ETV Bharat / city

Homeless in Winter Telangana : ఓవైపు చలి.. మరోవైపు ఆకలి.. నిరాశ్రయులకు నీడేది..?

author img

By

Published : Dec 28, 2021, 12:18 PM IST

Homeless in Winter Telangana : కొ‌ద్దిరోజులుగా చలిపులి పంజా విసురుతోంది. ఎక్కడికక్కడ శీతల గాలులు వణికిస్తున్నాయి. పొద్దు వాలే కొద్దీ.. ఇళ్లల్లోనే ఉండలేకపోతున్నారు. కోట్లు, రగ్గులు, రూమ్‌హీటర్లతో చలి కాచు కోవడానికి అవస్థలు పడుతున్నారు. కానీ.. ఆ సౌకర్యాలు ఏమీ లేని నిరాశ్రయుల పరిస్థితి ఏమిటి? ఆకలికి తోడైన చలితో రోడ్లపక్కనే గజగజలాడుతున్న వారికి దిక్కు ఎవరు? తెలుగురాష్ట్రాల్లోని.. బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు, దుకాణ సముదాయాల పేవ్‌మెంట్లు, పుట్‌పాత్‌లపై నిత్యం కనిపిస్తున్న చిత్రాలవే ఇవి. జాతీయస్థాయిలోని పరిస్థితి ఇందుకు మినహాయింపు కాదు. నిలువనీడ లేక రాత్రి వేళల్లో కంటి మీద కునుకు కరవవుతోంది ఈ అభాగ్యులకు. వారినలా వదిలేయవద్దని సుప్రీం తీర్పు ఉన్నా.. అన్ని పురపాలికల్లో ఆశ్రయ కేంద్రాలు ఏర్పాటు చేయాలని కేంద్రం ప్రభుత్వం సంకల్పించినా.. అమల్లో అలసత్వం వారి పాటిల శాపంగా మారుతోంది. ఈ సమస్య ఏటా కనిపించేదే. కానీ పరిష్కారం ఎప్పటికి.. అన్నదే అంతులేని ప్రశ్నగా మారింది.

Homeless in Winter Telangana
Homeless in Winter Telangana

ఓవైపు చలి.. మరోవైపు ఆకలి.. నిరాశ్రయులకు నీడేది..?

Homeless in Winter Telangana : ఓ వైపు ఆకలి.. మరొకవైపు ఎముకలు కొరికే చలి. చలికి వణుకుతున్న ఈ నిరాశ్రయులను పట్టించుకునేది ఎవరు? సొంత గూడు లేక.. ఎండకు ఎండి వానకు తడిసి.. చలికి వణుకుతూ ఉండే నిరాశ్రయులకు అభయం కరవవుతోంది. పొట్టకూటి కోసం రోజంతా పనిచేసి రాత్రివేళ్లల్లో ఎక్కడో చోట నిద్రించాల్సి వస్తోంది. దుకాణాల ముందు బస్టాండ్లు, రైల్వేస్టేషన్‌ పరిసరాల్లో నిద్రిస్తూ అభద్రతాభావంతో బతకాల్సి వస్తోంది. ఇలాంటి వారికి అండగా ఉండేందుకు ఏర్పాటు చేసిన నిరాశ్రయుల కేంద్రాల నీడ మసకబారుతోంది. గూడు లేని పక్షులపై కనీస కనికరం కానరావడం లేదు.

ఆశ్రయం కోసం అల్లాడుతున్నారు..

