ETV Bharat / city

CM KCR Letter to PM: ఎంత కొంటారో చెప్పండి.. ప్రధానికి కేసీఆర్‌ లేఖ

author img

By

Published : Nov 17, 2021, 4:27 PM IST

Updated : Nov 17, 2021, 10:14 PM IST

cm kcr letter to pm
cm kcr letter to pm

16:25 November 17

ప్రధాని మోదీకి సీఎం కేసీఆర్‌ లేఖ

పంజాబ్ తరహాలో రాష్ట్రంలో వానాకాలంలో పండిన వరి ధాన్యాన్ని 90 శాతం భారత ఆహార సంస్థ కొనుగోళ్లు చేసేలా చూడాలని, యాసంగిలో తెలంగాణలో కేంద్రం ఎంత వరిధాన్యం కొంటుందో ముందుగానే నిర్ధరించాలని ప్రధానమంత్రి నరేంద్రమోదీని ముఖ్యమంత్రి కేసీఆర్ కోరారు. ఈ మేరకు ప్రధానికి లేఖ రాశారు. రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి వ్యవసాయరంగంలో తెలంగాణ అద్భుతమైన అభివృద్ధిని సాధించిందని, వినూత్న విధానాలతో తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ పథకాల వల్లే ఇది సాధ్యమైందని కేసీఆర్ పేర్కొన్నారు. 24 గంటల నాణ్యమైన ఉచిత విద్యుత్, ఏడాదికి ఎకరానికి పది వేల రూపాయల పంట పెట్టుబడి ప్రోత్సాహకాన్ని రాష్ట్ర ప్రభుత్వం అందిస్తోందన్న సీఎం... కష్టజీవి అయిన తెలంగాణ రైతు, రాష్ట్ర ప్రభుత్వ ప్రోత్సాహకాలను అందిపుచ్చుకుంటూ గుణాత్మకంగా దిగుబడి సాధిస్తున్నాడని పేర్కొన్నారు. తద్వారా తెలంగాణ రైతు దేశ ప్రగతికి దోహదం చేస్తున్నాడని లేఖలో ప్రస్తావించారు.  

ప్రగతి ప్రస్థానం తెలంగాణకు తెలియనిది కాదు..

తెలంగాణ ఏర్పాటుకు ముందు, ఎక్కడ చూసినా కరవు కాటకమే తాండవించేందని.. ఇప్పుడు రాష్ట్రంలో గణనీయంగా పెరిగిన  సాగునీటి లభ్యతతో మిగులు రాష్ట్రంగా తెలంగాణ నిలిచిందని ముఖ్యమంత్రి వివరించారు. తెలంగాణ రైతు నేడు... దేశానికే అన్నపూర్ణగా ఎదిగిన ప్రగతి ప్రస్థానం గురించి ప్రధానికి తెలియనిది కాదన్నారు. ప్రజాపంపిణీ వ్యవస్థ ద్వారా ఆహార ధాన్యాలు పంపిణీ చేస్తూ... దేశ ప్రజలకు  ఆహార భద్రతను కల్పించే బాధ్యతను నెరవేర్చాల్సిన భారత ఆహార సంస్థ -  ఎఫీసీఐ అసంబద్ధ విధానాలను అవలంబిస్తూ, అటు రైతులను ఇటు రాష్ట్ర ప్రభుత్వాలను అయోమయానికి గురిచేస్తోందని సీఎం కేసీఆర్ లేఖలో పేర్కొన్నారు.  

ఎఫ్​సీఐ అయోమయ విధానాలతో..

ఏడాదికి సరిపడా ధాన్యం సేకరణ లక్ష్యాలను ఒకేసారి నిర్ధరించడం లేదని, ఏటా ధాన్యం దిగుబడి పెరుగుతున్నప్పటికీ వేగవంతంగా సేకరించడం లేదన్నారు. ఎఫ్​సీఐ అయోమయ విధానాలతో సరైన పంటల విధానాన్ని రైతులకు వివరించేందుకు రాష్ట్రాలకు ప్రతిబంధకంగా మారిందని కేసీఆర్ తెలిపారు. 2021 వానాకాలం సీజన్​లో తెలంగాణలోని 55.75 లక్షల మెట్రిక్ టన్నుల వరిధాన్యంలో  కేవలం 32.66 లక్షల మెట్రిక్ టన్నులను మాత్రమే సేకరించిందని తెలిపారు. అంటే పండిన పంటలో కేవలం 59 శాతం ధాన్యాన్ని మాత్రమే సేకరించిందని ప్రధాని దృష్టికి తీసుకెళ్లారు. 2019 -20 వానాకాలంలో సేకరించిన ధాన్యం కంటే 78 శాతం తక్కువగా సేకరించిందన్న సీఎం... దీంతో రాష్ట్ర ప్రభుత్వాలకు తీవ్ర ఇబ్బందులు కలుగుతున్నాయని వివరించారు.  

