ETV Bharat / opinion

బతుకు బరువు... రక్షణ కరవు

author img

By

Published : Jun 1, 2020, 7:52 AM IST

దేశంలో కరోనా మహమ్మారి కారణంగా తలెత్తిన ఆర్థిక సంక్షోభానికి అత్యధికంగా బలైన వారిలో వలస కార్మికులే ముందు వరసలో ఉంటారు. ఊరుగానిఊరులో, అసంఘటిత రంగంలో, సామాజిక భద్రత లేకుండా, తాత్కాలిక పనులు చేసుకుంటూ బతికే బడుగు జీవులు లాక్‌డౌన్‌ కారణంగా ఉన్న ఉపాధి కూడా కోల్పోయి, సొంత ప్రాంతాలకు ‘తిరుగు వలస’ బాట పట్టారు. వలస కార్మికులకు సంబంధించిన సరైన చట్టాలు, ప్రభుత్వ విధానాలు, యంత్రాంగాలు లేకపోవడమే ఈ దురవస్థకు కారణం.

editorial
బతుకు బరువు... రక్షణ కరవు

దేశంలో గత మూడు దశాబ్దాల సంస్కరణల కాలంలో చోటుచేసుకున్న అసమాన ప్రాంతీయ అభివృద్ధి ఫలితమే వలస కార్మికుల సమస్యకు కారణం. దేశంలో ఇప్పటికీ నిర్దిష్టంగా ఎంతమంది వలస కార్మికులు ఉన్నారనే దానిపై కచ్చితమైన లెక్కలు లేవు. 2016-17 ఆర్థిక సర్వే గణాంకాల ప్రకారం 2016లో దేశంలో వలస కార్మికుల సంఖ్య 8 నుంచి 14 కోట్లదాకా ఉండొచ్చనే అంచనా. దేశంలోని మొత్తం కార్మికుల్లో వీరి సంఖ్య 17 నుంచి 29 శాతందాకా ఉండొచ్ఛు వెనుకబడిన రాష్ట్రాలైన ఉత్తర్‌ప్రదేశ్‌, బిహార్‌, రాజస్థాన్‌, మధ్యప్రదేశ్‌, ఒడిశా, ఝార్ఖండ్‌, ఛత్తీస్‌గడ్‌ల నుంచే ఎక్కువగా వలస కూలీలు బయల్దేరుతున్నారు. వీరంతా అసంఘటిత రంగాల్లోనే ఎక్కువగా పని చేస్తున్నారు. స్థానిక కార్మికులు చేయలేని కష్టంతో కూడిన చౌక వేతనపు పనులే వీరికి దక్కుతాయి. సంఘటిత రంగం కార్మికుల తరహాలో వీరికి ఉద్యోగ, ఆరోగ్య, విద్య, గృహ, పింఛను వంటి సామాజిక భద్రత సదుపాయాలేవీ ఉండవు. యాజమాన్యాలతో ప్రత్యక్ష సంబంధం ఉండదు. మధ్యవర్తుల ద్వారా నియామకాలు దక్కించుకుంటారు. ప్రభుత్వాలు అందించే రాయితీ, ఉచిత ఆహార ధాన్యాలు, వంటగ్యాస్‌, నగదు బదిలీ వంటి సౌకర్యాలు కూడా వీరికి దక్కవు. ఆర్థిక వ్యవస్థలో చిన్నపాటి ఒడిడొడుకులు వచ్చినా తట్టుకొని నిలబడే శక్తి ఉండదు.

కొరవడిన చట్టాలు

దేశంలో వలస కార్మికుల సమస్యలను పరిష్కరించేందుకు ఇప్పటికీ సరైన చట్టాలు, ప్రభుత్వ విధానాలు లేవు. అంతర్‌ రాష్ట్ర వలస కార్మికుల చట్టం-1979 ప్రకారం ఒక రాష్ట్రం నుంచి మరొక రాష్ట్రానికి కార్మికులు వలస వచ్చినప్పుడు, యజమానులు వారి వివరాల్ని నమోదు చేసిి, వారికి సమాన వేతనాలు, ఇతర ఆరోగ్య, విద్య, పరిశుభ్రత, రవాణా వంటి సౌకర్యాలు కల్పించాలి. ఇవన్నీ చేస్తే స్థానిక కార్మికులపై చేసే ఖర్చుకన్నా పెరిగి పోతుందనే కారణంతో యజమానులు అంతరాష్ట్ర వలస కార్మికుల వివరాల్ని నమోదు చెయ్యకపోవడమో లేదా తక్కువ సంఖ్యలో నమోదు చెయ్యడమో జరుగుతుంది. కార్మికుల వలసలను నివారించే ఉద్దేశంతో అప్పట్లో రూపొందించిన ఈ చట్టం ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా లేదనే విమర్శలున్నాయి. రాష్ట్ర ప్రభుత్వాలన్నీ ఈ చట్టాన్ని అమలు చెయ్యకుండా పక్కన పడేయటంతో వలస కార్మికులకు సంబంధించిన నిర్దిష్ట సమాచారం ఉండటం లేదు. ఫలితంగా వారి సంక్షేమం కోసం సరైన విధానాలనూ రూపొందించలేని పరిస్థితి నెలకొంది.

