ETV Bharat / business

స్టాక్​మార్కెట్​ పెట్టుబడులను సమీక్షించాల్సిన టైమ్ ఇదే.. ఈ జాగ్రత్తలు తీసుకుంటే సేఫ్​!

author img

By

Published : Jul 15, 2023, 5:34 PM IST

Investment Portfolio Review : దేశీయ స్టాక్​ మార్కెట్​ సూచీలు జీవనకాల గరిష్ఠాలను చేరుకున్నాయి. ఇలాంటి తరుణంలో స్టాక్​ మార్కెట్​ పెట్టుబడులపై ఓ సారి సమీక్ష చేసుకోవడం ఎంతైనా ఉత్తమం. ముఖ్యంగా దీర్ఘకాల లక్ష్యాల సాధన కోసం మదుపు చేస్తున్నవారు.. దీనిపై తప్పకుండా దృష్టి సారించాలి. ఒక ఇన్వెస్టర్​గా మీరు తీసుకోవాల్సిన కొన్ని ముఖ్యమైన జాగ్రత్తలు ఏమిటో ఇప్పుడు చూద్దాం.

Investment Portfolio Review
stock market investment review

Stock Market Investment Review : ప్రతి ఒక్కరూ తమ ఆర్థిక లక్ష్యాలను సాధించేందుకు పొదుపు లేదా మదుపు చేస్తారు. పిల్లల చదువులు, సొంత ఇళ్లు, సొంత వాహనం కొనుగోలు, పదవీ విరమణ ప్రణాళిక ఇలా లక్ష్యం ఏదైనా కావచ్చు. నేటి కాలంలో ఈ లక్ష్యాలను సాధించాలంటే.. అందుకు అనువైన పథకాల్లో పెట్టుబడులు పెట్టి తీరాల్సిందే. అయితే పెట్టుబడులు పెట్టే ముందు.. కచ్చితంగా మీరు ఎంత మేరకు నష్టాన్ని భరించగలరో కూడా ఒక అంచనాకు రావాలి. అలాగే ఇన్వెస్ట్​మెంట్​ చేసిన తరువాత ఎప్పటికప్పుడు వాటిని సమీక్షించుకోవాల్సి ఉంటుంది.

సమీక్ష తప్పనిసరి!
Investment Portfolio Review : పెట్టుబడులను సమీక్షించడానికి నిర్దిష్ట సమయం అంటూ ఏమీ ఉండదు. కానీ కనీసం నెలకు ఒక్కసారి, వీలుకాకపోతే కనీసం 3 నెలలకు ఒక్కసారి అయినా పెట్టుబడులను పూర్తిగా సమీక్షించుకోవాలి. స్టాక్​ మార్కెట్లు ఎప్పుడూ చాలా డైనమిక్​గా ఉంటాయి. కనుక కీలకమైన ఘటనలు జరిగినప్పుడు కచ్చితంగా.. మీ ఇన్వెస్ట్​మెంట్స్​పై దృష్టి సారించాలి. ప్రధానంగా మీ పెట్టుబడులు స్టాక్​ మార్కెట్​ ఆధారిత పథకాల్లో ఉంటే.. కనుక తరచుగా మీ పెట్టుబడులు సమీక్షించుకోవడం మంచిది.

స్టాక్​మార్కెట్​లో హెచ్చుతగ్గులు సర్వసాధారణం. అయితే ఇన్వెస్టర్లు స్వల్పకాలిక ఒడుదొడుకులకు భయపడకుండా.. దీర్ఘకాలిక పెట్టుబడులపై దృష్టి కేంద్రీకరించాలి. దీని వల్ల దీర్ఘకాల సగటు ప్రయోజనం లభిస్తుంది. ఫలితంగా మీరు అనుకున్న లక్ష్యం కూడా చేరుకోవడానికి వీలవుతుంది.

ఏమేమి పరిశీలించాలి?
Equity investment strategy : జీవితంలో కొన్ని ముఖ్యమైన సంఘటనలు మన పెట్టుబడుల స్వరూపాన్ని తీవ్రంగా ప్రభావితం చేస్తూ ఉంటాయి. ముఖ్యంగా వివాహం, పిల్లలు, ఉద్యోగంలో మార్పు, అనుకోని ప్రమాదాలు.. ఇవన్నీ మన ఆర్థిక లక్ష్యాలను ప్రభావితం చేస్తాయి. అలాంటి పరిస్థితుల్లో మనం కచ్చితంగా మన పోర్టుఫోలియోను పూర్తిగా సమీక్షించుకోవాల్సి ఉంటుంది.

మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే.. సురక్షిత పథకాల్లో పెట్టుబడులు పెడితే.. భారీ ఆర్థిక లక్ష్యాలను సాధించడం కష్టమవుతుంది. రిస్క్​ అధికంగా ఉండే చోట పెట్టుబడులు పెడితే.. నష్టభయం ఎక్కువగానే ఉంటుంది కానీ.. లాభం వచ్చినా.. అంతే భారీగా ఉంటుంది. అందుకే ప్రస్తుత పరిస్థితుల్లో వస్తున్న ఆదాయం, భవిష్యత్తులో వచ్చే రాబడి అన్నీ అంచనా వేసుకొని, పోర్టుఫోలియోను సరిదిద్దుకోవాలి.

పెట్టుబడులు వైవిధ్యంగా..
Portfolio diversification : మన పెట్టుబడులు వీలైనంత వరకు సురక్షితంగా ఉండాలంటే.. పోర్టుఫోలియోను వైవిధ్యంగా తీర్చిదిద్దుకోవాలి. ఈక్విటీస్​, మ్యూచువల్​ ఫండ్స్​, ఫిక్స్​డ్​ డిపాజిట్లు, బంగారం, స్థిరాస్తి ఇలా విభిన్నమైన పెట్టుబడి మార్గాల్లో ఇన్వెస్ట్​ చేయాలి. అలాగే పరిస్థితులకు అనుగుణంగా వాటిని సమతూకం చేసుకోవాలి. అప్పుడే అనుకున్న లక్ష్యాలను సులభంగా చేరుకోవడానికి వీలవుతుంది.

ఇక్కడ మరో ముఖ్య విషయం మీరు గుర్తించుకోవాలి. పెట్టుబడులను సమీక్షించడం అంటే.. కచ్చితంగా వాటిలో మార్పులు, చేర్పులు చేయాలని కాదు. ఎంచుకున్న షేర్ల పనితీరు ఆధారంగా నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. ఒక వేళ మీరు నిర్లక్ష్యంగా ఉంటే.. మార్కెట్లు ఒడుదొడుకుల్లో ఉన్నప్పుడు.. మీ సంపద ఆవిరయ్యే అవకాశం ఉంటుంది. అందుకే క్లిష్ట సమయాల్లో వ్యక్తిగత ఆర్థిక నిపుణులను సంప్రదించడం ఉత్తమం.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.