ETV Bharat / crime

Constable Courage: ట్రాఫిక్​ కానిస్టేబుల్​ సాహసం.. తల్లీకూతుళ్లు సురక్షితం​..

author img

By

Published : Feb 12, 2022, 9:25 PM IST

traffic constable rescued mother and daughter from fire accident at panjagutta
traffic constable rescued mother and daughter from fire accident at panjagutta

Constable Courage: నాలుగో అంతస్తులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. అందులో తల్లీకూతురు చిక్కుకున్నారు. కాపాడాలని చాలా మందికి ఉన్నా.. ఎవ్వరికీ ధైర్యం సరిపోవట్లేదు. అదే సమయంలో వచ్చాడు మన హీరో. అందరూ వద్దని హెచ్చరిస్తోన్నా.. ప్రాణాలకు తెగించి రిస్క్​ చేశాడు. తల్లీకూతుళ్లను సురక్షితంగా అగ్నిప్రమాదం నుంచి కాపాడి.. రియల్​ హీరో అనిపించుకున్నాడు.

Constable Courage: మంటల్లో చిక్కుకున్న తల్లి కూతుళ్లను ప్రాణాలకు తెగించి కాపాడి.. ఓ కానిస్టేబుల్​ రియల్​ హీరో అనిపించుకున్నాడు. హైదరాబాద్​ పంజాగుట్ట సర్కిల్‌ సమీపంలో ఉన్న ఓ అపార్ట్‌మెంట్‌లోని నాలుగో అంతస్తులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. అదే అంతస్తులో ఉన్న మల్లీశ్వరీ, మౌనిక అనే తల్లీకూతుళ్లు.. అగ్నిప్రమాదంలో చిక్కుకున్నారు. చాలా మంది మంటలు ఆర్పేందుకు ప్రయత్నిస్తున్నారు. మంటల్లో చిక్కుకున్న వాళ్లను కాపాడాలని అక్కడున్న వాళ్లందరికీ ఉంది.. కానీ.. ఎవ్వరూ అంత సాహసం చేయలేకపోతున్నారు.

ధైర్యంగా మంటల్లోకి దూకి..

అదే సమయంలో విధుల్లో ఉన్న పంజాగుట్ట ట్రాఫిక్​ కానిస్టేబుల్​ శ్రవణ్​కుమార్​కు ఈ విషయం తెలిసింది. హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకున్న శ్రవణ్​కుమార్..​ మంటలు ఆర్పేందుకు చూశాడు. కానీ.. అలా చేస్తే చాలా సమయం పడుతోందని గ్రహించాడు. ఈలోగా మంటల్లో చిక్కుకున్న తల్లీకూతుళ్లకు ఏదైనా ప్రమాదం జరగొచ్చని ఊహించాడు. ఎలాగైనా వాళ్లను రక్షించాలని తలచాడు. స్థానికులంతా వద్దని హెచ్చరిస్తున్నా.. సాహసం చేశాడు. టెర్రస్‌ పైకి వెళ్లి మంటలు అలుముకున్న నాలుగో అంతస్తులోకి దూకాడు. మంటల మధ్యన ఉన్న తల్లికూతుళ్లను బయటకు తెచ్చేందుకు.. ధైర్యంగా తాను లోపలికి వెళ్లాడు.

స్థానికుల అభినందనలు..

అందరూ ఏమవుతుందోనని ఆందోళనతో చూస్తుండగా.. ఇద్దరినీ కాపాడి సురక్షితంగా కిందకు తీసుకొచ్చాడు మన కానిస్టేబుల్​. ఈ క్రమంలో ఎవ్వరికీ ఎలాంటి ప్రమాదం జరగకపోవటంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. సమయాస్ఫూర్తితో తన కర్తవ్యాన్ని నిర్వర్తించి తల్లీకూతుళ్లను కాపాడిన ట్రాఫిక్ కానిస్టేబుల్ శ్రవణ్‌కుమార్‌ను స్థానికులు అభినందించారు.

ఇదీ చూడండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.