ETV Bharat / city

అఖిలపక్ష నేతల భేటీ.. ఉద్యమ కార్యాచరణపై చర్చ

author img

By

Published : Jan 24, 2021, 2:18 PM IST

Updated : Jan 24, 2021, 5:12 PM IST

హైదరాబాద్​లో అఖిలపక్ష నేతలు భేటీ అయ్యారు. సాగుచట్టాలకు వ్యతిరేకంగా చేపట్టాల్సిన ఉద్యమ కార్యాచరణపై చర్చించారు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా ట్రాక్టర్ ర్యాలీ నిర్వహించాలని నిర్ణయించారు.

అఖిలపక్ష నేతల భేటీ.. ఉద్యమ కార్యాచరణపై చర్చ
అఖిలపక్ష నేతల భేటీ.. ఉద్యమ కార్యాచరణపై చర్చ

దేశ రాజధానిలో రైతులు చేస్తున్న ఆందోళన బతుకుదెరువు పోరాటమని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి పేర్కొన్నారు. కేంద్రం ప్రవేశపెట్టిన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని విద్యుత్ సవరణ బిల్లును, ఉపసంహరించాలని ఈ నెల 26న దిలీల్లో రైతు సంఘాలు ఇచ్చిన ట్రాక్టర్ ర్యాలీ పిలుపునకు మద్దతుగా... హైదరాబాద్ బాగ్​లింగంపల్లిలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో అఖిలపక్ష సమావేశం నిర్వహించారు. సీఎం కేసీఆర్​ దిల్లీ వెళ్లి వచ్చాక వ్యవసాయ బిల్లులపై యూ టర్న్ తీసుకున్నారని ఎద్దేవా చేశారు. వెంటనే అసెంబ్లీ సమావేశాలు ఏర్పాటు చేసి వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా తీర్మాణం చేయాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డి డిమాండ్ చేశారు. రైతుల ఆందోళన యాత్రలో తెలంగాణ ప్రభుత్వం పాల్గొనాలన్నారు.

స్వాతంత్ర్య పోరాటం తరువాత జరుగుతున్న అతిగొప్ప పోరాటం రైతులదని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. దిల్లీ కేంద్రంగా దాదాపుగా రెండు నెలలుగా రైతుల ఆందోళనలు జరుగుతున్నా... కేంద్రం శాశ్వత పరిష్కారం చూపకపోవడం విచారకరమని ఆవేదన వ్యక్తం చేశారు. దాదాపుగా 5వందల మంది రైతులు మరణించారని పేర్కొన్నారు. జనవరి 26న రైతుల ర్యాలీకి మద్దతుగా హైదరాబాద్​లో వాహనాల ర్యాలీ ఉంటుందని స్పష్టం చేశారు. అన్ని జిల్లా కేంద్రాల్లోనూ ర్యాలీలు నిర్వహించాలని నిర్ణయించినట్టు తెలిపారు. వచ్చే సంవత్సరం నుంచి రాష్ట్రంలో కొనుగోలు కేంద్రాలు ఉండవనడం సరైంది కాదన్నారు. సీఎం కేసీఆర్ తన వైఖరి మార్చుకోవాలన్నారు.

రాష్ట్రంలో పోడు భూముల సమస్యలు వెంటనే పరిష్కరించాలని, ఫార్మా సిటీకి కేటాయించే భూముల ఆలోచన ప్రభుత్వం విరమిచుకోవాలని డిమాండ్ చేశారు. వ్యవసాయ చట్టాలపై కేంద్ర మంత్రులు బాధ్యతారహితంగా వ్యవహరిస్తున్నారన్నారు. రబీ పంట కొనుగోలు బాధ్యత రాష్ట్ర ప్రభుత్వమే తీసుకోవాలని కాంగ్రెస్ నాయకుడు కోదండరెడ్డి అన్నారు. కార్పొరేట్ శక్తుల ప్రయోజనాల కోసమే కేంద్రం ప్రాధాన్యత ఇస్తోందని తెజస అధ్యక్షుడు కోదండ రాం ఆరోపించారు. జనవరి 26న రైతులకు మద్దతుగా ప్రజలందరు పాల్గొని విజయవంతం చేయాలని ఆయన కోరారు.

అఖిలపక్ష నేతల భేటీ.. ఉద్యమ కార్యాచరణపై చర్చ

ఇవీచూడండి: వ్యవసాయ, మార్కెటింగ్ శాఖలపై సీఎం కేసీఆర్‌ సమీక్ష

Last Updated : Jan 24, 2021, 5:12 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.