దృష్టి కోణం మారాలి..

ఇప్పటికీ అంతర్‌ రాష్ట్ర కార్మికుల సమస్యలను, జీవనోపాధి సమస్యగా కాకుండా, శాంతిభద్రతల సమస్యగా చూడటం బాధాకరం. 1979 నాటి చట్టాన్ని నేటి పరిస్థితులకు అనుగుణంగా సవరించి, దేశంలో వలస కార్మికులందరి వివరాలూ నమోదయ్యేలా చర్యలు తీసుకోవాలి. ప్రొఫెసర్‌ అర్జున్‌సేన్‌ గుప్తా నేతృత్వంలోని జాతీయ అసంఘటిత రంగం కమిషన్‌ చేసిన సూచనల ప్రకారం... దేశంలో అన్ని రకాల అసంఘటిత కార్మికులను అధికారికంగా నమోదు చేసి వారికి కనీస హక్కులు, ఉద్యోగ, విద్య, వైద్య, సామాజిక భద్రతలు కల్పించి, గౌరవ మర్యాదలు కాపాడాలి. విదేశీ వలస కార్మికులకు విదేశాంగ మంత్రిత్వ శాఖలో ప్రత్యేక విభాగం ఏర్పర్చినట్లే, అంతరాష్ట్ర వలస కార్మికుల సంక్షేమ కోసం కార్మిక ఉద్యోగ మంత్రిత్వ శాఖలో ప్రత్యేక విభాగాన్ని, లేదా బోర్డును ఏర్పాటు చేయాలి. వలస కార్మికులు ఎక్కువగా ఉండే ప్రతి రాష్ట్రంలో, వలస కార్మికుల సంక్షేమ విభాగం లేదా బోర్డును ఏర్పాటు చేయాలి.

తోడ్పాటు అవసరం

సొంత ప్రాంతాలకు చేరిన కార్మికులు వెంటనే వలస బాట పట్టే పరిస్థితి లేదు. ప్రస్తుత పరిస్థితుల్లో దీర్ఘకాలిక సంస్థాగత చర్యలతోపాటు, తక్షణ చర్యగా కార్మికులకు వారి సొంత ప్రాంతాల్లోనే ఆదాయ మార్గాలు చూపాలి. వ్యవసాయ రంగంలో పండ్లు, కూరగాయల పంటలను ప్రోత్సహించాలి. వ్యవసాయ అనుబంధ రంగాలైన పాడి, గొర్రెలు, నాటు కోళ్లు, చేపలు వంటి వాటి పెంపకాన్ని ప్రత్యేకంగా ప్రోత్సహించాలి. ఉపాధి హామీ పథకం పనిదినాల్ని 150 రోజులకు పెంచి, దానిలో భాగంగా స్థానిక మౌలిక సదుపాయాలు, రహదారులు, నీటి పారుదల, తాగునీరు, పారిశుద్ధ్యం, గిడ్డంగి, విద్య, ఆరోగ్య, సామూహిక భవనాలు వంటి నిర్మాణాల్ని చేపట్టాలి. వలస కార్మికులతో స్వయం సహాయక బృందాలు ఏర్పాటు చేసి ప్రత్యేక రాయితీ రుణాలతో వినూత్న వ్యాపారాలను ప్రోత్సహించాలి. గ్రామీణ ప్రాంత సూక్ష్మ చిన్నపరిశ్రమలకు ప్రోత్సాహకాలిచ్చి వాటిలో తిరుగు వలస కార్మికులకు ఉపాధి కల్పించాలి. చిన్న, మధ్య తరహా పట్టణాలను అభివృద్ధి చేసి, వాటికి గ్రామీణ ప్రాంతాలతో అనుసంధానాన్ని పెంచడం ద్వారా దూరప్రాంత వలసలను తగ్గించవచ్చు.

రచయిత: డాక్టర్‌ చీరాల శంకర్‌ రావు

ఇదీ చూడండి: 'ఉగ్రవాదులతో పీఓకే ఫుల్​- ఏ క్షణమైనా భారత్​లోకి...'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.