ETV Bharat / international

ఉక్రెయిన్​పై ఆగని దాడులు.. 14,400 మంది రష్యా సైనికులు మృతి!

author img

By

Published : Mar 19, 2022, 7:44 PM IST

Russia attack Ukraine: ఉక్రెయిన్​పై రష్యా సేనల దాడులు శనివారం కొనసాగాయి. మరియుపోల్​ తదితర నగరాల్లో రష్యన్​ దళాలు పెద్ద ఎత్తున దాడి చేస్తున్నట్లు ఉక్రెయిన్​ తెలిపింది. తమ దేశ సైనికులు చేసిన ప్రతిఘటనలో ఇప్పటి వరకు 14వేలకుపైగా రష్యన్​ సైనికులు హతమైనట్లు పేర్కొంది. మరోవైపు.. పౌరుల తరలింపునకు ఉక్రెయిన్​లో 10 మానవతా కారిడార్లను ఏర్పాటు చేసేందుకు ఇరు దేశాలు అంగీకరించాయి.

Ukraine russia attack
రష్యా యుద్ధం

Russia attack Ukraine: ఉక్రెయిన్​పై అత్యాధునిక క్షిపణులు, బాంబులతో రష్యన్​ సేనలు విరుచుకుపడుతున్నాయి. ఇరవై రోజులకుపైగా కొనసాగుతున్న దాడులతో ఉక్రెయిన్​ శిథిలాల దిబ్బగా మారిపోయింది. అయితే, ఉక్రెయిన్​ సేనలు దీటుగా ప్రతిఘటిస్తున్నాయి. రష్యాకు చెందిన ఫైటర్​ జెట్లు, హెలికాప్టర్లను కూల్చుతున్నట్లు పలు సందర్భాల్లో తెలిపాయి. సైనిక చర్య ప్రారంభమైన నుంచి ఇప్పటివరకు 14,400 మంది రష్యా సైనికులు హతమైనట్లు ఉక్రెయిన్ సైన్యం శనివారం ప్రకటించింది. దీంతోపాటు 466 ట్యాంకులు, 1470 సాయుధ వాహనాలను ధ్వంసం చేసినట్లు తెలిపింది. 95 విమానాలు, 115 హెలికాప్టర్లు, 17 యూఏవీలను నేలకూల్చినట్లు వెల్లడించింది. వీటికి అదనంగా మూడు నౌకలు, 44 విమాన, క్షిపణి విధ్వంసక వ్యవస్థలను నాశనం చేసినట్లు చెప్పింది.

కొనసాగుతున్న పోరు..

ఉక్రెయిన్‌ బలగాలు రష్యా దళాలతో పోరాడుతోన్న ఫ్రంట్‌లైన్ ప్రాంతాల్లో గత 24 గంటల వ్యవధిలో పెద్ద ఘటనలేవీ నమోదు కాలేదని ఉక్రెయిన్‌ అధ్యక్ష సలహాదారు ఒలెక్సీ అరెస్టోవిచ్ చెప్పారు. మేరియుపోల్, మైకోలైవ్, ఖేర్సన్, ఇజియంలలో పరిస్థితులు తీవ్రంగా ఉన్నాయని, ఇక్కడ రష్యా దళాలు పెద్దఎత్తున దాడి చేస్తున్నాయని చెప్పారు.

Ukraine russia attack
శిథిలాల్లో చిక్కుకున్న వారిని తీసుకొస్తున్న సైనికులు

జపోరిజియాలో 38 గంటల కర్ఫ్యూ విధింపు

ఉక్రెయిన్‌పై రష్యా దాడుల పరంపర కొనసాగుతూనే ఉంది. తాజాగా దక్షిణ ఉక్రెయిన్‌లోని జపోరిజియా నగర శివార్లలో జరిగిన దాడుల్లో తొమ్మిది మంది మృతి చెందినట్లు స్థానిక ఉప మేయర్‌ అనటోలీ కుర్తీవ్‌ తెలిపారు. మరో 17 మంది గాయపడ్డారని వెల్లడించారు. మరోవైపు ఈ నగరంలో 38 గంటల కర్ఫ్యూను ప్రకటించారు. ఇటీవల ఈ నగరంలోని ఓ అణు విద్యుత్‌ కేంద్రంపై దాడి.. ప్రపంచవ్యాప్తంగా ఆందోళనకు దారితీసిన విషయం తెలిసిందే.

