ETV Bharat / jagte-raho

కిడ్నీ రాకెట్‌ కీలక సూత్రధారులు శ్రీలంకలో...

author img

By

Published : Jul 24, 2020, 10:51 AM IST

కిడ్నీ రాకెట్‌లో కీలక సూత్రధారులు శ్రీలంకలోనే ఉన్నట్లు పోలీసుల విచారణలో బయటపడింది. అయితే వారిని అరెస్టు చేయాలంటే పక్కా ఆధారాలు కావాల్సి రావడంతో... ఆ దిశగా పోలీసులు ముందుకు వెళ్తున్నారు. సామాజిక మాధ్యమాల్లో ప్రచారం నిర్వహిస్తూ దేశవ్యాప్తంగా కిడ్నీ రాకెట్లు అత్యంత గుట్టుగా చట్టవిరుద్ధమైన కార్యకలాపాలు సాగిస్తున్నారు. ముంబయి, పుణె, అహ్మదాబాద్, కురుక్షేత్ర, భువనేశ్వర్ నగరాల్లో ఈ ముఠాలు గుట్టుగా తమ కార్యకలాపాలు కొనసాగిస్తున్నాయి. వీటిని నిర్వహిస్తున్న ఏజెంట్లు డబ్బుల కోసం మూత్రపిండాలను ఇచ్చేందుకు సిద్ధమైన యువకులను హైదరాబాద్, వైజాగ్ నుంచి చెన్నై మీదుగా కొలంబోకు తీసుకెళ్తున్నారు.

kidney
కిడ్నీ రాకెట్‌ కీలక సూత్రధారులు శ్రీలంకలో...

రాష్ట్ర రాజధానిలో కొద్ది రోజుల క్రితం పోలీసులు పట్టుకున్న కిడ్నీ రాకెట్‌ ఏజెంట్‌ షణ్ముక శ్రీనివాస్‌ ఈ వ్యవహారంలో పాత్రధారి మాత్రమేనని... సూత్రదారులు శ్రీలంకలో ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. గుంటూరుకు చెందిన శ్రీనివాస్‌ను ఆరేళ్ల క్రితం సీసీఎస్‌ పోలీసులు అరెస్టు చేశారు. బెయిల్‌పై విడుదలై తిరిగి ఇదే రాకెట్‌ కొనసాగిస్తున్నాడు. సామాజిక మాధ్యమాల్లో ప్రచారం చేస్తూ ఈ దందా సాగిస్తున్నట్టు విచారణలో బయటపడింది. నల్గొండ జిల్లాకు చెందిన నూతీ వెంకటేశ్వర్లు, విజయవాడ నివాసి గోవింద్ సూర్యనారాయణలతో కలిసి ఏడేళ్ల క్రితం ఈ తరహా నేరాలకు అతను తెరలేపాడు. ఐనీడ్ కిడ్నీ నౌ డాట్ ఆ, హా వోక్స్కోప్ డాట్ కామ్, ఎక్స్ పీరియెన్స్ ప్రాజెక్ట్ డాట్ కామ్ వంటి వెబ్ సైట్ల ద్వారా కిడ్నీ అమ్మకాలు, కొనుగోళ్ల వివరాలు తెలుసుకునే వారు.

శ్రీలంక ఆసుపత్రుల్లో మార్పిడి

కొలంబోలో డాక్టర్ మౌనిక్‌తో వెంకటేశ్వర్లు మాట్లాడినట్టు పోలీసులు గుర్తించారు. అక్కడి వెళ్లి తన మూత్రపిండాన్ని రూ.5 లక్షలకు విక్రయించి వచ్చాడు. అనంతరం వెంకటేశ్వర్లు, శ్రీనివాస్, సూర్యలు ఏజెంట్లు మారారు. శ్రీలంకకు ఒక్కరిని పంపితే 50 వేల రూపాయలు వస్తాయని వైద్యుడు చెప్పాడు. అక్కడ వెస్ట్రన్, నవలోక, హెమాస్, లంక ఆసుపత్రుల్లో కిడ్నీల మార్పిడి విషయాలను తెలుసుకున్నారు. ఇక్కడికి వచ్చాక ఫేస్ బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ల ద్వారా యువకులను ఆకర్షించడం ప్రారంభించారు. వెంకటేష్ కొలంబో నగరానికి బాధితులను తీసుకెళ్తే... రూ .20 లక్షల నుంచి రూ.30 లక్షల వరకు చెక్కు ఇప్పించి తిరిగి స్వస్థలాలకు చేర్చే బాధ్యత శ్రీనివాస్, సూర్య చూసుకునేవారు. ఆరేళ్ల క్రితం సీసీఎస్ పోలీసులు వీరిని అరెస్ట్ చేశాక ముగ్గురూ విడిపోయారు. షణ్ముఖ శ్రీనివాస్ మాత్రం హైదరాబాద్, భువనేశ్వర్, ముంబయిలలోని ఏజెంట్లతో కలిసి డబ్బు అవసరమైన వారిని గుర్తించి కొలొంబోకి తీసుకెళ్తున్నట్లు పోలీసులు తెలిపారు.

బలమైన ఆధారాల కోసం

శ్రీలంకలో మూత్రపిండాల మార్పిడి చేస్తున్న వైద్యులపై హైదరాబాద్ పోలీసులు చట్టపరంగా చర్యలు చేపట్టేందుకు... శ్రీలంక ప్రభుత్వం నుంచి న్యాయ సహకారం లభించినా... సదరు వైద్యుల పాత్రపై కచ్చితమైన ఆధారాలుంటేనే అరెస్ట్ చేసేందుకు అవకాశముంటుందని పోలీస్ ఉన్నతాధికారులు చెబుతున్నారు. హైదరాబాద్‌కు చెందిన దినేష్ అనే యువకుడు ఆరేళ్ల క్రితం మూత్రపిండం ఇచ్చేందుకు కొలంబో నగరానికి వెళ్లి అనుమానాస్పద స్థితిలో మరణించాడు. అతడి సోదరుడు గణేష్ ఫిర్యాదుతో కిడ్నీ రాకెట్ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. శ్రీలంకలో వైద్యులను అరెస్ట్ చేసేందుకు కేంద్ర హోంశాఖ న్యాయ సహకారం తీసుకోవచ్చంటూ హైదరాబాద్ పోలీసులకు తెలిపినా... ప్రాథమిక ఆధారాలు మినహా బలమైన సాక్ష్యాధారాలు లేనందున ముందుకు వెళ్లలేదు. తాజాగా వెలుగు చూసిన కిడ్నీ రాకెట్ నేపథ్యంలో సీబీఐ, ఇంటర్‌పోల్ సహకారం తీసుకుంటే దర్యాప్తు ముందుకు వెళ్లేందుకు వీలుంటుదని పోలీస్ అధికారులు భావిస్తున్నారు.

ఇదీ చదవండి: 'రాష్ట్రంలో కరోనా సామాజిక వ్యాప్తి దశ.. అప్రమత్తంగా ఉండాలి'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.