స్వయంగా వెళ్లి కలిసినా..

ఇటువంటి అయోమయ పరిస్థితులను తొలగించి ధాన్యం సేకరణలో స్పష్టమైన లక్ష్యాన్ని నిర్దారించాలని కేంద్ర ఆహార, పౌరసరఫరాల శాఖ మంత్రి  పీయూష్​గోయల్​ను స్వయంగా వెళ్లి కలిశానని లేఖలో సీఎం పేర్కొన్నారు. వార్షిక ధాన్య సేకరణ లక్ష్యాన్ని తక్షణమే నిర్దారించాలని విజ్జప్తి చేసి 50 రోజులు దాటినా ఎటువంటి సమాచారం లేదని, ఇంతవరకు ఎటువంటి విధాన నిర్ణయాన్ని తీసుకోలేదని ముఖ్యమంత్రి ఆక్షేపించారు. వీటన్నింటి నేపథ్యంలో ధాన్యం సేకరణకు సంబంధించి ఎఫ్​సీఐకి స్పష్టమైన ఆదేశాలు జారీ చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు.  

ఎఫ్​సీఐ 2020-21 యాసింగి సీజన్లో సేకరించని 5 లక్షల మెట్రిక్ టన్నుల వరిధాన్యాన్ని తక్షణమే సేకరించేలా చూడాలని కోరారు. 2021-22 వానాకాలంలో 40 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని  సేకరిస్తామన్న నిబంధనను సడలించి పంజాబ్ తరహాలో తెలంగాణలో కూడా ఈ వానాకాలం  పండిన పంటలో 90 శాతం వరి ధాన్యాన్ని సేకరించాలని విజ్ఞప్తి చేశారు. వచ్చే యాసంగిలో తెలంగాణలో కేంద్రం ఎంత వరిధాన్యం కొంటుందో ముందుగానే నిర్దారించాలని సీఎం కేసీఆర్ కోరారు. మూడు అంశాలకు సంబంధించి సత్వరమే చర్యలు తీసుకోవాలని ప్రధానమంత్రి నరేంద్రమోదీని ముఖ్యమంత్రి కేసీఆర్  విజ్జప్తి చేశారు. లేఖ ప్రతిని కేంద్ర ఆహార, పౌరసరఫరాల శాఖ మంత్రి పీయూష్ గోయల్​కు కూడా పంపారు. 

కేంద్రంపై ఫైర్​..

ధాన్యం కొనుగోళ్లు, వరి సాగు వ్యవహారంపై కేంద్రం తీరుపై నిన్నటి టీఆర్​ఎస్​ఎల్పీ సమావేశం సందర్భంగా ఆగ్రహం వ్యక్తం చేసిన సీఎం కేసీఆర్.. ​రేపు మహాధర్నా నిర్వహించనున్నట్లు తెలిపారు. రాష్ట్రమంత్రివర్గం సహా ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జడ్పీ ఛైర్మన్లు, మార్కెట్​ కమిటీ ఛైర్మన్లు.. హైదరాబాద్​లోని ఇందిరాపార్కు వద్ద ధర్నా నిర్వహించనున్నట్లు తెలిపారు. ఉదయం 11 గంటల నుంచి మధ్నాహ్నం 2 గంటల వరకు ధర్నా చేస్తామన్నారు. ఈనెల 20వ తేదీ వరకు కేంద్రం స్పందన కోసం ఎదురు చూస్తామని.. వారి నుంచి ఉలుకు పలుకు లేకుంటే రాష్ట్ర ప్రభుత్వం తరఫున రైతులకు స్పష్టమైన వైఖరి వెల్లడిస్తామని చెప్పారు. అన్ని వేదికలపైనా కేంద్రం తీరును నిలదీస్తామని సీఎం కేసీఆర్​ వెల్లడించారు.  

ఈ సందర్భంగా భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్​ తీరుపైనా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన కేసీఆర్​.. కొనుగోళ్ల కేంద్రాలకు వెళ్లాల్సిన అవసరం ఏమొచ్చిందని నిలదీశారు. రైతులపై భాజపా నేతలు దాడి చేస్తున్నారని ఆరోపించారు. రైతులు వరి సాగు చేయాలంటూ బండి సంజయ్​ చేసిన వ్యాఖ్యలపై స్పష్టత ఇవ్వాలని డిమాండ్​ చేశారు. 

ఇవీచూడండి: 

Last Updated :Nov 17, 2021, 10:14 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.