ఉక్రెయిన్‌లో నేడు 10 మానవతా కారిడార్లు

ఉక్రెయిన్‌లోని యుద్ధ సంక్షోభిత ప్రాంతాల నుంచి పౌరుల తరలింపు ప్రక్రియ ముమ్మరంగా సాగుతోంది. ఈ క్రమంలోనే శనివారం మేరియుపోల్‌, ఖర్కివ్‌ సహా ఆయా నగరాలల్లో మొత్తం 10 మానవతా కారిడార్లు ఏర్పాటు చేయనున్నట్లు ఉక్రెయిన్‌ ఉప ప్రధాని వెరెష్‌చుక్‌ తెలిపారు.

స్టీల్‌ దిగ్గజం 'అజోవ్‌స్టాల్‌' రష్యా హస్తగతం?

మేరియుపోల్‌ను చుట్టుముట్టిన రష్యా బలగాలు.. నగరంలోనూ దాడులు మొదలుపెట్టాయి. ఈ క్రమంలోనే ఐరోపాలోనే అతిపెద్ద మెటలర్జికల్‌ కర్మాగారాల్లో ఒకటైన అజోవ్‌స్టాల్‌ స్టీల్‌ ప్లాంట్‌పై పట్టు కోసం రష్యా, ఉక్రెయిన్‌ బలగాల మధ్య పోరు సాగుతోందని ఉక్రెయిన్ అంతర్గత వ్యవహారాల మంత్రికి సలహాదారు అయిన వాదిమ్ దెనిసెంకో శనివారం తెలిపారు. 'ఇప్పుడు అజోవ్‌స్టాల్ కోసం పోరాటం సాగుతోంది. అయితే.. ఈ ఆర్థిక దిగ్గజాన్ని కోల్పోయామని చెప్పగలను. ఐరోపాలోని అతిపెద్ద మెటలర్జికల్ ప్లాంట్లలో ఒకటైన దీన్ని.. ధ్వంసం చేస్తున్నారు' అని వాపోయారు.

ఉక్రెయిన్‌కు ఫైటర్లు.. ఖండించిన హిజ్బుల్లా

ఉక్రెయిన్‌పై సైనిక చర్యలో రష్యా బలగాలకు మద్దతుగా తమ ఫైటర్లను పంపుతున్నామన్న ఆరోపణలను లెబనాన్‌ మిలీషియా గ్రూప్ హిజ్బుల్లా ఖండించింది. హిజ్బుల్లా సెక్రెటరీ జనరల్ హసన్ నస్రల్లా మాట్లాడుతూ.. ఈ వాదనలను నిర్ద్వంద్వంగా ఖండిస్తున్నట్లు చెప్పారు. ఇందులో నిజం లేదన్నారు. హిజ్బుల్లా నుంచి ఒక ఫైటర్‌ కాని, నిపుణుడు కాని ఉక్రెయిన్‌కు వెళ్లలేదన్నారు. తమ దేశంలో పోరాడటానికి రష్యా.. సిరియా, హిజ్బుల్లా నుంచి సుమారు 1,000 మంది ఫైటర్లను నియమించుకున్నట్లు ఇటీవల ఉక్రెయిన్‌ ఆరోపించిన విషయం తెలిసిందే.

ఉక్రెయిన్‌కు మానవతా సాయమే చేస్తాం: బల్గేరియా

ఉక్రెయిన్‌కు తాము సైనిక సాయాన్ని అందించే అవకాశాలను బల్గేరియా ప్రధాన మంత్రి కిరిల్ పెట్కోవ్ తోసిపుచ్చారు. అయితే, మానవతా సాయం అందించడాన్ని కొనసాగిస్తామని చెప్పారు. 'వివాద క్షేత్రానికి తాము చాలా దగ్గరగా ఉన్నందున.. ప్రస్తుతం ఉక్రెయిన్‌కు సైనిక సాయాన్ని పంపలేం. ఇది సాధ్యం కాదు' అని అన్నారు. శనివారం అమెరికా డిఫెన్స్ సెక్రెటరీ లాయిడ్ ఆస్టిన్‌తో కలిసి ఒక వార్తా సమావేశంలో ఆయన మాట్లాడారు. నాటో సైన్యాన్ని బలోపేతం చేసే దిశగా.. బల్గేరియాకు అమెరికా ఓ స్ట్రైకర్ మెకనైజ్డ్ పదాతిదళాన్ని అందించడానికి అంగీకరించినట్లు పెట్కోవ్‌ తెలిపారు.

