ETV Bharat / city

'పోతిరెడ్డిపాడును అంగీకరించం.. రాయలసీమ లిఫ్టు ఇరిగేషన్ అక్రమ ప్రాజెక్టే'

author img

By

Published : Jul 3, 2021, 6:48 PM IST

Updated : Jul 3, 2021, 10:41 PM IST

Chief Minister KCR review on irrigation department
Chief Minister KCR review on irrigation department

18:46 July 03

'పోతిరెడ్డిపాడును అంగీకరించం.. రాయలసీమ లిఫ్టు ఇరిగేషన్ అక్రమ ప్రాజెక్టే'

కృష్ణా జలాల విషయంలో ఏపీ వైఖరిని సీఎం కేసీఆర్‌ తప్పుపట్టారు. నీటి కేటాయింపులు లేకుండానే ఏపీ ప్రాజెక్టులు కడుతోందని ఆరోపించారు. పర్యావరణ అనుమతులు లేకుండానే ప్రాజెక్టులు నిర్మిస్తోందని అన్నారు. ఎన్జీటీ స్టే విధించినప్పటికీ అక్రమంగా నిర్మిస్తోందని తెలిపారు. ఏపీతో కృష్ణా జలాల వివాదం నేపథ్యంలో నీటిపారుదలపై సీఎం కేసీఆర్​ సమీక్ష నిర్వహించారు. నీటిపారుదల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, ఈఎన్సీ, ఇంజినీర్లతో ముఖ్యమంత్రి కేసీఆర్ సమావేశమయ్యారు.  

ఏపీ చేపట్టిన పోతిరెడ్డిపాడు చట్టవ్యతిరేక ప్రాజెక్ట్​ అని సీఎం కేసీఆర్‌ పేర్కొన్నారు. పోతిరెడ్డిపాడు ప్రాజెక్టును ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించమని చెప్పారు. రాయలసీమ లిఫ్టు ఇరిగేషన్ కూడా అక్రమ ప్రాజెక్టే అని కేసీఆర్‌ వెల్లడించారు. జులై 9న నిర్వహించబోయే కేఆర్ఎంబీ సమావేశాన్ని రద్దు చేయాలని... జులై 20 తర్వాత పూర్తిస్తాయి బోర్డు సమావేశం ఏర్పాటు చేయాలి కోరారు. తెలంగాణ అంశాలను కూడా ఎజెండాలో చేర్చాలని అన్నారు. ఎజెండాను కృష్ణానది యాజమాన్య బోర్డుకు పంపాలని అధికారులకు సూచించారు.  

ఆ హక్కు కేఆర్ఎంబీకి లేదు

ఏపీ-తెలంగాణ మధ్య ఉన్న 66:34 నిష్పత్తిని తొలగించాలని సీఎం డిమాండ్​ చేశారు. ఈ ఏడాది నుంచి 50:50 నిష్పత్తిలో నీటి పంపకాలు జరగాలన్నారు. ఇరురాష్ట్రాలకు మొత్తం 811 టీఎంసీల నికర జలాలు కేటాయింపు జరిపారని.. తెలంగాణ, ఆంధ్ర చెరో 405.5 టీఎంసీలు వాడుకోవాలని సూచించారు. జూరాల, శ్రీశైలం, నాగార్జున సాగర్, పులిచింతల ప్రాజెక్టుల నుంచి నీటి లభ్యత ఉన్నంతకాలం పూర్తిస్థాయిలో విద్యుత్ ఉత్పత్తి సాగాలని చెప్పారు. విద్యుత్ ఉత్పత్తిని ఆపమని చెప్పే హక్కు కేఆర్ఎంబీకి లేదని సీఎం స్పష్టం చేశారు. జల విద్యుత్‌పై ఇరు రాష్ట్రాల నడుమ ఎలాంటి ఒప్పందాలు లేవని, విద్యుత్ ఉత్పత్తిపై కేఆర్ఎంబీ జోక్యం చేసుకునే ప్రశ్నే ఉత్పన్నం కాదన్నారు. కృష్ణా జలాలను వృథా చేస్తున్నామనే ఏపీ దుష్ప్రచారాన్ని తిప్పికొట్టాలన్నారు. పులిచింతల నుంచి విడుదలైన నీటిని ఏపీ ప్రభుత్వం వాడుకోవచ్చని పేర్కొన్నారు. 

నీటిని చెరువులకు వదలాలి

థర్మల్ విద్యుత్ ఉత్పత్తి వల్ల వాతావరణ కాలుష్యం పెరుగుతోందన్నారు.  51శాతం 'క్లీన్ ఎనర్జీ'ని ఉత్పత్తి చేయాలని కేంద్రమే చెప్తోందని కేసీఆర్​ గుర్తు చేశారు. శ్రీశైలం ప్రాజెక్టు విద్యుత్ ఉత్పత్తికి మాత్రమే ప్రత్యేకమైనదని తెలిపారు. తెలంగాణకు హక్కుగా కేటాయించిన నీటితోనే విద్యుత్‌ ఉత్పత్తి చేస్తున్నట్లు తేల్చి చెప్పారు. జూరాల కుడి, ఎడమ కాల్వల ద్వారా నీటిని చెరువులకు వదలాలని అధికారులకు సూచించారు. శ్రీశైలం సహా కృష్టా ప్రాజెక్టుల వద్ద పూర్తిస్థాయి రక్షణ చర్యలు తీసుకోవాలని పోలీసులను ఆదేశించారు. 

నీటివాటా ఎన్నడు నిర్ణయిస్తారు

సమైక్య పాలకులు తెలంగాణ ప్రాంత ప్రాజెక్టులకు ప్రాధాన్యత ఇవ్వలేదని సీఎం అన్నారు. సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణమే తెరాస తొలి ప్రాధాన్యతగా తీసుకుందని తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్టుతో తెలంగాణ సాగునీటి గోస తీరిందని చెప్పారు. భవిష్యత్‌లో కృష్ణా, గోదావరిపై మరిన్ని ప్రాజెక్టులు నిర్మిస్తామని సీఎం స్పష్టం చేశారు. బచావత్ ట్రిబ్యునల్ ఏర్పాటై 17 ఏళ్లు అవుతోందని, ఇప్పటికీ కృష్ణా జలాల్లో తెలంగాణ నీటివాటా నిర్ధరించలేదన్నారు. బేసిన్ అవసరాలు తీరాకే ఇతర ప్రాంతాలకు నీరు అనేది సహజ న్యాయమని పేర్కొన్నారు. రాష్ట్రంలో ఎత్తిపోతల పథకాల వల్ల జలవిద్యుత్ అవసరం పెరిగిందని, జల విద్యుత్‌తో లిఫ్టులు నడిపి సాగునీరు ఎత్తిపోసుకుంటున్నామన్నారు. 

ఇదీ చూడండి: KRISHNA BOARD: జలజగడం తీవ్రం... రంగంలోకి కృష్ణా యాజమాన్య బోర్డు

Last Updated :Jul 3, 2021, 10:41 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.