Homeless in Winter Hyderabad : ఇది నేటి సమస్య కాదు. దశాబ్దాలుగా ఉన్నదే. దిక్కులేక రోడ్ల పక్క కాలం వెళ్లదీస్తున్న నిరాశ్రయులకు భద్రత కల్పించాలని సుప్రీం కోర్టు ఎప్పుడో ఉత్తర్వులిచ్చింది. తదనుగుణంగా కేంద్రం చట్టాల్నీ తెచ్చింది. వాటి అమలుకే అతీగతీ లేదు. హైదరాబాద్ వంటి మహా నగరాల్లోనూ పరిస్థితి దయనీయం. పైవంతెనలు, వీధులు, మురికివాడలు, రద్దీప్రాంతాలు.. ఇలా ఎక్కడ వీలైతే అక్కడ నిరాశ్రయులు తలదాచుకుంటున్నారు. తిండికి ఎలాగోలా తిప్పలు పడుతున్నా.. ఆశ్రయం కోసం అల్లాడుతున్నారు. విజయవాడ, విశాఖ, వరంగల్‌.. తదితర నగరాల్లో ఇదే దయనీయ దృశ్యం.

5,600 మంది నిరాశ్రయులు..

Homeless Needs Help in Winter : సుప్రీంకోర్టు తీర్పు అనంతరం వచ్చిన నిబంధనల ప్రకారం పట్టణాలు, నగరాల్లో.. ప్రతి లక్ష మంది జనాభాకు.. 1 షెల్టర్ హోం ఉండాలి. నిరాశ్రయులకు అక్కడ వసతినివ్వాలి. ఆ లెక్కన.. కోటి పైబడి జనాభా గల హైదరాబాద్‌లో.. 100 వరకు షెల్టర్‌ హోమ్స్‌ ఉండాలి. ప్రస్తుతం ఉన్నవి.. 21. అందులో 7 ఆస్పత్రుల పరిధిల్లో ఏర్పాటు చేసినవి. మొత్తం 21లో 13 శాశ్వత భవనాల్లో.. 8 తాత్కాలిక వసతుల్లో నడుస్తున్నాయి. వాటిల్లో 935 మందికే గరిష్ఠంగా నీడ కల్పించవచ్చు. ఇదీ సరిగా అమలు కావడం లేదు. హైదరాబాద్‌లో 5 నుంచి 6వేల మంది వరకు నిరాశ్రయులు ఉంటారని అంచనా.

నిలువ నీడలేదు..

Homeless in Winter AP : విశాఖ నగరంలో.. 20లక్షల మంది జనాభాకు 20 వరకు నైట్‌ షెల్టర్లు ఉండాలి. అక్కడ ఉన్నవి 7. విజయవాడ నగరాన్ని తీసుకుంటే ప్రస్తుత జనాభా పదమూడున్నర లక్షల మందికి కనీసం 13 నైట్‌ షెల్టర్లు ఏర్పాటు చేయాలి. కానీ 4 కేంద్రాలు ఉన్నాయి. వాటిల్లో గరిష్ఠంగా 350 మందికి ఆశ్రయం కల్పించవచ్చు. ఆ నాలుగింటిలోనూ ప్రస్తుతం రెండే పని చేస్తున్నాయి. దాంతో విజయవాడలో అనాథలకు నీడేలేకుండా పోయింది. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలకు గూడు లేక రోడ్డ పక్కన ఉన్న పాదాచారులు నడిచే మార్గాలనే వసతులుగా ఏర్పాటు చేసుకొని కాలం వెళ్లదీస్తున్నారు.

సరైన భద్రతా లేదు..

Homeless in Winter India : ఈ అధికారిక లెక్కలకు క్షేత్రస్థాయి పరిస్థితులకు కూడా పొంతన కనిపించదు. ఎందుకంటే ఉన్న షెల్టర్లలోనూ నిర్వహణ లోపాలు, పర్యవేక్షణ లేమి కారణంగా ఉపయోగించుకుంటున్నవారు చాలా తక్కువ మంది. జాతీయస్థాయిలో ఇంతే. ఉదాహరణకు చెన్నైని తీసుకుంటే.. అక్కడి జనాభా అంచనా కోటికి పైనే. అంటే సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు కనీసం 100 షెల్టర్లు ఉండాలి. కానీ ఉన్నవి 55. 2011 జనాభా లెక్కల ప్రకారమైనా చెన్నై జనాభా 86 లక్షలు. ఆ లెక్కన కనీసం 86 ఉండాలి. ప్రస్తుతం ఉన్న షెల్టర్లలోనూ వసతులు అంతంత మాత్రంగానే ఉన్నాయి. అక్కడున్న వారికి సరైన భద్రత కూడా ఉండటం లేదు.

