ETV Bharat / business

వడ్డీ రేట్లు పెంచిన ఫెడ్.. 20ఏళ్లలో ఇదే అత్యధికం

author img

By

Published : May 5, 2022, 6:48 AM IST

fed interest rates
fed interest rates

Fed interest rate: కీలక వడ్డీ రేట్లను పెంచుతూ అమెరికా ఫెడరల్ రిజర్వు నిర్ణయం తీసుకుంది. రేట్లను 0.5 శాతం పెంచుతున్నట్లు ప్రకటించింది. ద్రవ్యోల్బణం 40 ఏళ్ల గరిష్ఠానికి చేరిన నేపథ్యంలో రేట్ల పెంపునకే మొగ్గు చూపింది.

US fed interest rates: అమెరికా ఫెడరల్‌ రిజర్వు కీలక వడ్డీ రేట్లను 0.5 శాతం మేర పెంచింది. గత రెండు దశాబ్దాల్లోనే ఇది అత్యధిక పెంపు కావడం గమనార్హం. 40 ఏళ్ల గరిష్ఠానికి చేరిన ద్రవ్యోల్బణాన్ని కట్టడి చేయడానికి ఫెడ్‌ కీలక రేట్ల పెంపునకే మొగ్గుచూపింది. ఇదే సమయంలో 9 లక్షల కోట్ల డాలర్ల బ్యాలెన్స్‌ షీట్‌ తగ్గించడాన్ని ప్రారంభిస్తున్నట్లు సంకేతాలు ఇచ్చింది. వడ్డీ రేట్లను తక్కువ స్థాయిలో ఉంచడానికి ఫెడ్‌ బాండ్ల కొనుగోలు, నగదు లభ్యత పెంచుతూ వచ్చింది.

అయితే ధరల పెరుగుదల నేపథ్యంలో వడ్డీ రేట్లను పెంచకతప్పలేదు. రాబోయే నెలల్లో ఫెడ్‌ ఇదే ధోరణి కొనసాగించవచ్చని, జూన్‌లో మరో 75 బేసిస్‌ పాయింట్లు పెంచే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ఏడాది మార్చిలో ఫెడ్‌ కీలక రేట్లను పావు శాతం పెంచడంతో ప్రామాణిక ఫెడరల్‌ ఫండ్‌ రేట్లు 0.25%-0.5% శ్రేణికి చేరాయి. కొవిడ్‌-19 మహమ్మారి ప్రారంభమయ్యాక ప్రామాణిక వడ్డీ రేటును దాదాపు సున్నా వద్దే ఫెడ్‌ ఉంచింది.

మరోవైపు, భారతీయ రిజర్వ్ బ్యాంకు సైతం వడ్డీ రేట్లను పెంచుతూ బుధవారం సంచలన ప్రకటన చేసింది. ద్వైమాసిక ద్రవ్యపరపతి విధాన సమీక్ష లేకపోయినా.. వడ్డీ రేట్లను పెంచుతున్నట్లు ప్రకటించి అందరినీ ఆశ్చర్యపరిచింది. రెపో రేటును 40 బేసిస్​ పాయింట్ల మేర పెంచి.. 4.4శాతానికి చేర్చింది. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం కారణంగా ద్రవ్యోల్బణం భారీగా పెరుగుతోందని, ఫలితంగా వడ్డీ రేట్లు పెంచాల్సి వచ్చిందని ఆర్​బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ వివరించారు. రేట్ల పెంపునకు ద్రవ్యపరపతి విధాన కమిటీ ఏకగ్రీవంగా అంగీకరించినట్లు చెప్పారు.

ఇదీ చదవండి: జాక్​మాపై వదంతులు.. అలీబాబా షేర్లు పతనం.. ఒక్కరోజే 26 బిలియన్ డాలర్లు ఆవిరి!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.