ETV Bharat / crime

CYBER CRIME: 'ఓటీపీ అవసరం లేకుండానే డబ్బును మాయం చేస్తున్నారు'

author img

By

Published : Mar 21, 2022, 5:32 PM IST

CYBER CRIME
CYBER CRIME

ఇటీవల కాలంలో సామాజిక మాధ్యమాల వినియోగం బాగా పెరిగింది. మోసాలకు పాల్పడే వారి సంఖ్య కూడా అదే స్థాయిలో ఉంటోంది. సాంకేతిక పరిజ్ఞానాన్ని ఆసరాగా చేసుకుని నిందితులు... పోలీసులకు చిక్కకుండా మోసాలకు పాల్పడుతున్నారు. రోజురోజుకీ పెరిగిపోతున్న సైబర్‌ నేరాలు పోలీసులకు సవాల్‌ విసురుతున్నాయి. సామాజిక మాధ్యమసంస్థలు, బ్యాంకుల నుంచి... సకాలంలో ఆధారాలు సేకరించడంలో పోలీసులు విఫలమవుతున్నారు. ఫలితంగా సొమ్ము రికవరీ, నిందితుల అరెస్టు కష్టమవుతోంది.

'ఓటీపీ అవసరం లేకుండానే డబ్బును మాయం చేస్తున్నారు'

విజయవాడలో సైబర్‌ నేరాలు రోజురోజుకీ పెరిగిపోతున్నాయి. సైబర్ నేరగాళ్లు భారీగా నగదు దోపిడీకి పాల్పడుతున్నారు. ఓటీపీ సాయంతో బ్యాంకు ఖాతాలోని నగదు బదిలీ చేయటంతోపాటు ఓటీపీ అవసరం లేకుండానే డబ్బును మాయం చేస్తున్నారు. నగర కమిషనరేట్ పరిధిలో... ప్రధానంగా ఆన్‌లైన్‌ ద్వారా ఖాతాదారులకు తెలియకుండా నగదు డ్రా చేస్తున్న కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి. ఫేస్‌బుక్‌ ద్వారా వేధింపులు, బహుమతులు, ఉద్యోగాలు, రుణాల పేరుతో జరిగే మోసాలు ఆ తర్వాతి స్థానంలో ఉన్నాయి. కాజేసిన సొమ్మును వివిధ అంకౌట్లకు పంపించటం వల్ల దర్యాప్తు ఆలస్యమవుతోంది. ఫలితంగా రికవరీ అంతంతమాత్రంగానే ఉంటోంది.

నేరాల మూలాలు ఉత్తరాది రాష్ట్రాల్లో..

మోసం జరిగిన వెంటనే ఫిర్యాదు చేసి.. దర్యాప్తు చేస్తేనే ఫలితం ఉంటుంది. ఆలస్యం అయితే నిందితులు సొమ్మును మళ్లించటంతో పాటు తప్పించుకునే ప్రమాదం ఉంది. నిందితులు తప్పుడు వివరాలతో బ్యాంకు ఖాతాలు తెరవటం, దోచుకున్న సొమ్మును వేరు వేరు అకౌంట్లలోకి బదిలీ చేసి... దేశంలోని మారుమూల ప్రాంతాల్లోని బ్యాంకుల నుంచి డ్రా చేస్తున్నారు. అటువంటి ప్రాంతాలకు వెళ్లటం పోలీసులకు కష్టంగా మారుతోంది. డబ్బు మళ్లించేందుకు వినియోగించిన పలు సంస్థల నుంచి వివరాలు సేకరించటం కూడా సమస్యగా మారుతోంది. నమోదవుతున్న నేరాలకు సంబంధించిన మూలాలు ఎక్కువగా ఉత్తరాది రాష్ట్రాల్లో ఉంటున్నాయి. నిందితుల జాడ కోసం అక్కడికి వెళ్లినా.. స్థానిక పోలీసుల నుంచి పెద్దగా సహకారం అందటం లేదు. గతేడాది నమోదైన 19సైబర్‌ కేసులకు సంబంధించి నిందితులను ఇప్పటివరకు అరెస్టు చేయలేకపోయారు.సైబర్‌ క్రైమ్‌ పోలీస్‌ స్టేషన్లలో సిబ్బంది కొరత కూడా కేసుల దర్యాప్తు ఆలస్యమవటానికి కారణమవుతోంది.

ఇదీ చదవండి : Cyber Crime: నకిలీ యాప్ సృష్టించి.. నగదు కాజేసి..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.