నిర్వహణ అంతంత మాత్రమే..

Homeless Problems in Winter : చాలాచోట్ల.. ఉన్న నైట్‌షెల్టర్లలోనూ మంచాలు, దుప్పట్లు అవసరమైనంత లేవు. తాగునీరు, టాయిలెట్స్‌ నిర్వహణ అంతంత మాత్రమే. ఎవరైనా దాతలు సాయం చేస్తే పరిస్థితి కొంత మెరుగు.. లేకపోతే అంతే. సౌకర్యాల కల్పన పరిశీలించాల్సిన మున్సిపల్ సిబ్బంది, మెప్మా అధికారులు షెల్టర్లను పూర్తిస్థాయిలో పట్టించుకోవడం లేదని విమర్శలున్నాయి. ఇక షెల్టర్ల నిర్వహణకు సంబంధించిన వనరుల కల్పనలో కూడా నిర్వాహకులకు సహకరించకపోవడంతో ఈ ప్రభావం తలదాచుకునే వారిపై పడుతుంది. శాశ్వత భవన నిర్మాణాల సంగతి సరేసరి.

గాడి తప్పిన నిర్వహణ..

Homeless Needs Shelter in Winter : రెండేళ్ల నుంచి నిరాశ్రయుల కేంద్రాల నిర్వహణకు ప్రభుత్వాల నుంచి నిధులు విడుదల సరిగా లేదన్న మాట కూడా ఉంది. ఫలితంగా కొన్నింటి నిర్వహణ గాడి తప్పుతోంది. నిరాశ్రయ కేంద్రాలు తాత్కాలిక భవనాల్లో ఏర్పాటు చేయడంతో వాటి అద్దె, విద్యుత్తు బిల్లులు చెల్లించడంతో పాటు నిరాశ్రయులకు నిత్యం భోజన వసతి కల్పించాల్సి రావడంతో ఆర్థిక భారం పడుతోంది. ఆలనాపాలనా చూసే సిబ్బంది జీతాలు చెల్లించలేని దుస్థితి నెలకొంది. అప్పులు చేసి నిరాశ్రయ కేంద్రాలు నెట్టుకొస్తున్నామని నిర్వాహకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం స్పందించి ప్రతి నెల నిర్వహణ కోసం మంజూరు చేసి నిధులతోపాటు పెండింగ్‌ నిధులు మంజూరు చేయాలని డిమాండ్‌ చేస్తున్నారు.

బస కేంద్రాల్ని పెంచాలి..

Homeless Needs Shelter in Telangana : అవసరం మేరకు.. బస కేంద్రాల్ని పెంచాలంటే ప్రభుత్వాల దగ్గర కచ్చితమైన గణాంకాలు లేవన్నది నిష్ఠూర సత్యం. ఈ పరిస్థితుల్లో.. కొద్దిరోజులుగా విపరీతంగా వీస్తున్న చలిగాలుల మధ్యే అభాగ్యులు ఎందరో రోడ్లపైనే దోమలు, చలికి వణుకుతూ నిద్రిస్తున్నారు. నిరాశ్రయుల్లో వృద్ధులు, చిన్నపిల్లలూ కూడా ఉన్నారు. ఇలాంటి వారిని గుర్తించి, సమీప షెల్టర్‌ హోమ్‌లకు తరలించాల్సిన మున్సిపల్ సి‌బ్బంది చోద్యం చూస్తున్నారు. ఈ క్రమంలో తలరాత బాగోక ఎవరైనా ప్రమాదాల బారిన పడి అనారోగ్యానికి గురైతే వారి పరిస్థితి మరీ దారుణం. అనాథశవాల్లో నిరాశ్రయులే అత్యధికమని వైద్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

వాళ్లంతా యాచకులు కాదు..

