ETV Bharat / city

ఏపీ:'చలో గుంటూరు జైలు' నిరసన తీవ్ర ఉద్రిక్తం

author img

By

Published : Nov 1, 2020, 5:48 AM IST

ఏపీలో రాజధాని రైతులకు సంకెళ్లు వేయడాన్ని నిరసిస్తూ నిర్వహించిన 'జైలు భరో' ఉద్రికత్తలకు దారి తీసింది. ముందుగా చెప్పినట్లే గుంటూరు జిల్లా జైలును అమరావతి ఐకాస, రాజధాని పరిరక్షణ సమితి నేతలు ముట్టడించారు. పోలీసుల ఆంక్షలు, చెక్ పోస్టులు వారిని అడ్డుకోలేకపోయాయి. జైలు లోపలకు వెళ్లేందుకు యత్నించిన రైతు ఐకాస నేతలు, రాజకీయ పక్ష నేతలను పోలీసులు అరెస్టు చేశారు. జైలు వద్ద వాతావరణం రణరంగాన్ని తలపించింది.

high-tensions-at-guntur-jail-jail-bharo-was-intercepted-by-police
ఏపీ:'చలో గుంటూరు జైలు' నిరసన తీవ్ర ఉద్రిక్తం

ఏపీ:'చలో గుంటూరు జైలు' నిరసన తీవ్ర ఉద్రిక్తం

ఆంధ్రప్రదేశ్​ గుంటూరులోని జిల్లా జైలు వద్ద శనివారం ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అమరావతి ప్రాంతంలోని దళిత రైతులపై కేసులు పెట్టడం, బేడీలు వేసి జైలుకు తీసుకురావటాన్ని నిరసిస్తూ అమరావతి ఐకాస 'జైలు భరో' నిర్వహించింది. తెలుగుదేశం, సీపీఐతో పాటు పలు ప్రజాసంఘాలు ఈ కార్యక్రమానికి మద్దతు తెలిపాయి. ఆరేళ్ల చిన్నారి నుంచి అరవై ఏళ్ల వృద్ధురాలి వరకూ ఆందోళనలో పాల్గొని 'జై అమరావతి' అంటూ నినదించారు. పోలీసుల ఆంక్షలను దాటుకుని ఐకాస నేతలు జైలును ముట్టడించారు. రైతు ఐకాస నేత పువ్వాడ సుధాకర్, రాజకీయేతర ఐకాస నేతలు మల్లిఖార్జున, మహిళా ఐకాస నేత శైలజ, ఏపీ పరిరక్షణ సమితి కన్వీనర్ ప్రొఫెసర్ శ్రీనివాస్, కాంగ్రెస్ నేత సుంకర పద్మశ్రీ, సీపీఐ సహాయ కార్యదర్శి ముప్పాళ్ల నాగేశ్వరరావు జైలు వద్ద ఆందోళనకు దిగారు. మహిళలు రోడ్డుపై బైఠాయించారు. జై అమరావతి నినాదాలతో హోరెత్తించారు.

పోలీసుల వలయాన్ని ఛేదించి...

'జైలు భరో'ను అడ్డుకోవడానికి గుంటూరు జిల్లాలోని ఐకాస నేతలు, రాజకీయ పార్టీల వారిని ఎక్కడికక్కడ గృహ నిర్బంధం చేశారు పోలీసులు. నాయకుల ఇళ్ల ముందు సిబ్బందిని మోహరించారు. రాజధాని గ్రామాల్లో భారీగా బలగాలను దించారు. అక్కడినుంచి గుంటూరు వెళ్లే మార్గంలో 10 చోట్ల చెక్​పోస్టులు ఏర్పాటు చేశారు. జిల్లా జైలుకు ఎవరినీ వెళ్లనీయకుండా అన్ని రకాల ప్రయత్నాలు చేశారు. మరోవైపు గుంటూరు జిల్లా జైలు వద్ద వందలాది మంది పోలీసులు వలయంగా ఏర్పడ్డారు. పోలీసులు అన్ని రకాల చర్యలు తీసుకున్నా ఆందోళనకారులు జైలు వద్దకు చేరుకున్నారు. ఒకరిద్దరితో మొదలైన ముట్టడి కార్యక్రమం వందలాది మంది వరకూ వెళ్లింది. రైతులు, మహిళలు, రాజకీయ పక్షాల నేతలు విడతల వారీగా జైలు వైపు దూసుకువచ్చారు. ప్రధాన రహదారి నుంచి జైలు లోపలకు వెళ్లనీయకుండావారిని పోలీసులు నిలువరించారు. బలవంతంగా అరెస్టు చేశారు.

ఈడ్చుకుంటూ వెళ్లి..

రైతు ఐకాస కన్వీనర్ సుధాకర్​ను అరెస్టు చేసేందుకు పోలీసులు యత్నించగా మహిళలు రక్షణ వలయంగా ఏర్పడ్డారు. ముందుగా పోలీసులు ఆందోళనకారులను వాహనాల్లోకి ఎక్కించాలని చూసినా సాధ్యం కాలేదు. మహిళా పోలీసులు బలవంతంగా వారిని వాహనాల్లో ఎక్కించారు. ఈ క్రమంలో తీవ్ర పెనుగులాటలు జరిగాయి. కొందరు మహిళలకు గాయాలయ్యాయి. మహిళా ఐకాస నేత శైలజను ఈడ్చుకుంటూ వెళ్లారు. పోలీసుల చర్యలను ఐకాస నేతలు, రైతులు ఖండించారు. ఉద్యమాన్ని అరెస్టులతో అడ్డుకోలేరని స్పష్టం చేశారు.

వందల మంది అరెస్టు

ఐకాస నేతలు, రాజకీయ పార్టీల వారందరినీ కలిపి సుమారు 200మందిని పోలీసులు అరెస్టు చేశారు. వారిని ముందుగా అరండల్​పేట స్టేషన్​కు తరలించారు. అక్కడ స్థలం తక్కువగా ఉండటంతో నల్లపాడు, తాడికొండ పోలీస్ స్టేషన్లకు తీసుకెళ్లారు. జైలు వద్ద ఆందోళన దృష్ట్యా అరండల్ పేట మార్గంలో వాహనాల రాకపోకలు కూడా అరగంటకు పైగా నిలిపివేశారు. అరెస్టుల తర్వాత రాకపోకలు పునరుద్ధరించారు.

భగ్నం చేశాం

మరోవైపు 'జైల్ భరో' కార్యక్రమాన్ని భగ్నం చేసినట్లు గుంటూరు అర్బన్ ఎస్పీ అమ్మిరెడ్డి ప్రకటించారు. ఆందోళనల నేపథ్యంలో ఆయన జైలు వద్దే ఉండి ఉద్రిక్తతలు సద్దుమణిగే వరకూ పరిస్థితిని సమీక్షించారు. ప్రజా జీవనానికి అటంకం కలిగించినందుకు ఆందోళనకారులను అరెస్టు చేసినట్లు తెలిపారు. 150 మందిని అరెస్టు చేశామని... వారిలో కొందరు మహిళలు కూడా ఉన్నట్లు తెలిపారు. అరెస్టయిన వారిపై కేసు నమోదు చేసి తదుపరి చర్యలు తీసుకుంటామని వివరించారు.

ఇవీ చూడండి: గురుకులాల్లో ఐదో తరగతి ప్రవేశాలకు నేడు ప్రవేశ పరీక్ష

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.