ETV Bharat / international

తల్లి గర్భంలో కేవలం 150 రోజులే.. ఆ స్పెషాలిటీతోనే ముగ్గురు చిన్నారులు గిన్నిస్​ రికార్డు!

author img

By

Published : Mar 29, 2023, 7:24 AM IST

యూకేకు చెందిన ఓ మహిళ.. గర్భం ధరించిన 22వారాల 5రోజులకే ముగ్గురు పిల్లలకు జన్మనిచ్చింది. గర్భవతిననే విషయం ఆ మహిళకు ప్రసవానికి కేవలం 3 వారాల ముందే తెలిసింది. ఇప్పటివరకు ప్రపంచంలో అత్యంత ప్రిమెచ్యూర్‌ బేబీస్‌గా గుర్తింపు పొందిన ఆ పిల్లలు ఇప్పుడు ఎలా ఉన్నారంటే?

premature twins born at 22 weeks 5 days
ప్రపంచంలోనే అతితక్కువ కాలం తల్లిగర్భంలో ఉన్న ముగ్గురు కవలలు

యూకేకు చెందిన ముగ్గురు చిన్నారులు.. గిన్నిస్‌ బుక్​లో చోటు సంపాదించారు. రూబీ రోజ్, పేటన్జేన్, పోర్స్‌చామే అనే ముగ్గురు చిన్నారులు.. తమకున్న ప్రత్యేకతతో గిన్నిస్​ బుక్​లో స్థానం సంపాదించారు.​ ప్రపంచంలోనే అతితక్కువ కాలం తల్లిగర్భంలో ఉన్న కవలలుగా ఈ ముగ్గురు గిన్నిస్ రికార్డ్​ను నెలకొల్పారు. వీరు కేవలం 159 రోజులు​ అంటే.. 22 వారాల 5 రోజులు మాత్రమే తన తల్లిగర్భంలో ఉన్నారు. ప్రస్తుతం వీరికి రెండేళ్లు. గతంలో కూడా అడియా, అడ్రియా నడరాజ అనే కవలలు 126 రోజులు తల్లిగర్భంలో ఉండి బాహ్య ప్రపంచంలోకి వచ్చారు. అయితే అడియా, ఆడ్రియాలు ఇద్దరు కాగా వీరు ముగ్గురు కావటం వల్ల గిన్నిస్‌ బుక్‌లో స్థానం పొందారు.

premature twins born at 22 weeks 5 days
అతి తక్కువ కాలం తల్లిగర్భంలో ఉన్న రూబీ రోజ్, పేటన్జేన్, పోర్స్‌చామే

ఆశ్చర్యకర విషయమేమంటే.. గిన్నిస్​ రికార్డు నెలకొల్పిన ఈ ముగ్గురు చిన్నారులు జన్మించడానికి మూడు వారాల ముందే వారి తల్లికి తాను గర్భవతి అని తెలిసింది. ఆ వార్త తెలిసిన నెలరోజుల్లోనే ప్రసవం కావడం వల్ల మైఖేలా వైట్ నిర్ఘాంతపోయింది. తనకు ఇలా అవుతుందని ఎప్పుడూ అనుకోలేదని ఒకింత ఆశ్చర్యం.. మరొకింత ఆనందం వ్యక్తం చేసింది. పుట్టినప్పుడు ముగ్గురు కవలలు అరచేతిలో పట్టేంత చిన్నగా ఉండేవారని.. వారి తండ్రి జాసన్‌ హాప్కిన్స్‌ తెలిపారు.

