ETV Bharat / business

లోన్​ యాప్​లపై ఈడీ కొరడా.. పేటీఎం, రేజోర్​పే పై సోదాలు..

author img

By

Published : Sep 3, 2022, 9:00 PM IST

ED On Loan Apps : రుణ యాప్​లకు సంబంధించిన కేసు దర్యాప్తులో భాగంగా రేజోర్‌పే, పేటీఎం, క్యాష్‌ఫ్రీ వంటి ఆన్‌లైన్‌ పేమెంట్‌ గేట్‌వే సంస్థల కార్యాలయాల్లో శనివారం సోదాలు చేపట్టింది ఈడీ. బెంగళూరులోని ఆరు ప్రాంతాల్లో ఏకకాలంలో తనిఖీలు చేసినట్లు ఈడీ తెలిపింది.

ED On Loan Apps
ED On Loan Apps

ED On Loan Apps : రుణ యాప్‌ల వ్యవహారంలో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్‌ (ఈడీ) విచారణ వేగవంతం చేసింది. ఈ కేసుకు సంబంధించిన దర్యాప్తులో భాగంగా రేజోర్‌పే, పేటీఎం, క్యాష్‌ఫ్రీ వంటి ఆన్‌లైన్‌ పేమెంట్‌ గేట్‌వే సంస్థల కార్యాలయాల్లో శనివారం సోదాలు చేపట్టింది. కర్ణాటక రాజధాని బెంగళూరులోని ఆరు ప్రాంతాల్లో ఏకకాలంలో ఈ తనిఖీలు జరుగుతున్నట్లు ఈడీ ఓ ప్రకటనలో వెల్లడించింది.

చైనా నియంత్రణలో నడుస్తోన్న అనేక లోన్ యాప్‌ సంస్థలకు.. ఈ పేమెంట్‌ గేట్‌వేలతో సంబంధం ఉందన్న ఆరోపణలపై ఈ సోదాలు చేపట్టినట్లు తెలుస్తోంది. తనిఖీల్లో భాగంగా చైనా నియంత్రణలో ఉన్న సంస్థల బ్యాంక్‌ ఖాతాలు, మర్చెంట్‌ ఐడీల నుంచి రూ.17కోట్లు స్వాధీనం చేసుకున్నట్లు ఈడీ తెలిపింది.

లోన్‌ యాప్‌ సంస్థలు భారతీయుల నకిలీ ఖాతాలను ఉపయోగించి, డమ్మీ డైరెక్టర్లను పెట్టి ఈ నేరాలకు పాల్పడుతున్నట్లు ఈడీ పేర్కొంది. ఈ రుణ సంస్థలను చైనా వ్యక్తులు నిర్వహిస్తున్నట్లు దర్యాప్తులో తేలిందని వెల్లడించింది. పేటీఎం వంటి పేమెంట్‌ గేట్‌వేల వద్ద ఉన్న మర్చెంట్‌ ఐడీ/ఖాతాల ద్వారా ఈ అక్రమ వ్యాపారం సాగుతున్నట్లు గుర్తించామని తెలిపింది. ప్రస్తుతం రేజోర్‌పే, క్యాష్‌ఫ్రీ, పేటీఎం, మరికొన్ని చైనా నియంత్రణ సంస్థల కార్యాలయాల్లో ఈ సోదాలు జరుగుతున్నట్లు పేర్కొంది.

సత్వర రుణాల పేరుతో వినియోగదారులను ఆకర్షించి ఆ తర్వాత వేధింపులు గురిచేస్తోన్న మోసం ఆ మధ్య వెలుగులోకి వచ్చిన విషయం తెలిసిందే. దేశవ్యాప్తంగా పలు నగరాల్లో ఈ తరహా మోసాలు బయటపడ్డాయి. ఈ లోన్‌ యాప్‌ సంస్థలు తొలుత సత్వర రుణాలతో వినియోగదారులను ఆకట్టుకుని.. ఆ తర్వాత రుణం మంజూరైన వినియోగదారుల నుంచి అత్యధిక వడ్డీలు వసూలు చేస్తున్నట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. చెప్పిన వడ్డీ ఇవ్వకపోతే వారిపై బెదిరింపులు పాల్పడుతుండంతో ఈ సంస్థలపై పలు చోట్ల కేసులు నమోదయ్యాయి. ఈ లోన్‌ యాప్‌ సంస్థలను చైనా సంస్థలు/వ్యక్తులు నిర్వహిస్తోన్నట్లు తెలిసింది. దీంతో ఈడీ వాటిపై మనీలాండరింగ్‌ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టింది.

ఇవీ చదవండి: ఐదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్​.. ఆరోస్థానానికి పడిపోయిన బ్రిటన్​

'రూ.5 కోట్లకు మించి జీఎస్టీ ఎగవేస్తే అధికారులే నేరుగా విచారించొచ్చు'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.