ETV Bharat / city

కరోనా ప్రభావం నుంచి బయటపడ్డ వాణిజ్య పన్నుల శాఖ

author img

By

Published : Dec 19, 2020, 9:44 AM IST

telangana-commercial-taxes-department-is-out-of-lock-down-crisis
కరోనా ప్రభావం నుంచి బయటపడ్డ వాణిజ్య పన్నుల శాఖ

తెలంగాణ రాష్ట్ర వాణిజ్య పన్నుల శాఖ లాక్‌డౌన్‌ ప్రభావం నుంచి బయట పడింది. జీఎస్టీ, వ్యాట్‌ రాబడుల్లో క్రమంగా వృద్ధి కనిపిస్తోంది. అక్టోబరు కంటే నవంబర్​ నెలలో అనూహ్యంగా 77శాతం రాబడులు పెరిగాయి.

లాక్‌డౌన్‌ సమయంలో పూర్తిగా స్తంభించిన వాణిజ్య, వ్యాపార సంస్థలకు.. నిబంధనల సడలింపు తర్వాత నిర్వహణ కూడాభారంగా మారింది. నెమ్మదిగా సాగిన వ్యాపార కార్యకలాపాలు క్రమంగా ఊపందుకుని నవంబర్ నెలనాటికి పూర్తిస్థాయిలో పుంజుకున్నాయి. వ్యాట్, జీఎస్టీ రాబడులు క్రమంగా పెరుగుతూ వచ్చాయి.

ఈ ఏడాది తక్కువే

ప్రతి నెల మూడున్నర వేల నుంచి నాలుగువేల కోట్ల రూపాయల వ్యాట్‌, జీఎస్టీ వసూళ్లు కావాల్సి ఉండగా...కరోనా సమయంలో అది నాలుగో వంతుకు పడిపోయింది. ఆ తరువాత వాణిజ్య పన్నుల శాఖలో క్రమంగా పెరిగిన రాబడుల తీరును పరిశీలిస్తే... ఈ ఏడాది ఏప్రిల్‌ నెలలో రూ.932.54 కోట్లురాగా మే నెలలో రూ.1567.21 కోట్లు వచ్చింది. జూన్‌లో రూ.3,776.67 కోట్లు, జులైలో రూ.3,786.21 కోట్లు, ఆగస్టులో రూ.3,935.50 కోట్ల లెక్కన ఈ ఐదు నెలలు గతేడాది ఇదే సమయంలో వచ్చిన ఆదాయంతో పోలిస్తే బాగా తక్కువని అధికారిక లెక్కలు స్పష్టం చేస్తున్నాయి.

గతేడాది కంటే.. 58 శాతం ఎక్కువ

గతేడాది సెప్టెంబర్​ రాబడి కంటే ఈ ఏడాది 10 శాతం అదనం రాబడి వచ్చినట్లు అధికారులు తెలిపారు. ఈ ఏడాది అక్టోబర్​లో గతేడాది కంటే 58 శాతం ఎక్కువ రాబడి వచ్చినట్లు వెల్లడించారు. 2020లో ఏప్రిల్‌ నుంచి నవంబరు వరకు వచ్చిన వ్యాట్‌, జీఎస్టీ పన్నుల రాబడులు మొత్తం.. 2019లో ఇదే సమయంలో వచ్చిన రాబడుల కంటే 1.16శాతం ఎక్కువని వాణిజ్య పన్నుల శాఖ అధికారులు తెలిపారు. వ్యాట్‌, జీఎస్టీ రాబడులు లాక్‌డౌన్‌ ప్రభావం నుంచి పూర్తిగా బయట పడి.. వృద్ధి కనబరచడానికి ఎనిమిది నెలల కాలం పట్టిందని చెప్పారు.

2020లో రూ.29,722.44 కోట్ల రాబడి

ఈ ఏడాది ఏప్రిల్ నుంచి నవంబరు నెల వరకు ఎనిమిది నెలల్లో...వ్యాట్‌, జీఎస్టీ రాబడులు కలిపి రూ.29,722.44 కోట్లు రాగా అంతకు ముందు ఏడాది ఇదే ఎనిమిది నెలల్లో రూ.29,381.97 కోట్లు మాత్రమే వచ్చింది.

ఈ ఏడాది ఏప్రిల్‌ నుంచి నవంబరు నెల వరకు పద్దుల వారీగా.. వచ్చిన రాబడులు

పద్దు పేరు2019 ఏప్రిల్‌ నుంచి నవంబరు వరకు రాబడులు(రూ.కోట్లల్లో)2020 ఏప్రిల్‌ నుంచి నవంబరు వరకు రాబడులు( రూ. కోట్లల్లో)
పెట్రోల్‌ ( వ్యాట్‌) 5941 4763.38
మద్యం (వ్యాట్‌) 6230 7070
ఎస్‌జీఎస్టీ 81756817.11
ఐజీఎస్టీ7055 6203.07
ఐజీఎస్టీ సెటిల్మెంట్‌544 2638
జీఎస్టీ పరిహారం875 1726.07
ఇతర పన్నులు 562 504.81
మొత్తం రాబడులు29,382 29,722.44
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.