premature twins born at 22 weeks 5 days
తల్లిదండ్రులతో కవలలు

ఇలాంటి పిల్లలు జన్మించడం అసాధారణమని డాక్టర్లు చెప్పారు. వారిని ఐసీయూలో ఉంచకపోతే బతికేది కష్టమని తెలిపారు. ప్రస్తుతం ముగ్గురు కవలలను వారి తల్లిదండ్రులు 24 గంటలూ కంటికి రెప్పలా చూసుకుంటున్నారు. బయటి నుంచి ఆక్సిజన్‌ అందిస్తున్నారు. రూబీ రోజ్, పేటన్జేన్, పోర్స్‌చామేలు పుట్టిన తర్వాత ఏడాదివరకు ఆస్పత్రిలోనే చికిత్స అందించి ఈ మధ్యే వారిని ఇంటికి పంపించారు. ముగ్గురు కవలల్లో ఇద్దరికి శస్త్రచికిత్సలు చేయాల్సి ఉంది. భవిష్యత్తులోనూ తమ బిడ్డలు సాధారణ జీవితం గడపాలని ఆ తల్లిదండ్రులు కోరుకుంటున్నారు.

premature twins born at 22 weeks 5 days
రూబీ రోజ్, పేటన్జేన్, పోర్స్‌చామేలు సాధించిన గిన్నిస్​ రికార్డ్​

వాయుకాలుష్యమే ప్రధాన కారణమా?
నెలలు నిండక ముందే బిడ్డలు పుట్టడానికి వాయుకాలుష్యం ప్రధాన కారణమవుతున్నట్టు కాలిఫోర్నియా వర్సిటీ.. కొన్ని నెలల క్రితం హెచ్చరించింది. ఈ అంశంపై పరిశోధనలు చేపట్టి దాని ఫలితాలను విడుదల చేసింది. వాయు కాలుష్యం ఇంటా, బయటా చూపుతున్న ప్రభావాలపై శాస్త్రవేత్తలు అధ్యయనం చేశారు. ఇందుకు సంబంధించి 204 దేశాల నుంచి డేటాను సేకరించి, విశ్లేషించారు.

2019లో 60 లక్షల శిశువులు ఇలా!
గాలిలో ఉండే పీఎం 2.5 పరిమాణంలోని కాలుష్య కారక రేణువులు, వంట కారణంగా వెలువడే పొగ.. గర్భిణులపై ప్రభావం చూపుతున్నాయి అని శాస్త్రవేత్తలు తెలిపారు. ముఖ్యంగా నెలలు నిండకముందే కాన్సు కావడానికి ఇవి దారితీస్తున్నట్లు తెలిపారు. ఒక్క 2019లోనే ప్రపంచవ్యాప్తంగా సుమారు 60 లక్షల మంది శిశువులు నెలలు నిండక ముందే జన్మించినట్లు లెక్కలు వెల్లడించారు. దీని కారణంగా మరో 30 లక్షల మంది తక్కువ బరువుతో పుట్టినట్లు తెలిపారు. ఈ పరిస్థితి కారణంగా నవజాత శిశు మరణాలు కూడా అధికంగా సంభవిస్తున్నాయి. ఇలా జన్మించినవారు జీవితాంతం తీవ్రస్థాయి రుగ్మతలతో సతమతమయ్యే ప్రమాదముందని పరిశోధనకర్త రాకేశ్‌ ఘోష్‌ తెలిపారు.

ప్రపంచంలో 90 శాతానికి పైగా మంది బహిరంగ ప్రదేశాల్లో వాయు కాలుష్యానికిగురవుతున్నారని ప్రపంచ ఆరోగ్య సంస్థ గతంలో తెలిపింది. వంట చేయడానికి వినియోగించే బొగ్గు, పిడకలు, కలపను కాల్చడం ద్వారా కోట్ల మంది తమ ఇళ్లలో కాలుష్యం బారిన పడుతున్నారని ఆందోళన వ్యక్తం చేసింది. ఈ అంశాన్ని ప్రస్తావించిన కాలిఫోర్నియా పరిశోధకులు.. కాలుష్య నియంత్రణ చర్యలు చేపట్టడం ద్వారా ఆగ్నేయ, ఆసియా, ఆఫ్రికా దేశాల్లో 78శాతం వరకూ ముందస్తు జననాలను నివారించవచ్చని పేర్కొన్నారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.