ETV Bharat / city

'నవ్వుల టానిక్'..ఆ డాక్టర్​ దగ్గరికి వెళితే ఎవరైనా నవ్వాల్సిందే!

author img

By

Published : Aug 8, 2021, 5:16 PM IST

abba-tv-youtube-channel
'నవ్వుల టానిక్'తో.. అనారోగ్య సమస్యలకు చెక్ పెడుతున్న డాక్టర్..!

అబ్బా...! ఇది ఓ యూట్యూబ్ ఛానల్ పేరు. పేరుకు తగ్గట్టే నవ్వులు పూయించే సున్నితమైన కామెడీ వీడియోలు ఈ ఛానల్ లో ఉంటాయి. నటనపై ఉన్న మక్కువతో.. చిన్నారుల డాక్టర్ చేస్తున్న ఈ ప్రయత్నం.. సత్ఫలితాన్నిస్తోంది. వైద్యాన్ని ఇలా కూడా చేయవచ్చని నిరూపిస్తోంది. ఇంతకీ.. ఈ కామెడీ ట్రీట్ మెంట్ ఇచ్చే డాక్టర్ ఎవరు? ఎక్కడివారు? చిన్నారులను ఎలా ట్రీట్ చేస్తున్నారు? ఆ విశేషాలు మనమూ తెలుసుకుందాం.

ఏపీలోని అనంతపురం జిల్లాలో మంచి పిల్లల శస్త్రచికిత్స నిపుణులు ఎవరని అడిగితే ఆ జిల్లా ప్రజలు డాక్టర్‌ హరిప్రసాద్‌ పేరు చెబుతారు. హ్యాపీస్టార్‌ హరి అంటే తెలుగు రాష్ట్రాల్లో చాలా మంది ఇట్టే చెప్పేస్తారు. హాస్య వీడియోలతో ఎంతో మందికి దగ్గరైన డాక్టర్‌ హరిప్రసాద్‌ తన వైద్యంతో ఎంతోమంది చిన్నారులకు ప్రాణం పోశారు. మంచి విషయం చెబితే ప్రజలెవరూ వినరనే ఉద్దేశంతోనే తొలుత హాస్యంతో అందరికీ దగ్గరై వాటి ద్వారా ప్రజలకు ప్రయోజనకర విషయాలు అందిస్తున్నారు.

రామచంద్ర మిషన్‌లోని తన గురువు చేసిన మార్గదర్శనంతో 2015లో ధ్యానకేంద్రం ఏర్పాటు చేసిన హరిప్రసాద్‌.. తొలుత యోగా, ధ్యానం గొప్పతనం చెబితే సామాజిక మాధ్యమాల్లో ఎవరూ వినేవారు కాదని చెప్పారు. వారిలో ఆనందాన్ని నింపేందుకు హాస్యాన్ని మార్గంగా ఎంచుకున్నారు. 2017 నుంచి తక్కువ నిడివితో వీడియోలు చేస్తూ వచ్చిన ఆయన ఏటికేడు రెట్టింపు ఉత్సాహంతో ముందుకెళ్లారు. మిత్రుల సహకారంతో అబ్బా ఛానెల్‌ను ప్రారంభించిన ఆయన ఆదరణ పెరిగాక అనంతపురం యాక్టర్ల సంఘం ఏర్పాటు చేశారు. దానికి అయాసం అని నవ్వు ధ్వనించే పేరు పెట్టి స్థానిక నటీనటులకు మరింత దగ్గరయ్యారు.

దాదాపు 950 వరకూ వీడియోలు అప్‌లోడ్‌ చేస్తే వీటిలో 400 దాకా విశేష ప్రజాదరణ పొందాయి. టాలెంట్‌ ఉన్నా అందంగా లేమనే ఆత్మన్యూనతా భావనతో ఉన్న ఎంతో మంది ఆర్టిస్టులకు.. అబ్బా ఛానెల్‌ ఓ వరంలా మారుతోంది. ముఖ్యంగా కరోనా సమయంలో మానసిక ఒత్తిడి ఎదుర్కొన్న ఎంతోమందికి హరిప్రసాద్‌ వీడియోలు ఓ టానిక్‌లా ఉపయోగపడ్డాయి. సామాజిక బాధ్యతగా కరోనాపై అవగాహన కల్పిస్తూ ఎన్నో వీడియోలు చేశారు. నిత్యం ప్రజలు ఎదుర్కొనే అనేక సమస్యలకు నవ్విస్తూనే పరిష్కారం అందించారు. ఎవరికీ అర్థం కాని హ్యాండ్‌ రైటింగ్‌తో మందులచీటీ రాసే హరిప్రసాదే అందరికీ అర్థమయ్యేలా స్క్రిప్టులు రాసి ఆకట్టుకున్నారు.

ఇప్పటికే 26 మంది సభ్యులతో ఉన్న అనంతపురం యాక్టర్ల సంఘంలో అనేక మంది చేరేందుకు ఆసక్తి చూపుతున్నారు. హరిప్రసాద్‌ తమ జీవితాల్లోకి రావటం ఒక మలుపు అయిందని నటీనటులు చెప్పారు. సినీపరిశ్రమకు చెందిన ఎంతోమంది ఫోన్‌ చేసి అవకాశాలు ఇస్తున్నామని చెబుతున్నా.. చిన్నారుల ప్రాణాలు కాపాడే వైద్యవృత్తిని విడిచిపెట్టబోనని హరిప్రసాద్‌ చెబుతున్నారు.

ఇదీ చూడండి: మనిషి దంతాలు, గొర్రె తలతో వింత చేప..!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.