ETV Bharat / international

Norovirus: ఏమిటీ నోరోవైరస్‌..?

author img

By

Published : Jul 20, 2021, 5:01 AM IST

Updated : Jul 20, 2021, 7:30 AM IST

Norovirus
నోరోవైరస్‌

ఇప్పటికే కరోనా వైరస్​తో అతలాకుతలం అయిన బ్రిటన్​లో నోరో వైరస్​.. అనే కొత్త వైరస్ ప్రబలింది. ఐదువారాల్లో 154 మందికి ఈ వైరస్ సోకిందని పబ్లిక్ హెల్త్ ఇంగ్లండ్( పీహెచ్‌ఈ) వెల్లడించింది. అంతకుముందూ ఈ వైరస్ వ్యాప్తి ఉన్నప్పటికీ.. ఎన్నడూ ఈ స్థాయిలో కేసులు నమోదుకాలేదని తెలిపింది.

రూపుమార్చుకుంటూ కరోనావైరస్.. ప్రపంచాన్ని పట్టిపీడిస్తోంది. మళ్లీ ఇప్పుడు చైనాలో మంకీ బీ వైరస్ కలకలం. ఇవి చాలదన్నట్టు ఇంగ్లండ్‌లో నోరో వైరస్‌ అట. దాన్ని 'వామిటింగ్ బగ్' అని కూడా అంటారు. ఇప్పుడు ఆ వైరస్ కేసులు ఇంగ్లండ్‌లో పెరిగిపోతున్నాయని పబ్లిక్ హెల్త్ ఇంగ్లండ్( పీహెచ్‌ఈ) వెల్లడించింది. ఐదువారాల్లో 154 మందికి ఈ వైరస్ సోకింది. అంతకుముందూ ఈ వైరస్ వ్యాప్తి ఉన్నప్పటికీ..ఎన్నడూ ఈ స్థాయిలో కేసులు నమోదుకాలేదని తెలిపింది. ఇదే సమయంలో గత ఐదేళ్ల కాలంలో సగటు కేసుల సంఖ్య 53గానే ఉందని చెప్పింది.

అసలు ఈ నోరోవైరస్‌ ఏంటి..?

నోరోవైరస్‌కు వేగంగా వ్యాప్తి చెందే లక్షణముంది. ఇది అన్ని వయస్సులవారికి సోకుతుంది. ఇది కలుషితమైన ఆహారంగా కారణంగా మన శరీరంలోకి ప్రవేశిస్తుందని అమెరికన్ సీడీసీ వెల్లడించింది. దీన్ని స్టమక్ ఫ్లూ, స్టమక్ బగ్ అని కూడా పిలుస్తారు.

లక్షణాలు..

నోరో వైరస్ సోకిన 12 నుంచి 48 గంటల్లోదాని లక్షణాలు కనిపిస్తాయి. అలాగే మూడు రోజుల వరకు ఉంటాయి. విరేచనాలు, వాంతులు, కడుపునొప్పి, వికారం, జర్వం, తలనొప్పి, ఒళ్లు నొప్పులు వంటి లక్షణాల ద్వారా దాన్ని గుర్తించవచ్చు. వైరస్ బారినపడిన వ్యక్తుల మలం, వాంతిలో దీని ఆనవాలు కనిపిస్తుంది. కలుషిత ఆహారం, నీరు, ఉపరితలాల ద్వారా ఇది మనుషుల శరీరంలోకి ప్రవేశిస్తుంది. నోరోవైరస్ బారినపడిన వ్యక్తులు వాడిన పాత్రలు, ఆహారం పంచుకోవడం కూడా దీని వ్యాప్తికి దోహదం చేస్తుంది. మలం నుంచి సేకరించిన నమూనాల పరీక్షించడం ద్వారా ఈ వైరస్‌ను నిర్ధారిస్తారు.

అయితే, ఈ వైరస్ బాధితులు చాలామంది ఎలాంటి చికిత్స లేకుండానే కోలుకుంటారు. వృద్ధులు, చిన్నపిల్లలు, ఇతర వ్యాధులతో బాధపడుతున్నవారు డీహైడ్రేషన్‌కు గురయ్యే అవకాశం ఉంది. వారు వైద్యుల్ని సంప్రదించాల్సి ఉంటుంది. అవసరమైతే ఆసుపత్రిలో చికిత్స పొందాల్సిన పరిస్థితి ఉంటుంది. అయితే మూడు రోజుల్లో దీన్నుంచి బయటపడొచ్చని నిపుణులు వెల్లడించారు. ఈ వైరస్ నుంచి కోలుకున్నప్పటికీ, మలంలో దాని ఆనవాళ్లు కొన్నివారాలు పాటు ఉంటాయన్నారు. ఇక, పలు రకాలైన నోరోవైరస్‌లు ఉండటంతో వాటి కారణంగా పలుమార్లు అనారోగ్యానికి గురయ్యే అవకాశం ఉంటుంది. అలాగే వాటిని ఎదుర్కొనేలా రోగనిరోధక వ్యవస్థ సిద్ధమవుతుంది. అయితే ఆ శక్తి ఎంతకాలం ఉంటుందో మాత్రం తెలియాల్సి ఉంది.

నివారణ ఇదే..
• తరచుగా చేతులు శుభ్రం చేసుకోవాలి.
• కూరగాయలు, పండ్లను కడిగిన తర్వాతే వాడాలి.
• లక్షణాలు గుర్తించిన వెంటనే ఇంటికే పరిమితం కావాలి. అలాగే లక్షణాలు తగ్గిన మరో రెండు రోజుల వరకు ఇంట్లోనే ఉండాలి.
• ఆ కొద్ది రోజులు వంటకు దూరంగా ఉండాలి.
ఈ వైరస్‌ ఏడాదిలో ఎప్పుడైనా సోకే అవకాశం ఉన్నప్పటికీ.. నవంబర్ నుంచి ఏప్రిల్ మధ్యలో దీని తీవ్రత ఎక్కువగా ఉంటుంది.

ఇదీ చదవండి: 'కొవాగ్జిన్​ అత్యవసర అనుమతిపై సమీక్షిస్తున్నాం'

Last Updated :Jul 20, 2021, 7:30 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.