ETV Bharat / entertainment

మయోసైటిస్‌ ప్రకటన తర్వాత ఫొటోతో సమంత అప్‌డేట్‌

author img

By

Published : Nov 7, 2022, 8:02 PM IST

ప్రస్తుతం సమంత మయోసైటిస్‌ నుంచి కోలుకుంటోంది. చాలా రోజుల తర్వాత తన పూర్తి ఫొటోలు షేర్‌ చేసిన ఆమె 'యశోద' చిత్ర ప్రచారంలో పాల్గొననున్నట్లు తెలిపింది. ప్రస్తుతం ఈ ఫొటోలు నెట్టింట వైరల్‌ అవుతున్నాయి.

samantha Myositis update
samantha Myositis update

టాలీవుడ్‌లో క్రేజ్‌ ఉన్న కథానాయికల్లో సమంత ఒకరు. అగ్రహీరోల సరసన నటిస్తూనే లేడీ ఓరియంటెడ్‌ పాత్రలు చేస్తూ అలరిస్తుంటుంది. ఆమె ప్రధానపాత్రలో నటించిన యశోద చిత్రం ఈ నెల 11న ప్రేక్షకుల ముందుకు రానున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో చిత్రబృందం యశోదలోని ప్రధాన తారాగణంతో ప్రమోషన్స్‌ను ముమ్మరం చేసింది. తాజాగా సమంత కూడా ఈ చిత్ర ప్రచారంలో భాగం కానున్నట్లు తెలిపింది. అయితే ప్రత్యక్షంగా పాల్గొంటారా లేదంటే చిత్రం గురించి ఏదైనా ఇంటర్వ్యూ ఇస్తారా అనేది తెలియాల్సి ఉంది. ఈ నేపథ్యంలో సామ్‌ చేసిన పోస్ట్‌ నెట్టింట వైరల్‌గా మారింది.

samantha Myositis update
సమంత

చాలారోజుల తర్వాత తన పూర్తి ఫొటో షేర్‌ చేసిన సమంత.. "జీవితంలో ఏరోజు ఎలా ఉన్నా.. పరిస్థితులు మనకు అనుకూలంగా లేకపోయినా.. మనం వాటిని ఎదుర్కొంటూ ముందుకు వెళ్లాలి. మన ధైర్యం ఏమిటో నిరూపించుకోవాలి' అని నాకు మా స్నేహితులు చెప్పారు. ఆ మాటలను నేను స్ఫూర్తిగా తీసుకుంటున్నా అందుకే నవంబర్‌ 11న మీ ముందుకు రానున్న యశోద సినిమా ప్రమోషన్స్‌లో నేను పాల్గొంటా' అని పేర్కొంది. ఆరోగ్యం బాగాలేకపోయినా సినిమా కోసం కష్టపడుతున్న సామ్‌పై అందరూ పొగడ్తల వర్షం కురిపిస్తున్నారు. 'సినిమాలపై మీకున్న నిబద్ధతకు హట్సాఫ్‌' అని ఒకరంటే.. 'ది క్వీన్‌ ఈజ్‌ బ్యాక్‌' అని మరొకరు కామెంట్‌ చేశారు. ఏది ఏమైనా చాలా రోజుల తర్వాత వాళ్ల అభిమాన తారను చూసుకున్నందుకు అభిమానులు మాత్రం ఖుషీ అవుతున్నారు.

samantha Myositis update
సమంత

ఇటీవల సమంత మయోసైటిస్‌ వ్యాధితో బాధపడుతున్నట్లు చెబుతూ ట్వీట్‌ చేసిన సంగతి తెలిసిందే. "యశోద' ట్రైలర్‌కు మీ స్పందన చాలా బాగుంది. జీవితం ముగింపులేని సవాళ్లను నా ముందు ఉంచింది. మీరు చూపిస్తున్న ప్రేమ, అనుబంధం నాకు మరింత మనోబలాన్ని, ఆ సవాళ్లను ఎదుర్కొనే ధైర్యాన్ని ఇస్తోంది. గత కొన్ని నెలల నుంచి 'మయోసైటిస్‌' అనే ఆటో ఇమ్యూనిటీ కండిషన్‌కు చికిత్స తీసుకుంటున్నా. ఇప్పుడు నా ఆరోగ్యం నిలకడగా ఉంది. ఇప్పుడిప్పుడే దాని నుంచి కోలుకుంటున్నా."

samantha Myositis update
సమంత

"కానీ, నేను అనుకున్న దానికన్నా కాస్త ఎక్కువ సమయమే పట్టే అవకాశం ఉంది. అన్నిసార్లూ బలంగా ముందుకు వెళ్లలేమని నాకు తత్వం బోధపడింది. ప్రతిదీ స్వీకరిస్తూనే నా పోరాటం కొనసాగిస్తా. త్వరలోనే దీని నుంచి పూర్తిగా కోలుకుంటానని వైద్యులు నమ్మకంతో ఉన్నారు. నా జీవితంలో అటు మానసికంగా, ఇటు శారీరకంగా మంచి, చెడు రోజులను చూశాను. అలాంటి పరిస్థితులను ఇంకొక్క రోజు కూడా భరించలేనేమో అనుకున్నా సందర్భాలున్నాయి. కానీ, ఎలాగో ఆ క్షణాలు గడిచిపోయాయి. నేను పూర్తిగా కోలుకునే రోజు అతి దగ్గరలోనే ఉంది. ఐ లవ్‌ యూ" అని సమంత ట్వీట్‌ చేశారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.