ETV Bharat / city

Narayana: 'తెలుగు రాష్ట్రాల సీఎంలు భవిష్యత్ తరాలకు ఏం జవాబు చెప్తారు'

author img

By

Published : Jul 15, 2021, 7:06 PM IST

తెలుగు రాష్ట్రాల సీఎంలపై సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ విమర్శలు గుప్పించారు. ప్రభుత్వ భూముల వేలం మానుకోవాలని హితవు పలికారు. భవిష్యత్తు తరాలకు ఏం సమాధానం చెబుతారని ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులను నిలదీశారు.

CPI National Secretary Narayana
నారాయణ

ప్రభుత్వ భూముల వేలం దుర్మార్గామైందని.. భవిష్యత్తు తరాలకు ఏం సమాధానం చెబుతారని తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులను సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ ప్రశ్నించారు. తక్షణమే భూముల వేలం ప్రక్రియకు స్వస్తి చెప్పాలని డిమాండ్‌ చేశారు.

తెలుగు రాష్ట్రాల్లో చాలా ప్రభుత్వ కార్యాలయాలు... ప్రైవేట్‌ భవనాల్లో నడుపుతున్నారని ఆ స్థానంలో సర్కార్ ఆఫీసులు నిర్మిస్తే ప్రభుత్వానికి ప్రజలకు ఉపయోగకరంగా ఉంటుందని హితవు పలికారు. పట్టణ ప్రాంతాల్లోని ప్రభుత్వ భూములను వేలం వేస్తే అవి పెద్ద పెద్ద కార్పొరేట్‌ సంస్థలు, పారిశ్రామిక వేత్తల వశమవుతాయని ఆవేదన వ్యక్తం చేశారు.

బ్రిటీష్ వాళ్లు పెట్టిన దేశద్రోహం చట్టాన్ని ఇప్పటి వరకు కొనసాగడం సిగ్గు చేటని నారాయణ అన్నారు. రాజకీయ కక్షలతో ప్రత్యర్థులపైన దేశ ద్రోహం కేసులు పెడుతున్నారని మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వం వెంటనే ఈ చట్టాన్ని రద్దు చేసేందుకు చొరవ తీసుకోవాలని డిమాండ్ చేశారు.

దరిద్రపు రైతుకు విత్తనాలను ఇస్తే... దంచుకుని తిన్నట్లుగా రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కేసీఆర్, జగన్... ప్రభుత్వ భూములు అమ్మేసుకుంటున్నారు. భూములు పెరగవు. జనాలు పెరుగుతారు. రేపు భవిష్యత్​లో జనాలు పెరిగితే వారి అవసరాలకు భూములు సరిపోకుంటే అపుడు ఏం చేస్తారు. వీరేమైనా శాశ్వత ముఖ్యమంత్రులు అనుకుంటున్నారా? జనాలు పెరగకుండా కుటుంబ నియంత్రణ ఏమైనా చేస్తారా? ప్రభుత్వ కార్యాలయాలు ప్రైవేటు భవనాల్లో ఉన్నాయి. అలాంటపుడు ప్రభుత్వ భూములు అమ్ముకోవడం ఎందుకు? తక్షణమే ప్రభుత్వ భూముల వేలానికి స్వస్తి పలకాలని డిమాండ్ చేస్తున్నా.

--నారాయణ, సీపీఐ జాతీయ కార్యదర్శి

Narayana: 'తెలుగు రాష్ట్రాల సీఎంలు భవిష్యత్ తరాలకు ఏం జవాబు చెప్తారు'

ఇదీ చూడండి: Revanth: 'రేపు చలో రాజ్‌భవన్... అడ్డుకుంటే పోలీస్​స్టేషన్లనూ ముట్టడిస్తాం'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.