ETV Bharat / opinion

మౌలిక వసతులతోనే అభివృద్ధికి చురుకు

author img

By

Published : Sep 12, 2021, 4:18 AM IST

Updated : Sep 12, 2021, 6:31 AM IST

increase in infrastructure
మౌలిక వసతులతోనే అభివృద్ధికి చురుకు

మనకున్న సహజ వనరులను సద్వినియోగం చేసుకోవడం ద్వారా వృద్ధికి బాటలు వేసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. దేశంలో మౌలిక వసతులను భారీయెత్తున విస్తరిస్తే అది ఆర్థికాభివృద్ధికి గొప్ప ఆలంబన అవుతుందని అభిప్రాయపడుతున్నారు.

భారతదేశం స్వాతంత్య్ర అమృతోత్సవాలు జరుపుకొంటున్న సందర్భంలో, 1947 నుంచి ఇంతవరకు మన ఆర్థిక ప్రస్థానాన్ని సమీక్షించుకోవడం అవసరం. పాత పొరపాట్లను సరిదిద్దుకొని వినూత్న అజెండాతో అభివృద్ధిలో కొత్త శిఖరాలను అందుకోవడానికి పక్కా ప్రణాళిక రచించుకోవాలి. భారత ఆర్థిక వ్యవస్థ ఇంతవరకు రెండు ప్రధాన దశలను చూసింది. 1947 నుంచి 1991 వరకు నడిచినది మొదటి దశ అయితే, 1991 తరవాత ఆర్థిక సరళీకరణ, సంస్కరణలతో రెండో దశలోకి అడుగుపెట్టాం.

మొదటి దశలో వలస పాలకుల వల్ల మన దేశానికి జరిగిన తీవ్ర ఆర్థిక నష్టాలను అధిగమించడానికి జవహర్‌లాల్‌ నెహ్రూ ప్రభుత్వం ప్రధానంగా పారిశ్రామికీకరణపై భారీ పెట్టుబడులు పెట్టింది. రైతులు, వ్యవసాయ కూలీల శ్రేయస్సు, వ్యవసాయాభివృద్ధికి మాత్రం అదే స్థాయి ప్రాధాన్యం ఇవ్వలేకపోయింది. పెద్దయెత్తున జౌళి మిల్లులు, ఉక్కు ప్లాంట్లు, రైల్వే లైన్ల విస్తరణపై పెట్టినంత దృష్టి వ్యవసాయానికి ఇవ్వకపోవడం సమాజంలో తీవ్ర అంతరాలను సృష్టించింది.

పీవీ నరసింహారావు ప్రభుత్వం 1991లో తన ఆర్థిక సంస్కరణల్లో భాగంగా ప్రభుత్వ రంగ సంస్థలను 17 నుంచి ఎనిమిదికి కుదించి, కొన్ని విభాగాల్లో పోటీని ప్రోత్సహించింది. కొన్ని ప్రభుత్వ రంగ సంస్థల వాటాలను విక్రయించి, మూలధనాన్ని సమీకరించింది. సాధారణ ప్రజానీకం కూడా ప్రభుత్వ రంగ సంస్థల వాటాలను కొనుగోలు చేయడానికి అవకాశమిచ్చింది. అయితే, మిగిలిన ప్రభుత్వ రంగ సంస్థలు వృద్ధి సాధించడానికి అనుకూల వాతావరణం కల్పించలేకపోయింది. ఆర్థిక సరళీకరణకు ముందు, తరవాత మౌలిక వసతుల కల్పన ఊపందుకోలేదు. మన భవన నిర్మాణ రంగం పునాదులు నేటికీ బలహీనంగానే ఉన్నాయి.

కొవిడ్‌ ప్రతికూల ప్రభావం

కొవిడ్‌ ప్రజల జీవితాలపై దీర్ఘకాలిక విషమ ప్రభావం చూపబోతోంది. వైరస్‌ విజృంభణ, లాక్‌డౌన్‌లు వ్యాపారాలను, ఉద్యోగాలను దెబ్బకొట్టాయి. 1929 నాటి మహా ఆర్థిక కుంగుబాటు తరవాత మళ్ళీ అంతటి ఆర్థిక విధ్వంసాన్ని నేడు అనుభవిస్తున్నాం. పండ్ల తోటలు, కోళ్ల పరిశ్రమ నష్టాలను చవిచూస్తున్నా మొత్తం మీద వ్యవసాయ రంగం నిలదొక్కుకుని, కొవిడ్‌ కష్టకాలంలో దేశానికి ఆశాకిరణంగా భాసిస్తోంది. ప్రజల ఆదాయాలు పడిపోవడం వల్ల కొనుగోలు శక్తి తగ్గి పారిశ్రామిక రంగంలో గిరాకీ మందగించింది. ముఖ్యంగా విడిభాగాలు, ముడి సరకుల సరఫరా దెబ్బతినడం వల్ల- సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలు, ఆటోమోటివ్‌ రంగం బాగా నష్టపోయాయి.