మరొక విషయం ఏమిటంటే.. నిరాశ్రయులంటే కేవలం యాచకులనే అపోహ ఉంది. కానీ ఇళ్లు లేని అనేక మంది పొద్దంతా పనిచేసి సాయంత్రం అరుగులపై, రోడ్ల పక్కన చిన్నచిన్న గుడిసెలు వేసుకుని జీవిస్తుంటారు. రిక్షాలు, ఆటోలు నడిపేవారు సైతం ఇల్లు దూర ప్రాంతంలో ఉంటే 2రోజులకు ఓసారి వెళ్లి వస్తుంటారు. అలాంటి వారు సైతం రోడ్డు పక్కనే పడుకుంటుంటారు. వలస కార్మికులు ఎందరో వసతి లేక ఇబ్బంది పడుతున్నారు. వివిధ కారణాలతో కుటుంబాల్ని వదిలి వచ్చిన వారు, డ్రగ్స్‌ వంటి మాదకద్రవ్యాలకు బానిసలైన వారూ రోడ్డుపక్కనే పడుకుని ఉంటారు. అందుకే ఆశ్రయాల నిర్మాణానికి కేంద్రం ముందుకొచ్చి నిధులిస్తోంది.

ఈ నేపథ్యంలోనే.. వివిధ కారణాలతో రహదారులపై జీవించే వారిని స్థానిక మున్సిపల్ సిబ్బంది పట్టించుకోవాలి. ఆశ్రయం కల్పించి, వాళ్లలో పరివర్తన తీసుకురావాలి. తిరిగి కుటుంబ సభ్యులకు అప్పగించాలి. నైపుణ్యాలు నేర్పించి ఉపాధి కల్పించాలి. స్థానిక సంస్థలు క్షేత్రస్థాయిలో సర్వే చేసి.. ప్రభుత్వాలకు వాస్తవాలు చెప్పాలని స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు సూచిస్తున్నారు. అలా గుర్తించిన నిరాశ్రయులందరికీ గుర్తింపుకార్డుల్ని జారీచేసి, ప్రభుత్వపథకాల ప్రయోజనాలు కూడా అందించాల్సి ఉంది.

ఈ పరిస్థితుల్లో ఎక్కడికక్కడ నైట్‌షెల్టర్లను పునరుద్ధరించి నిరాశ్రయులకు ఆశ్రయం కల్పించేందుకు స్వచ్ఛంద సంస్థల సహకారంతో అధికారులు చర్యలు తీసుకోవాలని పలువురు విజ్ఞప్తి చేస్తున్నారు. బ‌స క‌ల్పించ‌డ‌మే కాక.. నిరాశ్రయుల‌ను సాధార‌ణ పౌరుల్లా తీర్చిదిద్దగలిగే సౌక‌ర్యాల‌నూ షెల్టర్‌ హోమ్‌లలో క‌ల్పించాలి. ఎందుకంటే.. రోడ్ల మీద తిరిగే వారిలో వృద్ధులు, విక‌లాంగులు, మ‌హిళ‌లు, యువ‌తీయువ‌కులు, పిల్లలు, మ‌తిస్తిమితం లేని వారు, రోగులు.. ఇలా అనేక ర‌కాల వారు ఉంటారు. అలా గూడు లేక ఇబ్బంది ప‌డే వారికి రోడ్ల ప‌క్కనున్న కాలిబాట‌లు, బ‌స్టాపులు, ఇత‌ర బ‌హిరంగ ప్రాంతాలు ఆశ్రయం కావొద్దంటే.. షెల్టర్ హోం వ్యవస్థను బలోపేతం చేయడం ఒక్కటే మార్గం.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.