ETV Bharat / crime

Ambulance Fraud: ప్రాణాలు కాపాడాల్సిన అంబులెన్స్​లే చంపేస్తున్నాయి!

author img

By

Published : Oct 1, 2021, 3:38 PM IST

Ambulance Fraud
అంబులెన్స్​ల దందా

అత్యవసర సమయాల్లో ప్రాణాలు కాపాడుతూ.. దూర ప్రాంతాల్లోని ఆసుపత్రులకు తీసుకెళ్లేందుకు వినియోగించే అంబులెన్స్​ల విషయంలో కొందరు అక్రమాలకు పాల్పడుతున్నారు. కరోనా సమయంలో అంబులెన్సుల వినియోగం పెరగడంతో అక్రమ దందాకు అవకాశంగా మలుచుకున్నారు. ప్రయాణికులను తరలించే వాహనాలను అనుమతి లేకుండా అంబులెన్స్​లుగా మార్చి వినియోగిస్తున్నారు. దీంతో అమాయక రోగులు అత్యవసర సమయాల్లో సరైన సేవలు అందక ప్రాణాలు కోల్పోతున్న ఘటనలు చోటుచేసుకున్నాయి.

నల్గొండ జిల్లా మిర్యాలగూడలో కరోనా విపత్తులో ధనార్జనే ధ్యేయంగా అంబులెన్స్ యజమానులు రోగుల జేబులను కొల్లగొడుతున్నారు. ఈ మధ్యకాలంలో అంబులెన్స్​ల వినియోగం అధికంగా ఉండటంతో నిబంధనలకు నీళ్లు వదిలి ప్రయాణికులను తరలించే వాహనాలను అంబులెన్సులుగా వాడకంలోకి తీసుకొస్తున్నారు. దీంతో చాలా చోట్ల ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. పాతకాలం నాటి వాహనాలను సైతం మార్పు చేసి అంబులెన్స్​లుగా ఉపయోగిస్తున్నారు.

ఆర్టీఏ అధికారులు చూసీచూడనట్లు వ్యవహరిస్తుండటంతో మిర్యాలగూడలో అంబులెన్స్ దందా యథేచ్ఛగా కొనసాగుతోంది. మిర్యాలగూడలో 100 పడకల ఆసుపత్రి ఉన్నప్పటికీ ప్రభుత్వ అంబులెన్స్​లు లేకపోవడం పేదలకు భారంగా మారింది. ప్రజా సంఘాలు, పట్టణ వాసుల అభ్యర్థన మేరకు గతంలో ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డి ఏరియా ఆసుపత్రికి సొంత నిధులతో అంబులెన్స్​ను ఇవ్వడం జరిగింది. అది కాస్తా మూలనపడి ఏళ్లు గడుస్తున్నా దానిని వినియోగంలోకి తీసుకు రావడం లేదు. అంబులెన్స్ యజమానులు సిండికేట్​గా మారి రోగుల జేబులను కొల్లగొడుతున్నారు. నాసిరకం వాహనాలను వాడి రోగుల ప్రాణాలను హరిస్తున్నారు. ఈ దందాపై ఉన్నత అధికారులు దృష్టి సారించాలని కోరుతున్నారు.

రెండేళ్ల క్రితం కేంద్ర ప్రభుత్వం ఆంబులెన్స్ వల్ల ప్రమాదాలు పెరిగిపోతున్న నేపథ్యంలో ప్రతి అంబులెన్స్​కు 2 ఎయిర్ బ్యాగ్​లు అమర్చాలని నిబంధన విధించింది. రోగులు, వారి వెంట ఉండే వారి రక్షణ కోసం ప్రత్యేకంగా ఆక్సిజన్ సౌకర్యం కల్పించేలా నిబంధనలను పాటించాలని ఆదేశించింది. జిల్లాలు, హైదరాబాద్ ప్రాంతాల్లోని షోరూంలో నిర్వాహకులు ప్రయాణికుల కోసం వాడే వాహనాలను కంపెనీల వారికి తెలియకుండా అంబులెన్స్ అని తాత్కాలిక రిజిస్ట్రేషన్ పత్రాల్లో రాసి ఇస్తున్నారు. కంపెనీవారు ఫామ్ 22 లో ప్రయాణికుల వాహనం అని రాసినప్పటికీ కింది స్థాయిలో ఈ సమస్య తలెత్తుతుంది. ఈ పత్రాల ఆధారంగా రవాణాశాఖ అధికారులు రిజిస్ట్రేషన్ చేస్తున్నారు.

అధికారులు దృష్టి సారించాలి

నిబంధనల ప్రకారం ఎయిర్ బ్యాగులు, రక్షణ సామాగ్రి, ప్రాథమిక చికిత్స కిట్లు లేకుండానే అంబులెన్సులు నిర్వహిస్తున్నారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా సుమారు 100 వరకు ఇలాంటి వాహనాలు మార్కెట్లోకి వచ్చినట్లు సమాచారం. రోగుల తరలింపునకు ఈ తరహా వాహనాలు అంత సురక్షితం కాదు. పోలీసులు, రవాణాశాఖ అధికారులు దృష్టి సారించాలని స్థానికులు కోరుతున్నారు. కేంద్ర ప్రభుత్వ నూతన వాహన చట్టం ప్రకారం అంబులెన్స్​ను వాహనాల కంపెనీల వారే తయారు చేయాలి. ప్రత్యేకంగా రోగి స్ట్రెచర్ బెడ్, ఆక్సిజన్ సిలిండర్, రోగి సహాయకులు కూర్చునే సీట్లు అమర్చుతారు. కంపెనీవారు ఫామ్ 22లో అంబులెన్స్ పేరుతో విక్రయిస్తారు. వీటిని ఆసుపత్రుల వారికి విక్రయిస్తే వారు రవాణా కార్యాలయంలో రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి.

ఇటీవల కొందరు షోరూమ్ వారు తాత్కాలిక రిజిస్ట్రేషన్ పత్రంలో అంబులెన్స్ అని ఇస్తున్నట్లు గుర్తించామని దీనిపై రవాణా శాఖ కమిషనర్​కు, ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్తున్నామని వెల్లడించారు. మిర్యాలగూడ కార్యాలయంలో ఈ తరహా వాహనాల రిజిస్ట్రేషన్​ నిలిపివేశామని వాహన తనిఖీ అధికారి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు.

ఇదీ చూడండి: PREGNANT LADY: అంబులెన్స్‌ నడవక.. సిగ్నల్స్​ లేక.. గర్భిణీ అవస్థ!

108 STAFF: ఆగి పోయిన పసి గుండెను.. మళ్లీ బతికించారు

అంబులెన్స్​లోనే గర్భిణీకి పురుడుపోసిన సిబ్బంది.. తల్లీబిడ్డ క్షేమం

AMBULANCE: అంబులెన్స్​లో గర్భిణీ.. బురదలో చిక్కుకున్న వాహనం.. ఏమైందంటే..?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.