హోటళ్లు, రెస్టారెంట్లు, పర్యాటక రంగాలను కొవిడ్‌ కుంటుపరచింది. లాక్‌డౌన్ల మధ్య కూడా డిజిటల్‌ సాంకేతికతలతో పనులు కొనసాగిస్తూ సేవల రంగం వృద్ధి రేట్లను నమోదు చేస్తోంది. మొత్తమ్మీద భారత ఆర్థిక వ్యవస్థలోని లోపాలన్నీ కొవిడ్‌తో బహిర్గతమయ్యాయి. 2020 ఆర్థిక సంవత్సరంలో భారత జీడీపీలో 51.6 శాతంగా ఉన్న రుణభారం 2021 ఆర్థిక సంవత్సరంలో 60.5 శాతానికి పెరిగిందని ప్రభుత్వం రాజ్యసభకు వెల్లడించింది. అభివృద్ధి ఊపందుకుంటే కానీ, ఈ రుణ భారాన్ని అధిగమించలేం. ముఖ్యంగా ప్రజల ఆదాయాలు, కొనుగోలు శక్తి పెరిగినప్పుడు వస్తుసేవల ఉత్పత్తి, దానితోపాటు ఉపాధి అవకాశాలు విస్తరిస్తాయి. కొవిడ్‌ రెండు, మూడో దశల నుంచి ఆర్థిక వ్యవస్థను కాపాడుకోవడానికి ప్రభుత్వం మరింత సమర్థంగా, చురుగ్గా ముందుకు కదలాల్సి ఉంది.

సహజ వనరుల సద్వినియోగం

మనకున్న సహజ వనరులను సద్వినియోగం చేసుకోవడం ద్వారా వృద్ధికి బాటలు వేసుకోవాలి. భారతదేశంలో అన్ని జిల్లాల్లో సౌర, పవన విద్యుదుత్పాదన కేంద్రాలను నెలకొల్పడం ఒక మార్గం. దీనివల్ల వ్యవసాయానికి, పరిశ్రమలకు విద్యుత్‌ అందడం సహా స్థానికంగా ఉపాధి అవకాశాలు, తద్వారా ఆదాయాలు పెరుగుతాయి. ఇంధన రంగంతోపాటు సముద్ర వనరులను, గగనతలాన్ని లాభసాటిగా వినియోగించుకుంటే వృద్ధి, ఉపాధి సమకూరతాయి. ఉదాహరణకు భారతదేశం ప్రాక్పశ్చిమాల మధ్య రవాణా వారధిగా నిలవగలదు. పశ్చిమాసియాకు, దూర ప్రాచ్య దేశాలకు మధ్య విమానాలు, నౌకల ద్వారా సరకులు, ప్రయాణికుల రవాణాకు అనువుగా మన విమానాశ్రయాలను, ఓడ రేవులను విస్తృతంగా అభివృద్ధి చేయాలి. అందుకు స్వదేశీ, విదేశీ సంస్థల నుంచి భారీ పెట్టుబడులను ఆకర్షించవచ్చు. మన తూర్పు, పశ్చిమ తీరాల్లోని రేవులను కాలువలు, రోడ్డు, రైలు సౌకర్యాలతో అనుసంధానించాలి. అది కోస్తా ప్రాంతాల సత్వర అభివృద్ధికి తోడ్పడుతుంది.

భారతీయ, విదేశీ రేవుల మధ్య రవాణా సంబంధాలను పటిష్ఠీకరిస్తే- ఎగుమతులు, దిగుమతులు పెరిగి మన వృద్ధి రేటు విజృంభిస్తుంది. ఉపాధి అవకాశాలు, తద్వారా జనం ఆదాయాలూ పెరుగుతాయి. అదే సమయంలో గగనతల, సముద్ర వనరుల వినియోగం పర్యావరణానుకూలంగా జరిగేట్లు జాగ్రత్తపడాలి. సముద్ర తీర పర్యాటకాన్నీ ప్రోత్సహించి థీమ్‌ పార్కులు, హోటళ్లు, రిసార్టులు, పార్కింగ్‌ సౌకర్యాలను ఏర్పరచాలి. ఈ రంగంలో అధునాతన సమాచార సాంకేతిక పరిజ్ఞానం, ఆధునికీకరణ పద్ధతులను అవలంబిస్తే పెట్టుబడులు వెల్లువెత్తుతాయి. ఉపాధి, వ్యాపారాలు వికసిస్తాయి.

