ETV Bharat / business

చిన్న మొత్తాల్లో పెట్టుబడి పెట్టాలా, ఎస్​డీపీ ట్రై చేయండి

author img

By

Published : Aug 29, 2022, 11:07 AM IST

రికరింగ్‌, ఫిక్స్‌డ్‌ డిపాజిట్లను బ్యాంకులు, పోస్టాఫీసులు అందిస్తుంటాయి. మ్యూచువల్‌ ఫండ్‌ పథకాల్లో క్రమానుగతంగా మదుపు చేయొచ్చు. ఫండ్లలో ఈక్విటీ, డెట్‌ ఆధారిత పథకాలుంటాయి. వీటికి తోడుగా ఎస్‌డీపీ ఇప్పుడు వెలుగులోకి వచ్చింది.

systematic deposit plan
చిన్న మొత్తాల్లో పెట్టుబడి పెట్టాలా, ఎస్​డీపీ ట్రై చేయండి

ఆర్థిక లక్ష్యాలను సాధించే క్రమంలో క్రమానుగత పెట్టుబడులు ఎంతో కీలకం. భవిష్యత్తు అవసరాలను తీర్చుకునేందుకూ పొదుపు, మదుపులను ఎప్పుడూ కొనసాగిస్తూనే ఉండాలి. దీనికోసం ఎన్నో పెట్టుబడి మార్గాలున్నాయి. ఇందులో కొన్ని సురక్షితమైనవి, మరికొన్ని కాస్త నష్టభయంతో ఉంటాయి. పొదుపు కోసం రికరింగ్‌ డిపాజిట్లు, ఫిక్స్‌డ్‌ డిపాజిట్లు ఉండగా, పెట్టుబడి కోసం మ్యూచువల్‌ ఫండ్లలో సిప్‌లాంటి మార్గాలున్నాయి. ఇప్పుడు ఈ పథకాల జాబితాలోకి క్రమానుగత పొదుపు విధానం( సిస్టమేటిక్‌ డిపాజిట్‌ ప్లాన్‌- ఎస్​డీపీ) అందుబాటులోకి వచ్చింది.

ఏమిటిది?
Systematic deposit plan : ఎస్‌డీపీ పనితీరు ఆర్‌డీ, ఎఫ్‌డీల తరహాలోనే ఉంటుంది. చిన్న మొత్తాల్లో క్రమానుగతంగా పెట్టుబడి పెట్టాలనుకునే వారు ఎస్‌డీపీని పరిశీలించవచ్చు. చాలామంది మదుపరులు ఒకేసారి పెద్ద మొత్తంలో మదుపు చేయలేరు. ఇలాంటి వారికి ఇది అనుకూలంగా ఉంటుంది. వ్యవధి తీరిన తర్వాత ఒకేసారి పెద్ద మొత్తంలో వెనక్కి తీసుకోవచ్చు.

వడ్డీ లెక్కింపు
మ్యూచువల్‌ ఫండ్లలో సిప్‌ చేసినప్పుడు రూపాయి సగటు ప్రయోజనం అందుతుంది. ఎస్‌డీపీలో మదుపు చేసినప్పుడు స్థిరమైన వడ్డీ కాకుండా.. ఏ నెలకానెల పొదుపు మొత్తానికి ఆ నెలలో వర్తించే వడ్డీని గణిస్తారు. దీనివల్ల కొన్నిసార్లు అధిక వడ్డీ అందవచ్చు. లేదా తగ్గవచ్చు.

ఎస్‌డీపీలను సిప్‌తో పోల్చి చూసినప్పుడు అంత లాభదాయకం కాదనే నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే.. ఈ డిపాజిట్లలో ఒకసారి వడ్డీ రేటును నిర్ణయిస్తే అదే కొనసాగుతుంది. ఫండ్ల విషయంలో అలా కాదు. కాస్త నష్టభయం ఉన్నప్పటికీ.. దీర్ఘకాలంలో అధిక రాబడిని ఆర్జించేందుకు వీలుంటుంది. సురక్షితంగా ఉంటూ.. స్వల్పకాలిక వ్యవధి కోసం పొదుపు చేయాలనుకుంటే ఎస్‌డీపీలను పరిశీలించవచ్చు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.