ETV Bharat / international

'ఉక్రెయిన్‌పై దాడుల్లో రష్యా వెనుక ఇరాన్‌'.. అమెరికా కీలక వ్యాఖ్యలు

author img

By

Published : Dec 10, 2022, 5:04 PM IST

iran drones russia
ఉక్రెయిన్ రష్యా యుద్ధం

Iran Drones Russia : ఉక్రెయిన్‌పై యుద్ధంలో రష్యాకు ఇరాన్‌ పూర్తి మద్దతు ఇస్తోందని అమెరికా ఆరోపించింది. ఇప్పటికే ఇరాన్‌ డ్రోన్లతో మాస్కో సేనలు తమపై దాడులు చేస్తున్నాయని జెలెన్‌స్కీ ఆరోపిస్తున్న వేళ అమెరికా వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. రష్యా-ఇరాన్‌ రక్షణ రంగంలో పరస్పర సహకారంతో ముందుకు సాగుతున్నాయని అమెరికా వెల్లడించింది. రష్యా-ఇరాన్‌ మధ్య ఆయుధాల పంపిణీ అంతర్జాతీయ సమాజానికి హానికరమని అగ్రరాజ్యం విమర్శించింది.

Iran Drones Russia : ఇరాన్ డ్రోన్లతో రష్యా తమపై దాడి చేస్తోందని ఉక్రెయిన్‌ చేస్తున్న ఆరోపణలకు బలం చేకూరేలా అమెరికా ప్రకటన చేసింది. రష్యా-ఇరాన్‌ మధ్య ద్వైపాక్షిక సంబంధాలు పూర్తి స్థాయి రక్షణ భాగస్వామ్యంగా మారాయని అమెరికా వెల్లడించింది. ఉక్రెయిన్‌పై దాడి చేస్తున్న రష్యాకు ఇరాన్‌ పూర్తి మద్దతు ఇస్తోందని అమెరికా జాతీయ భద్రతా మండలి ప్రతినిధి జాన్ కిర్బీ వెల్లడించారు.

పెను విధ్వంసాన్ని సృష్టించే డ్రోన్‌లను సంయుక్తంగా అభివృద్ధి చేయాలన్న ప్రతిపాదనను ఇరు దేశాలు పరిశీలిస్తున్నట్లు అమెరికా విడుదల చేసిన నివేదిక వెల్లడించింది. డ్రోన్ల తయారీలో ఇరాన్-రష్యా మధ్య భాగస్వామ్యం అంతర్జాతీయ సమాజానికి హానికరమని కిర్బీ తెలిపారు. ఆయుధాల అభివృద్ధి, సైనిక శిక్షణ రంగాల్లో ఇరాన్‌తో కలిసి రష్యా పని చేస్తోందని ఆరోపించారు. ఇరాన్‌కు అధునాతన ఆయుధాలు అందించాలని రష్యా కూడా భావిస్తోందని అమెరికా తెలిపింది.రష్యా అతిపెద్ద సైనిక మద్దతుదారుగా ఇరాన్ మారిందని కిర్బీ విమర్శించారు.

ఉక్రెయిన్‌లో మౌలిక సదుపాయాలపై దాడి చేయడానికి రష్యా.. ఇరాన్‌ డ్రోన్‌లను ఉపయోగించిందని అమెరికాతోపాటు బ్రిటన్‌, ఆస్ట్రేలియా కూడా వెల్లడించాయి. ఇరాన్-రష్యా సంబంధాలు ప్రపంచ భద్రతకు ముప్పు కలిగిస్తున్నాయని బ్రిటన్‌ విదేశాంగ మంత్రి జేమ్స్‌ ఆరోపించారు. ఇరుదేశాల మధ్య కుదిరిన ఒప్పందాల వల్ల ఇరాన్ వేలాది డ్రోన్లను రష్యాకు పంపిందని ఆయన విమర్శించారు. దీనికి బదులుగా రష్యా ఇరాన్‌కు సాంకేతిక సహాయాన్ని అందిస్తోందని వెల్లడించారు. రాబోయే నెలల్లో రష్యా సైన్యానికి.. ఇరాన్ మద్దతు పెరుగుతుందని బ్రిటన్‌ అంచనా వేసింది. రష్యాకు డ్రోన్ల సరఫరా ప్రపంచ భద్రతను అస్థిరపరుస్తుందన్న ఆస్ట్రేలియా దాని పర్యవసానాలను కూడా ఎదుర్కోవాల్సి ఉంటుదని హెచ్చరించింది.

ఇరానీ డ్రోన్లతోనే తమపై మాస్కో సేనలు దాడులు చేస్తున్నాయని.. ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ ఇటీవల ఆరోపించారు. రష్యాకు మద్దతు ఇస్తుండడంపై ప్రపంచానికి ఇరాన్ అబద్ధం చెబుతోందని విమర్శించారు. మాస్కో సేనలు ఉపయోగించిన కామికేజ్ డ్రోన్లను ఇరానే సరఫరా చేసిందని జెలెన్‌స్కీ అన్నారు. ఈ ఆరోపణలను ఖండించిన ఇరాన్‌, రష్యాకు తాము ఎలాంటి డ్రోన్లు సరఫరా చేయలేదని తొలుత వెల్లడించింది. తర్వాత ఉక్రెయిన్‌తో యుద్ధానికి చాలా నెలల ముందే పరిమిత సంఖ్యలో డ్రోన్‌లను రష్యాకు పంపినట్లు ఇరాన్ అంగీకరించింది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.