దేశంలో మౌలిక వసతులను భారీయెత్తున విస్తరిస్తే అది ఆర్థికాభివృద్ధికి గొప్ప ఆలంబన అవుతుంది. బంగాళాఖాతం నుంచి అరేబియా సముద్రం వరకు రహదారులు, ఎలివేటెడ్‌ (ఎత్తయిన) ఎక్స్‌ప్రెస్‌ మార్గాల నిర్మాణం చేపట్టడం ఓ బృహత్తర ప్రాజెక్టు అవుతుంది. రోడ్లు, వంతెనలు, సొరంగ మార్గాల నిర్మాణానికి అధునాతన సాంకేతికతను ఉపయోగించాలి. నిర్మాణ సామగ్రిలో, సాధనాల్లో ఎప్పటికప్పుడు వస్తున్న మార్పులను అందిపుచ్చుకోవాలి. బంగ్లాదేశ్‌, భారత్‌, శ్రీలంకలను కలుపుతూ తూర్పుతీర రహదారి ప్రాజెక్టు నిర్మాణ ప్రాజెక్టు కార్యరూపం ధరిస్తే, భారత జీడీపీ 2.5 శాతం పెరుగుతుంది. తీరం వెంబడి పర్యాటకం వృద్ధిచెందుతుంది. సరఫరా గొలుసులు బలోపేతమై వాణిజ్యం అధిక వృద్ధి రేటు నమోదు చేస్తుంది. పశ్చిమ్‌ బంగ, ఒడిశా, ఆంధ్రప్రదేశ్‌, తమిళనాడులకు తూర్పుతీర రహదారి ప్రాజెక్టు జీవనాడిగా మారుతుంది.

తొలగని అయోమయం

అన్ని వస్తుసేవలపై పన్నులు విధించడం ద్వారా ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది. అయితే, ప్రజల ఆదాయాలపై అధిక ఒత్తిడి పడటం అనర్థదాయకం. పెట్రోలు ధరలు మండిపోవడానికి కారణమిదే. కొవిడ్‌ మహమ్మారి వల్ల ప్రభుత్వ ఆదాయం పడిపోయి, ఖర్చులు పెరిగిపోయినందువల్ల పన్నులను తగ్గించే పరిస్థితి లేకుండా పోతోంది. వినియోగంపై అధిక పన్నులు విధించడం ద్వారా అభివృద్ధి సాధించలేం. వ్యవస్థాపక సామర్థ్యం, పెట్టుబడులను పెంచడం ద్వారానే ఉపాధి, ప్రగతి సిద్ధిస్తాయి. పెట్రోలియంతోపాటు నిత్యావసర సరకుల ధరలూ పెరిగి పౌరులు ఇబ్బందులు పడుతున్నారన్నది వాస్తవం.

పండ్లూ కూరగాయలు, ఆహార ధాన్యాల సరఫరాను పెంచడం ద్వారా ధరలకు కళ్లెం వేయవచ్చు. ఐటీ ఆధారిత సరఫరా గొలుసులు దీనికి తోడ్పడతాయి. రహదారి పన్నులను తగ్గించి, పండ్లూ కూరగాయలను శీతల గిడ్డంగుల్లో భద్రపరచి, శీతలీకరించిన వాహనాల్లో దుకాణాలకు సకాలంలో చేరవేయడం ద్వారా వినియోగదారులకు తక్కువ ధరకే నాణ్యమైన సరకు అందించవచ్చు. రైతులకు ఆదాయాలు పెరుగుతాయి. మరోవైపు వస్తుసేవల పన్ను(జీఎస్టీ) ప్రవేశపెట్టి మూడేళ్లవుతున్నా, దానిపై అయోమయం తొలగలేదు. ఆన్‌లైన్‌ జీఎస్టీ చెల్లింపులు జరపడం చిన్న వర్తకులకు ఇప్పటికీ కష్టంగానే ఉంది. సంపద సృష్టి జరిగితేనే దానిపై పన్నుల ద్వారా ఆదాయం లభిస్తుంది. కొవిడ్‌తో ఆదాయాలు కుదేలై, సంపద సృష్టి దెబ్బతిని జీఎస్టీ ఓ గుదిబండగా పరిణమిస్తోంది.

