ETV Bharat / city

kuppam municipal elections: నామినేషన్ వేయడానికి వెళ్తుండగా.. బుల్లెట్‌తో ఢీకొట్టి.. పత్రాలు లాక్కెళ్లి!

author img

By

Published : Nov 6, 2021, 8:30 AM IST

చిత్తూరు జిల్లా కుప్పం పురపాలికలోని(kuppam municipal elections) 14వ వార్డులో చివరిరోజు తాను నామినేషన్‌ వేయడానికి వెళ్తుండగా.. వైకాపా కార్యకర్తలు దాడి చేశారని మాజీ ఎంపీపీ, తెదేపా నుంచి బరిలోకి దిగిన వెంకటేశ్ ఆరోపించారు. వైకాపా నేతలు తనను బుల్లెట్‌ బండితో గుద్ది.. నామపత్రాలు లాక్కెళ్లారని వాపోయారు. దళితుడైన తనకు నామినేషన్‌ వేసే హక్కు లేదా? అంటూ మీడియా వద్ద వెంకటేశ్ ఆవేదన వ్యక్తం చేశారు.

kuppam municipal elections, tdp leaders
కుప్పం మున్సిపల్ ఎన్నికలు, కుప్పం పురపాలిక ఎన్నికల నామినేషన్లు

ఆంధ్రప్రదేశ్ చిత్తూరు జిల్లా కుప్పం పురపాలికలోని 14వ వార్డులో చివరిరోజు శుక్రవారం... తాను నామినేషన్‌ వేయడానికి వెళ్తుండగా వైకాపా కార్యకర్తలు బుల్లెట్‌ బండితో గుద్ది.. నామపత్రాలు లాక్కెళ్లారని మాజీ ఎంపీపీ, తెదేపా నుంచి బరిలోకి దిగిన వెంకటేశ్ ఆరోపించారు. పోలీసులకు ఆయన తెలిపిన వివరాలిలా ఉన్నాయి... శుక్రవారం మధ్యాహ్నం 12 గంటలకు నామినేషన్‌ వేయడానికి వెంకటేశ్ ద్విచక్రవాహనంపై బయలుదేరారు. దీన్ని గమనించిన వైకాపా కార్యకర్తలు బండిపై వెంబడించి, వాహనాన్ని ఢీకొట్టారు. వెంకటేశ్ బండి వదిలి పరుగులు తీయగా, వెనకాల వస్తున్న మరో ముగ్గురు బుల్లెట్‌తో ఢీకొట్టారు. కిందపడిన వెంకటేశ్​ను కాళ్లు, చేతులతో తొక్కారు. అనంతరం సెల్‌ఫోన్‌, నామినేషన్లు లాక్కెళ్లారు. పక్కనే పోలీసులున్నా.. అడ్డుకోలేదని ఆయన ఆరోపించారు. స్టేషన్‌కు వచ్చి ఫిర్యాదు ఇవ్వాలని చెప్పారన్నారు. దళితుడైన తనకు నామినేషన్‌ వేసే హక్కు లేదా? అంటూ వెంకటేశ్ మీడియా వద్ద ఆవేదన వ్యక్తం చేశారు. విషయం తెలిసిన ఏపీ మాజీమంత్రి అమరనాథరెడ్డి, తెదేపా ఎమ్మెల్యే అశోక్‌కుమార్‌ (ఇచ్ఛాపురం), కుప్పం నియోజకవర్గ తెదేపా ఇన్‌ఛార్జి పీఎస్‌ మునిరత్నం కలిసి వెంకటేశ్​ను ఆస్పత్రిలో చేర్చారు. పోలీసులు అక్కడకు చేరుకుని స్టేట్‌మెంట్‌ రికార్డు చేశారు. కాసేపటి తర్వాత వారు వెంకటేశ్​తో నామినేషన్‌ దాఖలు చేయించారు.

దాడులతో గెలుస్తారా: అమరనాథరెడ్డి
ప్రశాంతమైన కుప్పంలో దాడులు, దౌర్జన్యాలతో... పురపాలిక ఎన్నికల్లో విజయం సాధించాలని వైకాపా నాయకులు భావిస్తున్నారని ఏపీ మాజీ మంత్రి అమరనాథరెడ్డి విమర్శించారు. వెంకటేశ్​పై దాడి చేసి.. పత్రాలు లాక్కెళ్లడం దారుణమన్నారు. దళితుడు, విద్యావంతుడైన వెంకటేష్‌పై దాడిని ఖండిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో చంద్రబాబు పీఏ మనోహర్‌ పాల్గొన్నారు.
* తూర్పుగోదావరి జిల్లా కూనవరం మండలం కాచవరంలో పంచాయతీ ఒకటోవార్డుకు నామినేషన్‌ వేసిన తనను వైకాపా నాయకుడు ఫోన్‌లో బెదిరించారని గిరిజన మహిళ బొడ్డు శిరీష ఆరోపించారు. తెదేపా అధ్యక్షుడు చంద్రబాబు ఆమెకు ఫోన్‌లోధైర్యం చెప్పారు.
* కర్నూలు జిల్లా కొలిమిగుండ్ల జడ్పీటీసీ స్థానానికి తమ పార్టీ తరఫున పోటీ చేసేందుకు వచ్చిన పృథ్వి నుంచి నామినేషన్లతో పాటు ప్రతిపాదించే వ్యక్తినీ వైకాపా నేతలు తీసుకెళ్లారని జనసేన నేతలు ఆరోపించారు.

ఇదీ చదవండి: T-Hub CEO: 'ఆలోచనతో వస్తే.. వ్యాపారవేత్తలుగా మారుస్తాం'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.