ETV Bharat / international

యూరప్​లో 4 నెలల్లోనే హెర్డ్‌ ఇమ్యూనిటీ!

author img

By

Published : Apr 28, 2021, 9:59 PM IST

యూరప్‌.. వచ్చే నాలుగు నెలల్లో హెర్డ్‌ ఇమ్యూనిటీ సాధించగలదని బయోఎన్‌టెక్‌ ఫార్మా సంస్థ సహ వ్యవస్థాపకుడు ఉగుర్‌ సాహిన్‌ అంచనా వేశారు. ఇక ఎంత శాతం ప్రజలు వ్యాక్సిన్‌ తీసుకుంటే కరోనా వైరస్‌ను ఎదుర్కొనే సామూహిక రోగనిరోధకత (హెర్డ్‌ ఇమ్యూనిటీ) సాధించవచ్చనే అంశంపై ప్రపంచవ్యాప్తంగా చర్చ జరుగుతోంది.

Herd Immunity
హెర్డ్‌ ఇమ్యూనిటీ

కరోనా మహమ్మారి విలయంతో యావత్ ప్రపంచం సంక్షోభం ఎదుర్కొంటోంది. దీనిని నిర్మూలించే టీకా అందుబాటులోకి రావడంతో ప్రపంచ వ్యాప్తంగా వ్యాక్సినేషన్‌ ప్రక్రియ ముమ్మరంగా సాగుతోంది. కొవిడ్ వ్యాక్సిన్‌ పంపిణీ శరవేగంగా సాగుతోన్న యూరప్‌.. వచ్చే నాలుగు నెలల్లో హెర్డ్‌ ఇమ్యూనిటీ సాధించగలదని బయోఎన్‌టెక్‌ ఫార్మా సంస్థ సహ వ్యవస్థాపకుడు ఉగుర్‌ సాహిన్‌ అంచనా వేశారు. ఫైజర్‌ సహకారంతో బయోఎన్‌టెక్‌ సంస్థ అభివృద్ధి చేసిన ఫైజర్‌ వ్యాక్సిన్‌ సమర్థంగా పనిచేస్తుండడంతో చాలా దేశాల్లో విరివిగా వినియోగిస్తున్న విషయం తెలిసిందే.

ఇక ఎంత శాతం ప్రజలు వ్యాక్సిన్‌ తీసుకుంటే కరోనా వైరస్‌ను ఎదుర్కొనే సామూహిక రోగనిరోధకత (హెర్డ్‌ ఇమ్యూనిటీ) సాధించవచ్చనే అంశంపై ప్రపంచవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. అయితే, జనాభాలో దాదాపు 70శాతానికి పైగా రోగనిరోధకతను సాధిస్తే వైరస్ సంక్రమణను అడ్డుకోవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. ఈ నేపథ్యంలో జులై లేదా ఆగస్టు నాటికి యూరప్‌ హెర్డ్‌ ఇమ్యూనిటీ సాధిస్తుందని బయోఎన్‌టెక్‌ సంస్థ సీఈఓ ఉగుర్‌ సాహిన్‌ అంచనా వేశారు. యూరప్‌లో వ్యాక్సినేషన్‌ ప్రక్రియ ముమ్మరంగా సాగుతున్న దృష్ట్యా ఇది సాధ్యమవుతుందని పేర్కొన్నారు.

బూస్టర్‌ డోస్‌ తప్పదు..!

'అమెరికా ఫార్మా సంస్థ ఫైజర్‌ సహాయంతో బయోఎన్‌టెక్ అభివృద్ధి చేసిన (ఫైజర్‌) టీకా 95శాతం సమర్థంగా పనిచేస్తున్నట్లు తేలింది. అయితే, ఇప్పటికే వ్యాక్సిన్‌ తీసుకున్న వారిలో కొంతకాలానికే రోగనిరోధక ప్రతిస్పందన తగ్గుతున్నట్లు నివేదికలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో మూడో డోసు అవసరం ఏర్పడవచ్చు' అని బయోఎన్‌టెక్‌ అధినేత సాహిన్‌ వెల్లడించారు. తద్వారా 100శాతం రక్షణ పొందవచ్చని పేర్కొన్నారు. అయితే, మొదటి డోసు తీసుకున్న 9 నుంచి 12 నెలల తర్వాత మూడో డోసు తీసుకోవాల్సి ఉంటుందని సూచించారు. అంతేకాకుండా ఇలా ప్రతి ఏడాది లేదా 18నెలలకు ఒకసారి బూస్టర్‌ డోసులు తీసుకోవాల్సిన అవసరం వస్తుందని ఆయన అంచనా వేశారు.

భారత్‌ రకంపైనా పనిచేస్తుంది..!

ఇప్పటికే అందుబాటులోకి వచ్చిన ఫైజర్‌ టీకా భారత్‌లో వెలుగుచూసిన కొత్తరకంపైనా పనిచేస్తుందనే విశ్వాసం ఉందని ఫైజర్‌ అధినేత ఉగుర్‌ సాహిన్‌ స్పష్టంచేశారు. భారత్‌ వేరియంట్‌పై ఇప్పటికే పరీక్షించామని.. అయినప్పటికీ ప్రస్తుత మ్యూటేషన్లపై మరిన్ని పరీక్షలు జరుపుతామని పేర్కొన్నారు. ఫైజర్‌ టీకాను భారీస్థాయిలో పంపిణీ చేసిన ఇజ్రాయెల్‌ కూడా ఇదే విషయాన్ని వెల్లడించింది. ఇదిలాఉంటే, భారత్‌లో వెలుగుచూసిన కొత్తరకం వైరస్‌(B.1.617) ఇప్పటికే 17 దేశాలకు విస్తరించిందని ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది.

ఇదీ చదవండి: సీరం సీఈవో పూనావాలాకు వై-కేటగిరి భద్రత

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.