గతంలో ఏటా ఏడు నుంచి ఎనిమిది శాతం జీడీపీ వృద్ధి రేటును సాధించిన భారత్‌, 2019-20 చివరి త్రైమాసికంలో 3.1 శాతం వృద్ధి రేటుతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ప్రభుత్వానికి ఆదాయం తక్కువ, వ్యయం ఎక్కువ అయిపోతోంది. ఖర్చులను 10 నుంచి 12 శాతం తగ్గించుకుంటే పరిస్థితి కొంతలో కొంత మెరుగుపడుతుంది. జీఎస్టీని, సర్వీసు పన్నును, రహదారులపై టోల్‌ పన్నులను తగ్గించాలి. అన్ని రహదారులపై పన్నులు వసూలు చేయనక్కర్లేదు. వ్యక్తిగత ఆదాయ పన్నులను ఎత్తివేయాలి. పెట్రోలియం ధరలను 45 శాతం తగ్గించాలి. రవాణా వ్యయం 40 శాతం తగ్గాలి. ఈ చర్యల వల్ల దేశంలో ఆర్థిక కార్యకలాపాలు పుంజుకొంటాయి. ప్రజల ఆదాయాలు పెరుగుతాయి. జీడీపీ వృద్ధిబాట పడుతుంది.

నోట్లరద్దుతో పెద్ద చిక్కు

కేంద్ర ప్రభుత్వం గొప్ప ఆర్థిక సంస్కరణగా అభివర్ణించిన పెద్ద నోట్ల రద్దు నిర్ణయం ఆశించిన లక్ష్యాలను సాధించకపోగా, పెను నష్టాలను తెచ్చిపెట్టింది. ఈ నిర్ణయం నగదు ఆధారిత ఆర్థిక వ్యవస్థను దెబ్బకొట్టింది. దేశంలో చలామణీలో ఉన్న నగదులో 86 శాతాన్ని తుడిచిపెట్టి- రైతులు, చిన్న వ్యాపారులు, సాధారణ పౌరులు చేతిలో డబ్బు తిరగక కష్టనష్టాల పాలయ్యేలా చేసింది. పెద్ద నోట్ల రద్దు బదులు పన్ను రేట్లు తగ్గించి, పన్ను మినహాయింపులు తొలగిస్తే బాగుండేది. వాటితో పాటు ప్రత్యేక కోర్టుల్లో పన్ను వివాదాలను వేగంగా పరిష్కరించడం, సమగ్ర పన్ను విధానాన్ని రూపొందించడం వంటి చర్యల ద్వారా ఎక్కువ ఫలితాలు లభించి ఉండేవి.

మత్స్యకారులకు శిక్షణ

తూర్పున పశ్చిమ్‌ బంగ నుంచి పశ్చిమాన గుజరాత్‌ వరకు లక్షలాది గంగపుత్రులకు సముద్ర సంపదే జీవనోపాధి కల్పిస్తోంది. సంపన్న దేశాల్లోని జాలరుల మల్లే భారతీయ మత్స్యకారులకు అధునాతన నావిగేషన్‌ జీపీఎస్‌ సౌకర్యాలున్న మరపడవలను అందించాలి. దీనివల్ల వారు సముద్రంలో దూర ప్రాంతాలకు వెళ్ళి వేటాడి అధిక ఫలాలు సాధిస్తారు. చేపల వేటకు, చేపలు, రొయ్యల చెరువులకు అధునాతన మేనేజ్‌మెంట్‌ ఇన్ఫర్మేషన్‌ సిస్టమ్‌ (ఎంఐఎస్‌) అందించాలి. జాలరులకు ఈ నవ్యరీతుల వినియోగంలో శిక్షణ ఇస్తే మత్స్య ఎగుమతులు పెరిగి దేశానికీ అధిక ఆదాయం వస్తుంది.

-ప్రొఫెసర్​ జీవీఆర్​ శాస్త్రి

ఇదీ చూడండి : మహా విషాదం.. మలబార్​ వీరుల 'వ్యాగన్​ ట్రాజెడీ'కి వందేళ్లు

Last Updated :Sep 12, 2021, 6:31 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.