ETV Bharat / opinion

మానవ హక్కులకు రక్షాకవచం.. 'సొలీ సొరాబ్జీ'

author img

By

Published : May 1, 2021, 8:17 AM IST

భారత అటార్నీ జనరల్‌గా రెండుసార్లు సేవలందించిన ప్రముఖ న్యాయవాది సొలీ సొరాబ్జీ.. మానవ హక్కులు, గౌరవ మర్యాదలను పరిరక్షించడమే చట్టబద్ధమైన పాలన అంతస్సూత్రంగా పనిచేశారు. అది పూర్తిగా అమల్లోకి వచ్చే సమయం కోసం ఎదురుచూస్తున్నానంటూ జీవితాంతం ఆ లక్ష్యసాధన కోసమే పరిశ్రమించారు. రాజ్యాంగ స్ఫూర్తికి గొడుగుపడుతూ భారత అత్యున్నత న్యాయస్థానం వెలువరించిన ఎన్నో విశిష్ట తీర్పుల వెనక ఈ వరిష్ఠ న్యాయకోవిదుడి దీక్షాసంకల్పం ద్యోతకమవుతుంది. జాజ్‌ సంగీత ప్రియుడిగా, సునిశిత మేధావిగా, న్యాయగ్రంథాల రచయితగా గుర్తింపు పొందిన సొలీ సొరాబ్జీ.. భారతీయ న్యాయరంగంలో ఓ మేరునగం!

Soli Sorabjee
సొలీ సొరాబ్జీ

'మానవ హక్కులు, గౌరవ మర్యాదలను పరిరక్షించడమే చట్టబద్ధమైన పాలన అంతస్సూత్రం. అది పూర్తిగా అమలులోకి వచ్చే సమయం కోసం ఎదురుచూస్తున్నాను' అంటూ జీవితాంతం ఆ లక్ష్యసాధన కోసమే పరిశ్రమించారు సొలీ జహంగీర్‌ సొరాబ్జీ. తొమ్మిది పదుల వయసులో కొవిడ్‌తో పోరాడి అలసి ఆఖరి శ్వాస విడిచిన ఈ 'పద్మవిభూషణుడు'.. అంతర్జాతీయ ఖ్యాతి గడించిన భారతీయ దిగ్గజ న్యాయవాదుల్లో ఒకరు. 'తమకు తెలిసిందే సత్యమని, తామే జ్ఞానకోవిదులమని ప్రతి ఒక్కరూ భావిస్తారు. తమ అభిప్రాయాలతో విభేదించిన వారి గొంతులను నొక్కేయడానికి ప్రయత్నిస్తారు. ప్రజాస్వామ్యానికి ఇది శ్రేయస్కరం కాదు' అని హెచ్చరించారాయన. రాజ్యాంగ స్ఫూర్తికి గొడుగుపడుతూ భారత అత్యున్నత న్యాయస్థానం వెలువరించిన ఎన్నో విశిష్ట తీర్పుల వెనక ఈ వరిష్ఠ న్యాయకోవిదుడి దీక్షాసంకల్పం ద్యోతకమవుతుంది.

బొంబాయి నుంచి హేగ్‌ వరకు

పరపీడనను నిరసిస్తూ మహాత్ముడు ఉప్పు సత్యాగ్రహానికి సంసిద్ధమవుతున్న వేళ.. 1930 మార్చి 9న బొంబాయిలో ఓ పార్శీ కుటుంబంలో జన్మించారు సొలీ సొరాబ్జీ. ప్రభుత్వ న్యాయ కళాశాలలో న్యాయవిద్యను పూర్తిచేసి, 1953లో వృత్తిజీవితం ప్రారంభించారు. కళాశాల విద్యార్థిగా 'కిన్లాక్‌ ఫోర్బ్స్‌' స్వర్ణ పతకాన్ని అందుకున్న ఆయన.. న్యాయవాదిగానూ అదే ప్రతిభ కనబరచారు. 1971లో సుప్రీంకోర్టులో సీనియర్‌ న్యాయవాదిగా గుర్తింపు పొందిన సొరాబ్జీ.. 1977-80 మధ్య భారతదేశ అదనపు సొలిసిటర్‌ జనరల్‌గా బాధ్యతలు నిర్వర్తించారు. ఈ పదవిలోకి రావడానికి నాలుగేళ్ల ముందే కేశవానంద భారతి కేసు ద్వారా ఆయన పేరు దేశమంతటి మార్మోగింది.

అంతర్జాతీయ న్యాయస్థానంలోనూ..

'రాజ్యాంగాన్ని పార్లమెంటు సవరించగలదు కానీ, దాని మౌలిక స్వరూపాన్ని మార్చజాలదు' అన్న చరిత్రాత్మక తీర్పు వెలువడటానికి కారణమైన ఈ కేసులో అప్పటి న్యాయవాద దిగ్గజాలు నానీఫాల్కీవాలా, ఫాలీ నారిమన్‌లతో కలిసి సొరాబ్జీ వాదనలు వినిపించారు. 1989-90, 1998-2004 మధ్యకాలంలో భారత అటార్నీ జనరల్‌గా వ్యవహరించిన ఆయన.. అంతర్జాతీయ న్యాయస్థానంలో(ఐసీజే) పాకిస్థాన్‌ వాదనలను ఖండించి భారత్‌ను గెలిపించారు. నైజీరియాలో మానవ హక్కుల పరిస్థితిని పరిశీలించడానికి ఐక్యరాజ్యసమితి ప్రత్యేక ప్రతినిధిగా వెళ్ళడం నుంచి మానవ హక్కుల సంరక్షణపై ఐరాస ఏర్పరచిన ఉపసంఘానికి అధ్యక్షత వహించడం, హేగ్‌లోని మధ్యవర్తిత్వ న్యాయస్థానం సభ్యుడిగా ఆరేళ్ల పాటు కొనసాగడం వరకు అంతర్జాతీయంగా సొరాబ్జీ అందించిన సేవలు- దేశ కీర్తిప్రతిష్ఠలను ఇనుమడింపజేశాయి.

