ETV Bharat / city

నిరాదరణకు గురవుతున్న నిరాశ్రయులు..

author img

By

Published : May 6, 2021, 7:12 PM IST

హైదరాబాద్​లోని నిరాశ్రయులు నిరాదరణకు గురవుతున్నారు. అందరిలా వాళ్లకి అయినవారు లేరు. ఆత్మీయ పలకరింపు కరవు. డబ్బు ఉండదు. ఆస్పత్రికి వెళ్లి చికిత్స తీసుకోలేని దుస్థితి వారిది. జీహెచ్‌ఎంసీ అధికారులనే నమ్ముకుని నిరాశ్రయుల కేంద్రాల్లో గడుపుతున్నారు. బాగోగులు చూడాల్సిన బల్దియా మాత్రం ఏమీ పట్టనట్లు వ్యవహరిస్తోంది. అనారోగ్యం, శారీరక, మానసిక వైకల్యం, ఇతరత్రా సామాజిక రుగ్మతలతో బాధపడుతోన్న ఆపన్నులకు చేయూతనివ్వట్లేదు. విపత్కర పరిస్థితుల్లో బిక్కుబిక్కుమంటూ బతుకుతోన్న అభాగ్యులకు.. కొవిడ్‌ పరీక్షలు చేయించట్లేదు. టీకా వేయించడంలోనూ అధికారులు చొరవ తీసుకోవట్లేదన్న విమర్శలొస్తున్నాయి.

homeless-people-suffering-in-pandemic-situation-in-hyderabad
homeless-people-suffering-in-pandemic-situation-in-hyderabad


జీహెచ్‌ఎంసీ పరిధిలో 12 చోట్ల నిరాశ్రయుల కేంద్రాలు ఉన్నాయి. అందులో 2 వేల మంది దాకా ఉంటారు. అంతకు పదింతలు కాలిబాటలు, దేవాలయాలు, ఇతర ప్రార్థనా మందిరాలు, బస్టాండ్లు, రైల్వేస్టేషన్లు, రద్దీ ప్రాంతాల్లో ఉంటారు. చిన్నపాటి పని చేసుకుని చిరుతిళ్లతో జీవితాన్ని లాక్కెళ్తున్న వారు కొందరు. భిక్షమెత్తుకుంటూ బతికేవారు మరికొందరు. ఇంట్లో నుంచి పారిపోయి నగరానికి వచ్చిన చిన్నారులు, కుటుంబ సభ్యుల వివక్షను భరించలేక, దాడులను తట్టుకోలేక పరుగుతీసిన వారు, కుటుంబ కలహాలు, మానసిక వైకల్యం, అనారోగ్యం, పేదరికం, ఇతరత్రా సామాజిక సమస్యలతో భాగ్యనగరానికి చేరిన వారూ ఉంటారు. బస్టాపులు, కాలిబాటలనే ఆవాసంగా మార్చుకుని జీవనం సాగిస్తున్నారు. అలాంటి వారందరినీ నిరాశ్రయుల కేంద్రాలకు తరలించి, మానసిక వికాసం కల్పించే బాధ్యత జీహెచ్‌ఎంసీది. అదేమీ అసలు పట్టించుకోవట్లేదు. మొత్తం 12 కేంద్రాల్లో ఇప్పటి వరకు రెండు కేంద్రాల్లోనే కొవిడ్‌ పరీక్షలు జరిగాయి. టీకా కార్యక్రమాలనూ చేపట్టలేదు. ఇదేంటని అడిగితే 45 ఏళ్లకు పైబడి వయసున్న వారు ఒకరిద్దరే ఉన్నారని, కొందరికి ఆధార్‌ కార్డులు లేవని అధికారులు వాస్తవాలను కప్పిపుచ్చుతున్నట్లు ఆరోపణలొస్తున్నాయి.

నిర్వహణ అధ్వాన్నం..

నిరాశ్రయుల కేంద్రాల నిర్వహణ అధ్వాన్నంగా మారుతోంది. జీహెచ్‌ఎంసీ ఆర్థిక సాయం చేయట్లేదని ఎన్జీవోలు.., అంతా ఎన్జీవోలే చూసుకోవాలని బల్దియా చేతులు దులిపేసుకుంటున్నాయి. బేగంపేట పై వంతెన కింద ఉండే కేంద్రంలో 150 నుంచి 200 మంది నాలుగు మరుగుదొడ్లను ఉపయోగించుకుంటున్నారు. యూసఫ్‌గూడలో 50 మందికి రెండు మరుగుదొడ్లు ఉన్నాయి. జీహెచ్‌ఎంసీ నిరాశ్రయుల కేంద్రం మేనేజరుకు రూ.5వేలు, సహాయకుడికి రూ.3,500ల జీతం ఇస్తోందని, ఆశ్రయం పొందుతున్న వారి భోజన ఖర్చులు ఎన్జీవోలపైనే పడతాయని ఓ కేంద్రం నిర్వాహకుడు తెలిపారు. పరిశుభ్రత, అనారోగ్యం ఉన్న వారికి మందులివ్వడం, మానసిక వికలాంగులకు కౌన్సిలింగ్‌ ఇవ్వడం వంటి సదుపాయాలు కల్పించాలని కోరుతున్నా బల్దియా పట్టించుకోవట్లేదని వాపోయారు.

కేంద్రాలు ఎక్కడెక్కడంటే..

ఉప్పల్‌ మున్సిపల్‌ ఆఫీసు, సరూర్‌నగర్‌ చౌడి భవనం, పేట్ల బురుజు వార్డు ఆఫీసు, శివరాంపల్లి వీకర్‌ సెక్షన్‌ కాలనీ, టప్పాచపుత్ర అంబేడ్కర్‌నగర్‌, గోల్నాక, కమలానగర్‌, యూసఫ్‌గూడ, బేగంపేట పైవంతెన కింద నాలాకు రెండు వైపులా, శేరిలింగంపల్లి పాత మున్సిపల్‌ ఆఫీసు, ఆర్‌కేపురం పైవంతెన వద్ద, నామాలగుండు, బేగంపేట బ్రాహ్మణ్‌వాడి

ఇదీ చూడండి: బిడ్డ పుట్టే వరకు గర్భవతి అని తెలీదట!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.