ETV Bharat / international

'భారత్​లో అమెరికా​ వీసాల సత్వర జారీకి కృషి!'

author img

By

Published : Dec 9, 2022, 1:42 PM IST

America's efforts in issuing visas to India
భారత్​- అమెరికా

భారత్‌లో వీసాలను త్వరగా జారీ చేసేందుకు అమెరికా పరిపాలన విభాగం కృషి చేస్తున్నట్లు వైట్​హౌస్ ప్రకటించింది. వీసా ఇంటర్వ్యూ నిరీక్షణ సమయాన్ని తగ్గిస్తున్నామని, ఇందుకోసం అమెరికా విదేశాంగ శాఖ సిబ్బందిని రెట్టింపు చేస్తున్నామని తెలిపింది.

భారత్‌లో అమెరికా వీసా జారీలో జరుగుతున్న సుదీర్ఘ జాప్యంపై దృష్టి సారించినట్లు శ్వేతసౌధం ప్రకటించింది. వీసాలను త్వరగా జారీ చేసేందుకు అమెరికా పరిపాలన విభాగం కృషి చేస్తున్నట్లు వెల్లడించింది. అధ్యక్షుడు బైడెన్‌ నేతృత్వంలోని పరిపాలన విభాగానికి భారత్‌లో వీసాల జారీలో జరుగుతున్న జాప్యం గురించి తెలుసని వైట్‌హౌస్‌ ప్రెస్ సెక్రటరీ కరీన్ జీన్ పియర్ స్పష్టం చేశారు. కరోనా మహమ్మారి సంక్షోభం తర్వాత వీసాల జారీలో గొప్ప పురోగతి సాధించామని, డిమాండ్‌కు తగ్గట్లు వీసాల జారీకి మరింత కృషి చేయాల్సి ఉందని వైట్‌హౌస్‌ ప్రతినిధి వెల్లడించారు. వీసా ఇంటర్వ్యూ నిరీక్షణ సమయాన్ని తగ్గిస్తున్నామని, ఇందుకోసం అమెరికా విదేశాంగ శాఖ సిబ్బందిని రెట్టింపు చేస్తున్నామని పియర్‌ తెలిపారు. వీసా ప్రాసెసింగ్ గతం కంటే వేగవంతం అవుతుందని అమెరికా స్పష్టం చేసింది.

మరోవైపు అమెరికా మిత్రదేశంగానే భారత్‌ ఉండబోదని.. భవిష్యత్తులో మహాశక్తిగా అవతరించనుందని శ్వేతసౌధం ఆసియా సమన్వయకర్త కర్ట్‌ క్యాంప్‌బెల్‌ వ్యాఖ్యానించారు. గత 20 ఏళ్లలో అమెరికా-భారత్‌ సంబంధాలు బలపడిన స్థాయిలో మరే దేశంతో ద్వైపాక్షిక బంధం మెరుగుపడలేదని ఆయన అన్నారు. తన దృష్టిలో 21వ శతాబ్దంలో అమెరికాకు అత్యంత ముఖ్యమైన ద్వైపాక్షిక బంధం భారత్‌తోనే ఉందన్నారు. ‘ఆస్పెన్‌ సెక్యూరిటీ కౌన్సిల్‌’ మీటింగ్‌ సందర్భంగా ఓ విలేకరి అడిగిన ప్రశ్నకు ఆయన ఈ విధంగా స్పందించారు.

అమెరికా మరింత దృష్టిపెట్టి ఇరు దేశాల ప్రజల మధ్య బంధాన్ని పెంచేలా టెక్నాలజీ, ఇతర అంశాలపై కృషి చేయాలని క్యాంప్‌బెల్‌ పేర్కొన్నారు.‘‘భారత్‌లో విభిన్నమైన వ్యూహాత్మక లక్షణం ఉంది. అది అమెరికా మిత్రదేశంగా ఉండబోదు.. మరో గొప్పశక్తిగా అవతరిస్తుంది. ప్రతి దశలోనూ వివిధ అంశాల్లో ఇరు దేశాల బంధం మరింత బలపడటానికి చాలా కారణాలున్నాయి. కొంత ఆశయంతో పనిచేయాల్సిన బంధమని నేను నమ్ముతున్నాను. ఖగోళ, విద్యా, పర్యావరణ, సాంకేతిక రంగాలేవైనా.. మేము చాలా అంశాలను సమష్టిగా చేయగలిగిన కోణంలోనే చూస్తాం. అదే దిశగానే పనిచేస్తాం. గత 20ఏళ్ల బంధంలో చాలా అడ్డంకులను తొలగించుకొన్నాం. ఇందుకోసం ఇరువైపులా లోతుగా కృషి చేశాం’’ అని ఆయన వ్యాఖ్యానించారు.

భారత్‌- అమెరికా బంధం చైనాను ఆందోళనకు గురిచేయడానికి ఏర్పడింది కాదని క్యాంప్‌బెల్‌ పేర్కొన్నారు. ఇది సమష్టి కృషి ప్రాముఖ్యాన్ని రెండుదేశాలు లోతుగా అర్థం చేసుకోవడం వల్ల ఏర్పడిందని వెల్లడించారు. క్వాడ్‌ విషయంలో తాను సానుకూలంగా ఉన్నానని చెప్పారు. అది అనధికారిక వేదికగా మిగిలినా.. ఆ నాలుగు దేశాల మధ్య బంధం బలపడటానికి చాలా మార్గాలు ఉన్నాయన్నారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.