'ప్రజల భావ వ్యక్తీకరణ హక్కును పరిరక్షించడం ప్రజాస్వామ్య ప్రభుత్వానికి ఉండాల్సిన అతి ముఖ్యమైన లక్షణం. భారత రాజ్యాంగం పౌరులకు ఆ భరోసానిస్తోంది.'

- సొలీ జహంగీర్‌ సొరాబ్జీ

మేనకాగాంధీ కేసులోనూ..

రాష్ట్ర ప్రభుత్వాలను రద్దు చేసే 356వ అధికరణం న్యాయసమీక్షకు అతీతం కాదని సుప్రీంకోర్టు స్పష్టీకరించిన ఎస్‌.ఆర్‌.బొమ్మై కేసులోనూ సొరాబ్జీ వాదనలు వినిపించారు. పోలీసు సంస్కరణలకు బాటలు పరుస్తూ జాతీయ పోలీస్‌ కమిషన్‌ను ఏర్పాటుచేయాలని కేంద్రాన్ని అత్యున్నత న్యాయస్థానం ఆదేశించిన ప్రకాశ్‌సింగ్‌ కేసులోనూ ఈ న్యాయ దిగ్గజానికి భాగస్వామ్యం ఉంది. పౌరులందరి జీవించే హక్కుకు హామీ ఇచ్చే రాజ్యాంగంలోని 21వ అధికరణ లోతులను తడుముతూ మేనకా గాంధీ కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పూ సొరాబ్జీ కృషి ఫలితమే. వ్యక్తి స్వేచ్ఛ అర్థాన్ని విస్తృతపరుస్తూ.. గౌరవప్రదమైన జీవితాన్ని గడపడానికి పౌరుడికి ఉన్న హక్కును కార్యనిర్వాహక ఉత్తర్వు ద్వారా గానీ, చట్టం ద్వారా గానీ ఏకపక్షంగా తొలగించజాలరని ఆ కేసులో న్యాయస్థానం స్పష్టంచేసింది.

1984 సిక్కు వ్యతిరేక అల్లర్ల బాధితుల తరఫునా సొరాబ్జీ గళమెత్తారు. సిటిజన్స్‌ జస్టిస్‌ కమిటీ తరఫున ఉచితంగా కేసులను స్వీకరించి న్యాయపోరాటం చేశారు. అలాగే, భావప్రకటనా స్వేచ్ఛకు ఆటంకాలు వాటిల్లిన అనేక సందర్భాల్లో ఆయన న్యాయస్థానాల తలుపులు తట్టారు. 'అధికారంలో ఏ పార్టీ ఉన్నా సరే- పత్రికా స్వేచ్ఛను హరించడానికి, విమర్శలను తొక్కిపెట్టడానికి ప్రయత్నిస్తూనే ఉంటుంది. నిర్మాణాత్మక విమర్శ ప్రజాస్వామ్యానికి చాలా అవసరం' అని పలు సందర్భాల్లో ఉద్ఘాటించిన సొరాబ్జీ- పాలకుల రాజ్యాంగ వ్యతిరేక చర్యలను సదా నిరసించారు. మానవ హక్కులు, భావప్రకటనా స్వేచ్ఛల పరిరక్షణకు చేసిన కృషికిగానూ 2002లో ఆయన 'పద్మవిభూషణ్‌' పురస్కారాన్ని అందుకున్నారు.

సునిశిత మేధావి

న్యాయమూర్తుల మీద నమ్మకం లేకపోతే ఈ దేశాన్ని ఇక ఆ దేవుడే కాపాడాలని వ్యాఖ్యానించిన సొరాబ్జీ- అవసరమైన సందర్భాల్లో న్యాయవ్యవస్థను విమర్శించడానికీ వెనకాడలేదు. న్యాయవాది ప్రశాంత్‌ భూషణ్‌పై దాఖలైన కోర్టుధిక్కరణ అభియోగాలపై విచారణ సందర్భంలో ఆయన సుప్రీంకోర్టు తీరును తప్పుపట్టారు. 'ప్రజలకు విభిన్న అభిప్రాయాలుంటాయి. సుప్రీంకోర్టుకు నచ్చనంత మాత్రాన భిన్న అభిప్రాయాలు ఉన్నవారిని శిక్షస్తారా?' అని సొరాబ్జీ ప్రశ్నించారు. ఇటీవల చాలామందిపై రాజద్రోహం కేసులను నమోదు చేస్తున్న నేపథ్యంలో 'నినాదాలు, ప్రభుత్వంపై విమర్శ రాజద్రోహం కిందకు రావు' అని కుండ బద్దలు కొట్టిన ఆయన.. ఈ చట్టాన్ని దుర్వినియోగం చేసే అధికారగణంపై చర్యలు తీసుకోవాలన్నారు. జాజ్‌ సంగీత ప్రియుడిగా, సునిశిత మేధావిగా, న్యాయగ్రంథాల రచయితగా గుర్తింపు పొందిన సొలీ సొరాబ్జీ.. భారతీయ న్యాయరంగంలో ఓ మేరునగం!

- ఎన్‌.కె.శరణ్‌, రచయిత

ఇదీ చదవండి:'దేశద్రోహ చట్టం రాజ్యాంగబద్ధతపై మీ వైఖరేంటి?'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.