ETV Bharat / international

ఉక్రెయిన్ అధ్యక్షుడి హత్యకు కుట్ర- 400 మంది కిరాయి గుండాలు!

author img

By

Published : Mar 1, 2022, 9:57 PM IST

Conspiracy to Zelensky Murder: రష్యా-ఉక్రెయిన్​ మధ్య భీకర యుద్ధం జరుగుతున్న నేపథ్యంలో ఉక్రెయిన్​ అధ్యక్షుడు వొలిదిమిర్​ జెలెన్​స్కీని హత్య చేసేందుకు కుట్ర జరుగుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. అందుకోసం 400 మంది ప్రత్యేకంగా శిక్షణ పొందిన కిరాయి గుండాలను సిద్ధంగా ఉంచినట్లు ఓ అంతర్జాతీయ వార్తా సంస్థ కథనం వెలువరించింది.

Ukraine President Volodymyr zelensky
Ukraine President Volodymyr zelensky

Conspiracy to Zelensky Murder: రష్యా-ఉక్రెయిన్ మధ్య జరుగుతోన్న సైనిక పోరు ఎక్కడికి దారితీస్తుందోనని అంతర్జాతీయ సమాజం ఆందోళన చెందుతోంది. ఈ క్రమంలో ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలొదిమిర్ జెలెన్‌స్కీని హత్య చేసేందుకు రష్యా కిరాయి గుండాలను సిద్ధంగా ఉంచిందన్న వార్త కలకలం సృష్టిస్తోంది. వారంతా ప్రత్యేకంగా శిక్షణ పొందారని ఓ అంతర్జాతీయ వార్తా సంస్థ కథనం వెలువరించింది. వారంతా వాగ్నర్ గ్రూప్‌గా చెప్పుకుంటోన్న ఒక ప్రైవేటు మిలిషియాకు చెందినవారు. ఆ బృందాన్ని ఆఫ్రికా నుంచి తీసుకువచ్చినట్లు తెలుస్తోంది. జెలెన్‌స్కీతో సహా 23 మంది ప్రభుత్వ పెద్దల్ని హత్యచేసేందుకు రష్యా అధ్యక్షుడు పుతిన్ నుంచి ఆ బృందానికి ఆదేశాలున్నట్లు ఆ సంచలన కథనం పేర్కొంది.

ఆ కథనం ప్రకారం.. ఈ వాగ్నర్‌ గ్రూప్‌ను పుతిన్ సన్నిహితుడు ఒకరు నిర్వహిస్తున్నారు. ఆ సన్నిహితుడిని పుతిన్ చెఫ్ అని పిలుస్తారట. కాగా, వాగ్నర్ గ్రూప్‌కు చెందిన ఆ కిరాయి గుండాలు.. రష్యా అధ్యక్షుడు అప్పగించిన పని మీద ఐదు వారాల క్రితమే ఆఫ్రికా నుంచి వచ్చారు. ఆ గ్రూప్‌తో సంబంధం ఉన్న వ్యక్తులు చెప్పిన వివరాల ప్రకారం.. 2 వేల నుంచి 4 వేల మంది కిరాయి గుండాలు జనవరిలోనే ఉక్రెయిన్ చేరుకున్నారు. వారిలో కొందరు వేర్పాటు వాద ప్రాంతాలైన దొనెట్స్క్‌, లుహాన్స్క్‌ వెళ్లారని, 400 మంది బెలారస్‌ నుంచి ప్రవేశించి, కీవ్‌ వైపు వెళ్లారని పేర్కొంది. చెప్పిన పని చేసినందుకు గానూ.. వారికి భారీగానే ఆర్థిక లాభం చేకూరనుంది.

జెలెన్‌స్కీ, ఉక్రెయిన్ ప్రధాని, కీవ్‌ మేయర్ సహా 23 మంది ఆ గ్రూప్‌ లక్షిత జాబితాలో ఉన్నారు. ఈ వారం శాంతి చర్చలు ఉండటంతో పుతిన్‌ తన ప్రణాళిక అమలుకు కాస్త విరామం ఇచ్చారట. ఈ విషయాన్ని వాగ్నర్ గ్రూప్‌లోని సీనియర్ సభ్యుడి సన్నిహితుడిని ఉటంకిస్తూ కథనం పేర్కొంది. ఇక, ఇరు దేశాలకు మధ్య చర్చలు జరిగినప్పటికీ.. అవి సఫలం కాలేదు. వాగ్నర్ గ్రూప్ అనేది ఒక ప్రైవేట్ మిలిటరీ, సెక్యూరిటీ కంపెనీ. క్రెమ్లిన్ తన వ్యూహాత్మక లక్ష్యాలను నెరవేర్చడానికి దీన్ని ఉపయోగిస్తుందని నమ్ముతారు. దీన్ని 2014లో స్థాపించారు. రష్యా మొదటి గురి తాను, తన కుటుంబమేనని జెలెన్‌స్కీ ఇది వరకే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.ఈ క్రమంలో ఈ వార్త రావడం సంచలనం సృష్టిస్తోంది.

ఇదీ చూడండి: ఐరాస భద్రతా మండలి నుంచి రష్యా ఔట్?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.