ETV Bharat / crime

‘కొంప’లు ముంచేంత నిర్లక్ష్యం.. ఇంటి భద్రతకు నాసిరకం పరికరాలు

author img

By

Published : Jul 26, 2022, 10:28 AM IST

శివారు ప్రాంతాలనే అడ్డాలుగా చేసుకుని దొంగలు ముఠాలు తమ దోపిడీలను కొనసాగిస్తున్నాయి. భద్రతా సిబ్బంది.. సీసీ కెమెరాలు.. ఎన్ని ఉన్నా.. దొంగలు గురిపెడితే ఇవేమీ అడ్డుకావని పలు ఘటనలు నిరూపిస్తున్నాయి. రూ.1-2 కోట్లతో నిర్మించుకున్న భవన తలుపులకు సరైన తాళాలు లేకపోవడంతో దొంగలు సులువుగా లోపలకు చేరుతున్నట్లు పోలీసు అధికారులు చెబుతున్నారు.

robbers
robbers

భాగ్యనగర శివార్లలో దొంగల ముఠాలు హల్‌చల్‌ చేస్తున్నాయి. బీరువాల్లో నగలు.. ఎవరికీ తెలియకుండా దాచామని భావించే నగదు.. భద్రతా సిబ్బంది.. సీసీ కెమెరాలు.. అయినా దొంగలు గురిపెడితే ఇవేమీ అడ్డుకావని పలు ఘటనలు నిరూపిస్తున్నాయి. రూ.1-2 కోట్లతో నిర్మించుకున్న భవన తలుపులకు సరైన తాళాలు లేకపోవడంతో దొంగలు సులువుగా లోపలకు చేరుతున్నట్లు పోలీసు అధికారులు చెబుతున్నారు. కొన్ని ఇళ్లల్లో చోరీలకు యజమానుల నిర్లక్ష్యం కూడా కారణమవుతోందని చెబుతున్నారు. అపార్ట్‌మెంట్స్‌, గేటెడ్‌ కమ్యూనిటీల్లోని ఇళ్లకు నాసిరకం తాళాలు ఉపయోగిస్తున్నారు.

రెక్కీ చేసినా గుర్తించలేక.. యూపీ, ఎంపీ, కర్ణాటక, బిహార్‌, గుజరాత్‌కు చెందిన అంతర్రాష్ట్ర దొంగలు శివార్లలోని ఇళ్లను లక్ష్యంగా చేసుకుంటాయి. 1-2 రోజులు ముందుగానే రెక్కీ నిర్వహిస్తారు. కొత్త వ్యక్తులు నివాసాల చుట్టూ తిరుగుతున్నా పసిగట్టకపోవటం దొంగలకు కలిసొస్తుంది. పాతబస్తీకు చెందిన కరడుగట్టిన దొంగ గఫార్‌ఖాన్‌.. విల్లాలు, డూప్లెక్స్ ఇళ్లే లక్ష్యంగా చేసుకొని దొంగతనాలకు దిగేవాడు. అర్ధరాత్రి నుంచి తెల్లవారుజామున 4 గంటల వ్యవధిలో వంట గది కిటీకీ ఊచలను తొలగించి లోపలికి చేరతాడు. చంద్రి అనే మరో దొంగ అర నిమిషంలో రాడ్‌తో తాళం తప్పించి దర్జాగా పని పూర్తి చేస్తాడు.

తప్పిదాలివే.. దొంగతనాలు, దోపిడీలు జరిగిన ఇళ్లల్లో భద్రతా లోపాలు దొంగలకు అవకాశంగా మారుతున్నాయని పోలీసులు చెబుతున్నారు. చుట్టూ ఫెన్సింగ్‌ ఉన్నా విద్యుత్‌ సరఫరా ఉండదు.. ఖరీదైన గృహాల తలుపులకు రూ.100-200 విలువైన తాళాలు వేస్తారు. బాల్కనీల చుట్టూ ఎటువంటి రక్షణ ఏర్పాట్లు లేకపోవడంతో దొంగలకు కలసివస్తుంది. గృహాలంకరణ కోసం తలుపులు, కిటీకీల తయారీకు వాడే కలప పెలుసుగా ఉండి తొలగించటం తేలికవుతుంది. విహారయాత్రలు, వేడుకలకు వెళ్తున్నపుడు ఇరుగు పొరుగుకు సమాచారం ఇవ్వట్లేదు. వీటన్నింటినీ మించి ఇంట్లోనే పెద్ద మొత్తంలో డబ్బు, నగలు భద్రపరుస్తున్నారు. ఇవన్నీ దొంగలకు అనుకూలంగా ఉన్నాయంటూ రాచకొండకు చెందిన పోలీసు అధికారి విశ్లేషించారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.