ETV Bharat / city

Singareni: సింగరేణి కార్మికుల కుటుంబాలకు శుభవార్త

author img

By

Published : Apr 21, 2022, 2:18 AM IST

Singareni
Singareni

Singareni: కార్మికుల కుటుంబాలకు సింగరేణి సంస్థ శుభవార్త చెప్పింది. 35ఏళ్లు దాటిన డిపెండెంట్లకు కారుణ్య నియామకాల్లో అవకాశం కల్పించేందుకు నిర్ణయం తీసుకుంది. కరోనాతో మరణించిన పొరుగు సేవల సిబ్బంది కుటుంబీకులకు రూ. 15లక్షల పరిహారం చెల్లించాలని నిర్ణయించింది. అసిస్టెంట్‌ లేబర్ కమిషనర్ సమక్షంలో సింగరేణి యాజమాన్యానికి కార్మిక సంఘాలకు మధ్య జరిగిన చర్చల్లో 9 అంశాలపై సింగరేణి సంస్థ చరిత్రాత్మక ఒప్పందం కుదుర్చుకుంది.

Singareni: సింగరేణిలో ఇటీవల అన్ని కార్మిక సంఘాలు ఇచ్చిన సమ్మె నోటీసుపై... దశల వారీగా జరిగిన చర్చలు చివరికి సఫలమయ్యాయి. అసిస్టెంట్‌ లేబర్‌ కమిషనర్‌ లక్ష్మణ్‌ సమక్షంలో హైదరాబాద్‌లో సింగరేణి యాజమాన్యానికి, ఆరు కార్మిక సంఘాలకు మధ్య చారిత్రక ఒప్పందం కుదిరింది. రాష్ట్రంలోని నాలుగు బొగ్గు బ్లాక్‌ల వేలాన్ని ఉపసంహరించుకోవాలన్న డిమాండ్‌తో... కేంద్రాన్ని కలిసేందుకు వెళ్లనున్న కార్మిక సంఘాల నాయకులకు యాజమాన్యం పూర్తి సహకారం అందించేందుకు సమ్మతించింది.

కరోనా వేళ దాదాపు ఏడాదిన్నర పాటు మెడికల్‌ బోర్డు నిర్వహించనందు వల్ల ఆ సమయంలో 35 ఏళ్లు దాటిన వారసులకు కారుణ్య నియామకాల్లో... ఉద్యోగం ఇచ్చేందుకు యాజమాన్యం అంగీకరించింది. మెడికల్‌ ఇన్వాలిడేషన్‌ అయిన సింగరేణి ఉద్యోగి జీవిత భాగస్వామి... ఒకవేళ ప్రభుత్వ, ప్రభుత్వ రంగ సంస్థల్లో, సింగరేణి పాఠశాలల్లో ఉద్యోగం చేస్తున్నా వారి వారసులకు ఉద్యోగం ఇవ్వడానికి అంగీకరించింది. ప్రస్తుతం అలాంటి వారి దరఖాస్తులను పెండింగ్‌లో ఉంచడం జరగ్గా... ఈ ఒప్పందం ప్రకారం వన్‌ టైం సెటిల్మెంట్‌గా వారసత్వ ఉద్యోగం ఇవ్వడానికి యాజమాన్యం అంగీకరించింది.

ఈసీ ఆపరేటర్లు, మైనింగ్‌ స్టాఫ్‌, ట్రెడ్స్‌మెన్‌లు... మెడికల్‌ అన్‌ఫిట్‌ అయితే సర్ఫేస్‌ మీద అదే ఉద్యోగం ఇచ్చేఅంశాన్ని కంపెనీ అంతర్గత కమిటీ పరిశీలనకు పంపించి... 60 రోజుల్లో నిర్ణయం తీసుకోనున్నట్లు యాజమాన్యం హామీ ఇచ్చింది. వారసత్వ ఉద్యోగప్రక్రియ మరింత వేగవంతం చేస్తామని పేర్కొంది. స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియాలో కార్పోరేట్‌ శాలరీ అకౌంట్‌ ఉన్న సింగరేణి ఉద్యోగులు గని ప్రమాదాలు, ఇతర ప్రమాదాల్లో మృతిచెందితే వారి కుటుంబీకులకు రూ.40 లక్షల పరిహారం ఇచ్చేలా... ఎస్​బీఐతో అవగాహన ఒప్పందం చేసుకున్నట్లు యాజమాన్యం తెలిపింది. ఇతర బ్యాంకులు ఆ పరిహారం మొత్తాన్ని పెంచేందుకు ముందుకొచ్చే అవకాశాలు అన్వేషిస్తామని హామీ ఇచ్చారు. పొరుగు సేవల విభాగంలో పనిచేస్తూ కరోనా వల్ల మృతిచెందిన వారి కుటుంబీకులకు రూ. 15 లక్షల పరిహారం చెల్లించేందుకు సింగరేణి యాజమాన్యం అంగీకరించింది.

ఒప్పందంపై కార్మిక సంఘాలు, సింగరేణి యాజమాన్యం సంతకాలు చేశాయి. దీనిపై అన్ని కార్మిక సంఘాలు సంస్థ సీఎండీ శ్రీధర్‌కు, డైరెక్టర్లకు ధన్యవాదాలు తెలిపాయి. యాజమాన్య సానుకూల వైఖరిపై కార్మిక సంఘాలు హర్షం వ్యక్తం చేశాయి.

ఇదీ చదవండి:ఆరు విశ్వవిద్యాలయాల్లో పోటీ పరీక్షల శిక్షణ కేంద్రాలు ఏర్పాటు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.