ETV Bharat / business

Credit Score : కొత్తగా ఉద్యోగంలో చేరారా?.. అయితే మీ క్రెడిట్​ స్కోరును పెంచుకోండిలా!

author img

By

Published : Jul 30, 2023, 5:03 PM IST

How To Increase My Credit Score : ప్రస్తుత రోజుల్లో ప్రతి ఒక్కరికి ఆర్థిక క్రమశిక్షణ తప్పనిసరి. అది లేకుంటే భవిష్యత్తులో ఉత్పన్నమయ్యే ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కోలేం. ఇందులో భాగంగానే ఒక వ్యక్తి తన బ్యాంకు క్రెడిట్​ స్కోర్​ను కచ్చితంగా పెంచుకోవాలని సూచిస్తున్నారు ఆర్థిక నిపుణులు. అయితే కొత్తగా ఉద్యోగంలో చేరినవారు క్రెడిట్​ స్కోర్​ను ఎలా నిర్మించుకోవాలో.. దాన్ని ఎలా మెరుగుపరుచుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.

How To Build Good Credit Score
కొత్తగా ఉద్యోగంలో చేరారా.. అయితే మీ క్రెడిట్​ స్కోరును పెంచుకోండిలా..

Tips To Improve Credit Score : కొత్తగా ఉద్యోగంలో చేరి, సంపాదించిన తొలి నెల జీతాన్ని చూసి ప్రతి ఒక్కరూ ఎక్కడ లేని ఆనందాన్ని పొందుతారు. ఈ సంతోషంలో వచ్చిన డబ్బుతో ఇష్టానుసారంగా దుబారా ఖర్చులు చేస్తుంటారు. అయితే అది ఒక అలవాటుగా మారే ప్రమాదం ఉందని అంటున్నారు ఆర్థిక నిపుణులు. ఇలా చేస్తే భవిష్యత్తులో వచ్చే ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కోవడం కష్టంగా మారవచ్చని హెచ్చరిస్తున్నారు. అయితే ఈ పరిస్థితులు రాకుండా ఉండాలంటే మొట్టమొదటగా తమ క్రెడిట్ స్కోర్​ను నిర్మించుకొని, అది తగ్గకుండా మెరుగైన స్కోర్​ను కొనసాగించాలని సూచిస్తున్నారు. దీనితో రానున్న రోజుల్లో ఎటువంటి ఇబ్బందులు లేకుండా చక్కని జీవితాన్ని ఆస్వాదించగలము. అయితే ఉద్యోగంలో చేరిన తొలినాళ్లలో కొంచెం జాగ్రత్తగా ఉంటే మంచి క్రెడిట్‌ స్కోరును నిర్మించుకోవడం సాధ్యమవుతుంది. మరి ఉద్యోగంలో చేరాక వచ్చే వేతనంతో దీనిని ఎలా ఆచరణలో పెట్టాలో ఇప్పుడు చూద్దాం.

అన్నింటికి ఇదే 'ఆధారం'..
Good Credit Score : ఏ ప్రభుత్వ పథకం పొందాలన్నా 'ఆధార్​' ఎలా ఆధారం అయిందో.. ఇప్పుడు ఏ రుణం పొందాలన్నా క్రెడిట్​ స్కోరే ఆధారం అవుతోంది. అంతలా దీనిని రుణాలు మంజూరు చేసే సమయంలో పరిగణిస్తారు రుణదాతలు. ఒక వ్యక్తి ఆర్థికంగా ఎంత కచ్చితంగా ఉన్నారో తెలుసుకునేందుకు వారి క్రెడిట్‌ స్కోర్​ చూస్తే చాలు. కాగా, 750 లేదా అంతకంటే ఎక్కువ క్రెడిట్‌ స్కోరుంటే.. మెరుగైన పరిస్థితిలో ఉన్నట్లే. ఈ సమయంలో బ్యాంకులు సులభంగా రుణాలను మంజూరు చేస్తాయి. అయితే క్రెడిట్ స్కోర్​ మెరుగ్గా లేకపోతే గనుక రుణదాతలు మన దరఖాస్తులను తిరస్కరిచే అవకాశం ఉంది. లేదా సహ-రుణగ్రహీతలు ఉండాలని చెప్పవచ్చు.