పుతిన్‌పై దర్యాప్తునకు అంతర్జాతీయ ట్రిబ్యునల్..

ఉక్రెయిన్‌ విషయంలో రష్యా అధ్యక్షుడు పుతిన్ చర్యలపై దర్యాప్తు చేయడానికి కొత్త అంతర్జాతీయ ట్రిబ్యునల్‌ను ఏర్పాటు చేయాలని బ్రిటన్‌ మాజీ ప్రధాని గార్డన్ బ్రౌన్ కోరారు. యుద్ధంలో పౌరులపై విచక్షణారహితంగా బాంబు దాడులు జరుగుతున్నాయని, ఇది అంతర్జాతీయ చట్టాలకు విరుద్ధమన్నారు. ఇప్పుడు సరైన చర్యలు తీసుకోకపోతే.. భవిష్యత్తులో ఇతర దేశాల్లోనూ ఇటువంటి పరిస్థితులు ఎదురవుతాయన్నారు. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత జర్మనీ యుద్ధ నేరస్థులపై నిర్వహించిన 'నూరెమ్‌బెర్గ్ ట్రయల్స్' నమూనాలో ఇప్పుడూ ఓ న్యాయ ప్రక్రియ ఏర్పాటు కోసం పిటిషన్‌పై సంతకం చేసిన 140 మంది ప్రముఖుల్లో బ్రౌన్ కూడా ఉన్నారు.

రష్యాతో వాణిజ్య బంధాలు తెంచుకోవాలి..

రష్యాతో వాణిజ్యంపై పూర్తిస్థాయి నిషేధం విధించాలని యూరోపియన్ యూనియన్‌కు ప్రతిపాదించినట్లు పోలాండ్‌ ప్రధాని మాటియస్ మొరావికీ శనివారం చెప్పారు. రష్యాతో వాణిజ్యాన్ని పూర్తిగా నిలిపివేయడం ద్వారా.. ఈ యుద్ధాన్ని ఆపడం మంచిదని ఆలోచించేలా ఆ దేశంపై ఒత్తిడి రావొచ్చని చెప్పారు.

రష్యా, చైనాల సహకారం మరింత బలోపేతం..

ప్రస్తుత పరిస్థితుల్లో రష్యా, చైనాల మధ్య సహకారం మరింత బలపడుతుందని రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్‌ అన్నారు. 'ఈ సహకారం మరింత బలపడుతుంది. ఎందుకంటే.. అంతర్జాతీయ వ్యవస్థ ఆధారపడి ఉన్న అన్ని పునాదులను పాశ్చాత్య దేశాలు అణగదొక్కుతున్న వేళ.. తమ ఇరు దేశాలు రెండు గొప్ప శక్తులుగా ఈ ప్రపంచంలో ఎలా ముందుకెళ్లాలో ఆలోచించాలి' అని లావ్రోవ్ వ్యాఖ్యానించినట్లు ఓ అంతర్జాతీయ వార్తాసంస్థ శనివారం పేర్కొంది.

నేనూ యుద్ధం చేస్తా.. వయస్సుతో పనేముంది..!

రష్యా దురాక్రమణకు వ్యతిరేకంగా ఉక్రెయిన్‌ను రక్షించుకుంటున్నారు అక్కడి ప్రజలు. వయసుతో సంబంధం లేకుండా యుద్ధభూమిలో దిగుతామంటున్నారు మరికొందరు. తాజాగా 98 ఏళ్ల బామ్మ తన దేశాన్ని కాపాడుకునేందుకు తుపాకీ పట్టుకుంటానని అధికారుల్ని సంప్రదించారు. ఆమెకు అన్ని అర్హతలున్నా.. వయస్సు కారణంగా ఆగిపోవాల్సి వచ్చింది.

Ukraine russia attack
యుద్ధానికి సిద్ధమంటున్న ఉక్రెయిన్​ బామ్మ

ఇదీ చూడండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.