ETV Bharat / crime

CYBER ALERT : గూగుల్​ సెర్చ్​లో జాగ్రత్త.. పాపప్‌ మెనూలతో బురిడీ

author img

By

Published : Jul 27, 2022, 8:38 AM IST

Cyber crime : తినే తిండి.. వేసుకునే దుస్తులు.. చూసే సినిమా.. చూపించుకోవాల్సిన వైద్యుడు.. అవసరం ఏదైనా సరే గూగుల్‌ సెర్చ్‌నే ఆశ్రయిస్తున్నారంతా.. ఈ అన్వేషణ వెనుక మాటేస్తున్న సైబర్‌ నేరగాళ్లు సమాచారార్థులకు వల విసురుతున్నారు. మాయమాటలు చెప్పి అందినకాడికి దండుకుంటున్నారు. ఏమైందో అర్థమయ్యేసరికే జరగాల్సిన నష్టం జరిగిపోయి వినియోగదారులు లబోదిబోమంటున్నారు.

Cybercrime
Cybercrime

Cyber crime: సకల సమాచారం అందుబాటులో ఉండే గూగుల్‌ మాటున సైబర్‌ నేరాలు కొత్తకాదు. అచ్చం అసలు వెబ్‌సైట్‌నే పోలినట్లుండే నకిలీది రూపొందించి దాని ద్వారా నేరాలకు పాల్పడుతుండటం చాలాకాలంగా జరుగుతూనే ఉంది. అయితే, పదేపదే ఇలాంటి నేరాలు జరుగుతుండటంతో జనం అప్రమత్తమై జాగ్రత్తగా ఉంటున్నారు. దాంతో ఇప్పుడు నేరగాళ్లు కొత్త ఎత్తులకు పాల్పడుతున్నారు. కవ్వించి మరీ ముగ్గులోకి దింపుతున్నారు. పాపప్‌ మెనూలతో గారడీ చేస్తూ.. ఖాతాల్లో ఉన్న సర్వం ఊడ్చేస్తున్నారు.

ఖాతాలు ఖాళీ..: హైదరాబాద్‌కు చెందిన ప్రవీణ్‌(పేరు మార్చాం)కు అమెరికా నుంచి ఆయన మిత్రుడు కొరియర్‌లో ఓ ఖరీదైన బహుమతి పంపారు. రోజులు గడుస్తున్నా అది అందకపోవడంతో సదరు కొరియర్‌ సంస్థ చిరునామా కోసం ఆయన గూగుల్‌ సెర్చ్‌ మొదలుపెట్టారు. ఈ సంస్థ పేరు కొట్టగానే కంప్యూటర్‌ తెరపై అదే పేరుతో ఓ పాపప్‌ మెనూ ప్రత్యక్షమైంది. సాంకేతిక కారణాల వల్ల బహుమతి ఆగిపోయిందని, కొద్దిమొత్తం చెల్లిస్తే వెంటనే డెలివరీ చేస్తామని అటునుంచి సమాధానం వచ్చింది. ఎలా చెల్లించాలని ప్రవీణ్‌ అడగ్గానే అటువైపు నుంచి ఓ క్యూఆర్‌ కోడ్‌ పంపారు. ప్రవీణ్‌ ఆ కోడ్‌ తెరిచిన కొద్దిసేపటికే ఆయన ఖాతాలో ఉన్న రూ.1.5 లక్షలు ఖాళీ అయ్యాయి. లబోదిబోమంటూ పోలీసులను ఆశ్రయించారు.

జాగ్రత్తలే ముఖ్యం: ప్రతి దానికీ సెర్చ్‌ మీద ఆధారపడకుండా ఏదైనా ఉత్పత్తి కొన్నప్పుడు దానికి సంబంధించి బిల్లు, లేబుల్‌ వంటివాటిని జాగ్రత్త చేసుకుంటే వాటిపై వెబ్‌ చిరునామా, కాల్‌సెంటర్‌ వివరాలు ఉంటాయి. అప్పుడు మోసానికి అవకాశం ఉండదు. కచ్చితమైన వెబ్‌ చిరునామా తెలిస్తే దాన్ని గూగుల్‌ సెర్చ్‌లో కాకుండా సరాసరి అడ్రస్‌బార్‌లో ఎంటర్‌ చెయ్యడం ద్వారా నకిలీల బారిన పడకుండా ఉండొచ్చని నిపుణులు సూచిస్తున్నారు.

పెరుగుతున్న నేరాలు.. ఏదైనా సమాచారం కావాలంటే సెర్చ్‌ చేయడం మామూలే. ఇంట్లో కుక్కర్‌ పాడయినా, గ్యాస్‌స్టౌవ్‌ పనిచేయపోయినా కాల్‌సెంటర్‌ నంబర్‌ కోసం నెట్‌లో వెతుకుతుంటాం. ఇలా ఏదైనా సంస్థ గురించి సెర్చ్‌ చేయగానే దాని పేరుతో ఉన్న పాపప్‌లు దర్శనమిస్తున్నాయని.. అది నిజమేనని నమ్మి జనం వాటి వలలో చిక్కుతున్నారని పోలీసులు చెబుతున్నారు. ఇంచుమించు ప్రతి ప్రముఖ ఉత్పత్తికి సంబంధించి ఇలా పాపప్‌లు తయారు చేసి దోచుకుంటున్నారని, దీనికి సంబంధించి కేసులు క్రమంగా పెరుగుతున్నాయని వారు వివరిస్తున్నారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.