ఇలా చేసి చూడండి..
Tips To Increase Credit Score : దీనితోపాటు మరీ తక్కువ క్రెడిట్ స్కోర్​ ఉంటే.. రుణదాత మిమ్మల్ని హై-రిస్క్​ బారోవర్ (అధిక రిస్కు ఉన్న రుణగ్రహీత)గా పరిగణిస్తారు. ఒకవేళ రుణం మంజూరు చేసినా దానిపై అధిక వడ్డీ రేట్లను వసూలు చేసే అవకాశం ఉంది. అలాగే మెరుగైనా క్రెడిట్ స్కోర్​ ఉన్నప్పుడు రుణదాతలు కాస్త తక్కువ వడ్డీకే లోన్స్​ను ఇచ్చేందుకు మొగ్గు చూపిస్తారు. క్రెడిట్‌ హిస్టరీ లేనప్పుడు కూడా బ్యాంకులు కొన్నిసార్లు అధిక వడ్డీని వసూలు చేసేందుకు ఆస్కారం ఉంటుంది. కనుక ఇవన్నీ దృష్టిలో ఉంచుకొని కొత్తగా ఉద్యోగంలో చేరిన వారు ఈ కింది చిట్కాలను పాటిస్తే మంచి క్రెడిట్​ హిస్టరీని నిర్మించుకునేందుకు వీలుంటుంది.

Tips To Improve CIBIL Score :

  1. ముందుగా అతి తక్కువ క్రెడిట్ లిమిట్​తో ప్రాథమిక క్రెడిట్​ కార్డును పొందండి. ఈ కార్డును మీ శాలరీ అకౌంట్​ ఉన్న బ్యాంకు నుంచి సులభంగా పొందవచ్చు.
  2. అలా తీసుకున్న కార్డును జాగ్రత్తగా వినియోగించాలి.
  3. మీ క్రెడిట్‌ వినియోగం 30 శాతం పరిమితికి మించి ఉండకుండా చూసుకోండి.
  4. మీ బాకీలను గడువులోపే చెల్లించే ప్రయత్నం చేయండి. లేదంటే అపరాధ రుసుము చెల్లించడమే కాకుండా.. ఇది మీ క్రెడిట్​ స్కోర్​పై ప్రభావం చూపుతుంది.
  5. క్రెడిట్​ కార్డు బిల్లును ఎప్పటికప్పుడు తీర్చేయడం ద్వారా ఆరోగ్యకరమైన క్రెడిట్‌ చరిత్ర సాధ్యమవుతుంది.
  6. అయితే కొన్నిసార్లు క్రెడిట్‌ కార్డును బ్యాంకులు ఇవ్వకపోవచ్చు. అలాంటి సందర్భాల్లో కొంత సొమ్మును ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ చేయాల్సి వస్తుంది. అలా జమ చేసిన దానిపై క్రెడిట్‌ కార్డును ఇస్తారు. నేరుగా పొందలేని వారు ఇలా అయినా తీసుకునేందుకు ప్రయత్నించండి.
  7. అలా కొంతకాలం కార్డును వాడటం అలవాటు చేసుకోండి. దీనితో సాధారణ క్రెడిట్​ కార్డును కూడా సులువుగా పొందవచ్చు.
  8. ఈ మధ్య ఇంట్లో వినియోగించే ఎలక్ట్రానిక్​ పరికరాలను కొనేందుకు చాలామంది క్రెడిట్​ కార్డులనే ఆశ్రయిస్తున్నారు. ముందుగా మీరు తక్కువ విలువైన పరికరాన్ని రుణంపై తీసుకోండి. ఉదాహరణకు మొబైల్‌ ఫోనును కొనుగోలు చేసి 6 లేదా 8 నెలల్లో వాయిదాలను చెల్లించండి. ఇది మంచి క్రెడిట్​ స్కోర్​ను నమోదు చేస్తుంది.
  9. ఏవైనా రుణాల కోసం దరఖాస్తు చేసేటప్పుడు వాటిని తిరిగి చెల్లించే శక్తిని అంచనా వేసుకోవాలి.
  10. అలాగే అప్పు తీసుకునే ముందు మీ అవసరాలను కూడా అంచనా వేయండి.
  11. ఇతర బాకీలేమైనా ఉంటే సకాలంలో చెల్లించండి.
  12. మీ క్రెడిట్‌ స్కోరును ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ పర్యవేక్షిస్తుండండి. ఈ క్రమంలో ఏమైనా లోపాలుంటే సరిదిద్దుకునేందుకు వీలుంటుంది.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.