144 విధించి- ఏం దాచిపెట్టడానికి ప్రభుత్వ యంత్రాంగం అంతగా తాపత్రయపడినట్లు? కాస్తోకూస్తో నగదు, భూమి ఆశచూపి బాధిత కుటుంబాల నోరు మూయించే యత్నాలు చూడబోతే- అక్కడి సర్కారు ఎవరి కొమ్ముకాసే కృషిలో తలమునకలై ఉందో ప్రస్ఫుటమవుతూనే ఉంది!

నేరాల్లో దూసుకెళ్తున్న యూపీ

ఆధునిక భారతంలో ఆగకుండా సాగుతున్న మానభంగ పర్వంలో యూపీ ఖ్యాతి మరెంత విస్తారమైనదో జాతీయ నేర రికార్డుల బ్యూరో (ఎన్‌సీఆర్‌బీ) తాజా నివేదికాంశాలు చాటుతున్నాయి. దేశంలో నిరుడు మహిళలపై హత్యాచారాలు, హింసాకాండ, వేధింపులు, దాడులకు సంబంధించి నమోదైన కేసులు నాలుగు లక్షలకు మించిపోయాయి. అందులో యూపీవంతు దాదాపు అరవైవేలు.

పవిత్ర భారతావనిలో- ప్రతిరోజూ సగటున 87 అత్యాచారాలు నమోదవుతున్నాయి. వెలుగు చూడని ఘోరాలు మరెన్నో ఎవరికెరుక! 'ఇండియా అంటే నేరాలు, అత్యాచారాలు తప్ప మరేమీ కానట్లుంది' అని బాంబే హైకోర్టు; 'నేను పుట్టి పెరిగిన భారతదేశ మౌలిక సంస్కృతి ఇది కానేకాదు' అని అరుంధతీరాయ్‌ వంటి వారు ఆక్రోశించడం- భీతావహ దుస్థితిని కళ్లకు కడుతోంది.

ఆ మధ్య అనంతపురంలో తొమ్మిదో తరగతి విద్యార్థినిపై ఓ ట్యాక్సీ డ్రైవరుతోపాటు ఆమె సొంత అన్నయ్య నైచ్యానికి తెగబడటం, నల్గొండ జిల్లాలో తొంభై ఏళ్ల వృద్ధురాలిపై హత్యాచారం- లైంగిక హింస దిగ్భ్రాంతకర స్థాయికి చేరిన వైనాన్ని స్పష్టీకరిస్తోంది. 'తాను భద్రంగా ఉన్నానని భారత మహిళ ఎప్పడు భావించగలుగుతుంది?' అని 2013 గాంధీ జయంతి నాడు నరేంద్ర మోదీ ట్వీట్‌ చేశారు. ఏడు సంవత్సరాలు గిర్రున తిరిగినా, సరైన జవాబు కోసం దేశ ప్రజలు నేటికీ నిరీక్షిస్తూనే ఉన్నారు!

ప్రక్షాళనకు నాంది పలకాలి

అరచేతిలో ఇమిడే స్మార్ట్‌ఫోన్లు, అంతర్జాల విప్లవాలను వెన్నంటి అశ్లీల వెబ్‌సైట్ల ఉరవడి యువతలో పశువాంఛను ప్రేరేపించి నైతిక విలువలకు తలకొరివి పెడుతోంది. చట్టాలు రూపొందించడంతోనే ఘోరాలకు నేరాలకు అడ్డుకట్ట పడబోదని పదేపదే రుజువవుతోంది.

దేశంలో ఎక్కడ ఏమూలనైనా లైంగిక హింస, స్త్రీలపై దాడులను ఉక్కుపాదంతో అణిచివేసేలా హుటాహుటి విచారణ, సత్వరమే కఠిన దండనలకు ప్రభుత్వాలు సర్వసన్నద్ధమై ఉంటే- అసలు ఇన్ని దారుణాల్ని దేశం చూడాల్సి వచ్చేదా? ఇప్పటికైనా అవి మేలుకొని- మద్యపానం, మాదకద్రవ్యాలు, అశ్లీల వీడియోల విష సంస్కృతిని అరికట్టాలి.

ఆడపిల్లల పట్ల మర్యాదా మన్ననలు చూపి, వారి భద్రతకు బాధ్యత వహించాలన్న సంస్కార బీజాలు పిల్లల మెదళ్లలో నాటుకునేలా ప్రాథమిక స్థాయినుంచీ పాఠ్యాంశాల కూర్పును ప్రక్షాళించాలి. సమాజంలో కుసంస్కారం దురహంకారం కుబుసం విడిస్తేనే, అత్యాచారాలు ఇంతగా పెచ్చరిల్లుతాయి. చట్టబద్ధంగాను, సంస్కారయుతంగాను పకడ్బందీ చికిత్స ఒక్కటే అందుకు సరైన విరుగుడు. ఏమంటారు?

- బాలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.