ETV Bharat / business

రాష్ట్రాలకు పరిహారం కొనసాగింపుపై ఎటూ తేల్చని జీఎస్టీ మండలి

author img

By

Published : Jun 29, 2022, 6:57 PM IST

GST Compensation to States: చండీగఢ్‌ వేదికగా రెండు రోజుల పాటు జరిగిన జీఎస్‌టీ కౌన్సిల్‌ సమావేశం.. రాష్ట్రాల డిమాండ్​పై ఎటూ తేల్చకుండానే ముగిసింది. ఈ భేటీలో భాగంగా రాష్ట్రాలకు పరిహారం కొనసాగింపు అంశం అజెండాలో ఉన్నప్పటికీ దానిపై మండలి ఎలాంటి నిర్ణయమూ తీసుకోలేదు. ఈ మేరకు పుదుచ్చేరి ఆర్థిక మంత్రి కె.లక్ష్మీనారాయణన్‌ మీడియాకు తెలిపారు.

gst-compensation-to-states
రాష్ట్రాలకు పరిహారం కొనసాగింపుపై తేలని నిర్ణయం

GST Meeting: రాష్ట్రాలు ఎంతో ఆసక్తిగా ఎదురుచూసిన జీఎస్‌టీ పరిహారం (GST compensation) కొనసాగింపుపై వస్తు, సేవల పన్ను (జీఎస్‌టీ GST) మండలి ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. చండీగఢ్‌ వేదికగా రెండు రోజుల పాటు జరిగిన జీఎస్‌టీ కౌన్సిల్‌ (GST Council) సమావేశం ఈ సాయంత్రం ముగిసింది. ఈ భేటీలో భాగంగా రాష్ట్రాలకు పరిహారం కొనసాగింపు అంశం అజెండాలో ఉన్నప్పటికీ దానిపై మండలి ఎలాంటి నిర్ణయమూ తీసుకోలేదు. ఈ మేరకు పుదుచ్చేరి ఆర్థిక మంత్రి కె. లక్ష్మీనారాయణన్‌ మీడియాకు తెలిపారు. "జీఎస్‌టీ పరిహారాన్ని మరింతకాలం కొనసాగించాలని అన్ని రాష్ట్రాలూ కోరాయి. అయితే తాజా సమావేశంలో దీనిపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఆగస్టులో జరిగే తదుపరి జీఎస్‌టీ మండలి సమావేశంలో దీనిపై నిర్ణయం తీసుకునే అవకాశముంది" అని లక్ష్మీనారాయణన్‌ వెల్లడించారు.

క్యాసినోలపై 28 శాతం జీఎస్‌టీ వాయిదా..
క్యాసినోలు, ఆన్‌లైన్‌ గేమింగ్‌, గుర్రపు పందేలు, లాటరీలపై 28 శాతం జీఎస్‌టీ నిర్ణయమూ వాయిదా పడింది. భాగస్వామ్య పక్షాలతో మరోసారి విస్తృతంగా చర్చించి నివేదిక సమర్పించాలని మేఘాలయ సీఎం కన్రాడ్‌ సంగ్మా నేతృత్వంలోని మంత్రుల బృందానికి కౌన్సిల్‌ సూచించింది. జులై 15 నాటికి నివేదిక సమర్పించాలని కోరినట్లు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ వెల్లడించారు. ఆన్‌లైన్‌ గేమింగ్‌లో పాల్గొనే ఆటగాడు చెల్లించే ప్రవేశ రుసుం సహా పూర్తి విలువపై జీఎస్‌టీ విధించాలని మంత్రుల బృందం సిఫారసు చేసిన సంగతి తెలిసిందే.

2017, జులై 1 నుంచి దేశవ్యాప్తంగా వస్తు, సేవల పన్ను (జీఎస్‌టీ GST) అమల్లోకి వచ్చిన విషయం తెలిసిందే. అయితే ఈ కొత్త పన్ను విధానం వల్ల రాష్ట్రాలకు కలిగే ఆదాయ నష్టాన్ని భర్తీ చేసేందుకు అయిదేళ్ల పాటు జీఎస్‌టీ పరిహారం ఇస్తామని కేంద్రం హామీ ఇచ్చింది. ఈ జులై 1తో అయిదేళ్లు పూర్తి కావొస్తున్నందున పరిహారం ఇవ్వడాన్ని ఆపేయనున్నట్లు జీఎస్‌టీ మండలి గత సమావేశానంతరం కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. అయితే గత రెండేళ్లుగా రాష్ట్రాల ఆర్థిక వ్యవస్థలపై కరోనా మహమ్మారి తీవ్ర ప్రభావం చూపినందున.. ఈ పరిహారాన్ని మరికొంతకాలం పొడగించాలని అన్ని రాష్ట్రాలు జీఎస్‌టీ మండలికి విన్నవించాయి. తాజాగా జరిగిన సమావేశంలో ఈ అంశాన్ని 'అనధికారికంగా' చర్చించిన జీఎస్‌టీ మండలి.. ఏ నిర్ణయం తీసుకోకపోవడం గమనార్హం.

ఇదీ చదవండి: జీఎస్టీ మోత.. హోటల్ వసతులపై 12%.. ఆస్పత్రుల గదులపై 5%

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.