ETV Bharat / business

త్వరలో మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్.. జపాన్, జర్మనీలను దాటి..

author img

By

Published : Sep 4, 2022, 7:32 AM IST

India largest economy
India largest economy

India largest economy: ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో భారత్ దూసుకెళ్తోంది. బ్రిటన్​ను వెనక్కి నెట్టి ఐదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ నిలిచింది. అయితే, త్వరలోనే భారత్ మూడో అతిపెద్ద ఎకానమీగా నిలవనుందని ఎస్​బీఐ నివేదిక అంచనా వేసింది.

India largest economy: ప్రపంచంలోనే అయిదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్‌ అవతరించింది. ఇది ఒక విశేషమైతే.. ఆ స్థానంలో ఉన్న బ్రిటన్‌ను వెనక్కినెట్టడం మరో విశేషం. అదీ స్వాతంత్య్రం పొందిన 75 ఏళ్ల తర్వాత ఈ పరిణామం చోటు చేసుకోవడం మరింత విశేషం. ఇక ఇపుడు అమెరికా, చైనా, జపాన్‌, జర్మనీలే భారత్‌ ముందున్నాయని ఐఎమ్‌ఎఫ్‌ అంచనాలు వెల్లడిస్తున్నాయి. అయితే ఏడేళ్లలో జపాన్‌, జర్మనీలనూ అధిగమించి మూడో స్థానానికి భారత్‌ వెళ్లవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు.

దశాబ్దం కిందట..
సరిగ్గా పదేళ్ల కిందట అతిపెద్ద ఆర్థిక వ్యవస్థల్లో భారత్‌ 11వ ర్యాంకులో ఉంది. ఆ సమయంలో బ్రిటన్‌ది అయిదో స్థానం. ఐఎమ్‌ఎఫ్‌ గణాంకాలు, చారిత్రాత్మక ఎక్స్ఛేంజీ రేట్ల ఆధారంగా బ్లూమ్‌బర్గ్‌ వేసిన లెక్కల ప్రకారం ఇపుడు బ్రిటన్‌ను అధిగమించి అయిదో స్థానంలో భారత్‌ చేరింది. జనవరి-మార్చిలో భారత ఆర్థిక వ్యవస్థ 854.7 బిలియన్‌ డాలర్లుగా నమోదైంది. బ్రిటన్‌ ఆర్థిక వ్యవస్థ 816 బి.డాలర్లుగా తేలిందని బ్లూమ్‌బర్గ్‌ తన నివేదికలో పేర్కొంది. త్రైమాసికం చివరి రోజున డాలరు మారక రేటు ఆధారంగా సర్దుబాటు పద్ధతిలో ఆ సంస్థ లెక్కవేసింది. ఇపుడు ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన వృద్ధిని సాధిస్తున్న దేశంగా భారత్‌ ఉన్నందున.. వచ్చే కొద్ది సంవత్సరాల్లో బ్రిటన్‌కు, భారత్‌కు మధ్య అంతరం మరింత పెరగవచ్చని అంచనా.

India largest economy
.

సానుకూలతలు..
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్‌-జూన్‌ త్రైమాసికంలో భారత జీడీపీ 13.5 శాతం మేర వృద్ధి చెందింది. తద్వారా ప్రపంచంలోనే వేగవంతమైన ఆర్థిక వ్యవస్థగా కొనసాగింది.

  • ఆర్‌బీఐ అంచనా అయిన 16.2% కంటే తక్కువే అయినా.. గిరాకీ పుంజుకోవడం (ముఖ్యంగా సేవల రంగంలో) వల్ల ఇది సాధ్యమైంది. రాబోయే పండుగల సీజనులో సేవల రంగం మరింత రాణిం చొచ్చు.
  • కరోనా కఠిన నిబంధనల సడలింపు తర్వాత వినియోగదార్లు బయటకు వచ్చి ఖర్చు చేయడానికి ముందుకు రావడంతో గిరాకీ పెరిగింది.

ప్రతికూలతలు..

  • పెరుగుతున్న వడ్డీ రేట్లు; మాంద్యం భయాలు కలిసి రాబోయే త్రైమాసికాల్లో మన వృద్ధిలో వేగం తగ్గే అవకాశం ఉంది.
  • తయారీ రంగంలో 4.8% వృద్ధి ఉండటం ఆందోళనకర అంశం.
  • దిగుమతులూ ఎగుమతుల కంటే ఎక్కువగా ఉండడం ప్రతికూలాంశం.
  • ద్రవ్యోల్బణం వరుసగా ఏడు నెలల పాటు ఆర్‌బీఐ సౌకర్యవంతమైన స్థాయి అయిన 6 శాతం ఎగువన నమోదైంది.
  • ఆర్‌బీఐ కఠిన పరపతి విధానాలను అనుసరిస్తున్నా.. అధిక ఇంధన, కమొడిటీ ధరలు గిరాకీపై; కంపెనీల పెట్టుబడుల ప్రణాళికలపై ప్రభావం చూపొచ్చు.

'వారికి గట్టి సమాధానం'
"కర్మ సిద్ధాంతం పనిచేసింది. ప్రతి భారతీయుడి హృదయం ఈ వార్తతో ఉప్పొంగిపోతుంది. స్వాతంత్య్రానంతరం భారత్‌ గందరగోళంలో పడిపోతుందని భావించిన వారందరికీ ఇదో గట్టి సమాధానం."
-ఆనంద్‌ మహీంద్రా, ఛైర్మన్‌, మహీంద్రా

2029 కల్లా మూడో స్థానానికి!
భారత్‌ 2029 నాటికల్లా మూడోస్థానానికి చేరుతుందని ఎస్‌బీఐ రీసెర్చ్‌ విభాగం అంచనా వేసింది. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో భారత్‌ జీడీపీ వాటా 2014లో 2.6% ఉండగా, ఇప్పుడు అది 3.5 శాతానికి చేరింది. 2027 నాటికి 4 శాతానికి చేరే అవకాశం ఉంది. ప్రస్తుతం జర్మనీ ఆ స్థానంలో ఉంది. 2014 నుంచి భారత్‌ అనుసరిస్తున్న పంథాను బట్టిచూస్తే 2029 కల్లా మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించే అవకాశం ఉంది. 2014లో 10వ స్థానంలో ఉన్న భారత్‌ 15 ఏళ్లలో ఏడు స్థానాలను ఎగబాకినట్లవుతుంది. ప్రస్తుత వృద్ధిరేటు ప్రకారం చూస్తే 2027 నాటికి జర్మనీని, 2029 నాటికి జపాన్‌ను భారత్‌ను అధిగమించే సూచనలు ఉన్నాయి. రాబోయే రోజుల్లో చైనాలో కొత్త పెట్టుబడులు మందగించే అవకాశం ఉన్నందున ఆ మేరకు భారత్‌ లబ్ధిపొందొచ్చని ఎస్‌బీఐ రీసెర్చ్‌ అంటోంది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.