ETV Bharat / business

అందరి కళ్లూ వాటి పైనే.. జెట్​ స్పీడ్​లో EVల అమ్మకాలు

author img

By

Published : Jan 14, 2023, 6:46 AM IST

Updated : Jan 14, 2023, 7:00 AM IST

దేశంలో విద్యుత్ వాహనాల వినియోగం క్రమంగా పెరుగుతోంది. గతేడాది దేశవ్యాప్తంగా పదిలక్షల ఎలెక్ట్రిక్​ వాహనాల అమ్మకాలు జరిగాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఆ సంఖ్య మరింత పెరగనుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. నిర్వహణ వ్యయం తక్కువ కావడం వల్లే ప్రజలు విద్యుత్​ వాహనాల వైపు మొగ్గు చూపుతున్నారని చెబుతున్నారు.

auto expo 2023 tata avinya
auto expo 2023 tata avinya

Auto Expo 2023 : రహదారులపై దూసుకెళ్తున్న పెట్రోల్‌, డీజిల్‌ వాహనాలకు, విద్యుత్‌ వాహనాలు (ఈవీలు) కూడా ఎక్కువగానే తోడవుతున్నాయి. పెట్రోల్‌, డీజిల్‌ వాహనాలతో పోలిస్తే వీటి ధర ఎక్కువైనా, నిర్వహణ వ్యయం తక్కువగా ఉండటం వల్లే కొనుగోళ్లకు ఆసక్తి వ్యక్తమవుతోంది. 2022లో పెట్రోల్‌, డీజిల్‌ వాహనాల అమ్మకాలు 15-20% పెరిగితే, ఈవీల అమ్మకాలు ఏకంగా 325శాతం అధికమై 10 లక్షలకు చేరాయి. ఛార్జింగ్‌ కేంద్రాలు మరింతగా అందుబాటులోకి వస్తే ఈ ఏడాది 15లక్షల వరకు ఈవీలు విక్రయమయ్యే అవకాశాలున్నాయని రవాణా రంగ నిపుణులు తెలిపారు. కొనుగోళ్లు పెరిగే కొద్దీ ఈవీల ధరలు తగ్గుతాయని విద్యుత్‌ కార్లు, బైక్‌ల తయారీ కంపెనీలు పేర్కొంటున్నాయి.

.

ఆశలు రేకెత్తిస్తున్న మైలేజీ
ఒకసారి ఛార్జింగ్‌ చేస్తే 700 కిలోమీటర్ల వరకు ప్రయాణించే వాహనాలను ఆటో ఎక్స్‌పో 2023లో కంపెనీలు ప్రదర్శిస్తున్నాయి. టాటా, హ్యుందాయ్‌, కియా, టయోటా, మారుతీ సుజుకీ, ఎంజీ హెక్టార్‌, టయోటా లెక్సస్‌, బీవైడీ సంస్థలు అధునాతన విద్యుత్తు కార్లను ఆవిష్కరిస్తున్నాయి. ఒకసారి ఛార్జింగ్‌తో అధిక దూరం ప్రయాణించే విద్యుత్తు ద్విచక్ర వాహనాలు, ఆటోలు, బస్సులు, సరకు రవాణా ట్రక్కులను కంపెనీలు ఆవిష్కరిస్తున్నాయి.

  • హైదరాబాద్‌ నుంచి విజయవాడకు కారులో వెళ్లి వచ్చేందుకు (600 కిలోమీటర్ల ప్రయాణానికి) పెట్రోల్‌కు రూ.4-6వేలు అవుతుంది. విద్యుత్‌కారులో బ్యాటరీ ఛార్జింగ్‌ చేసుకుంటే రూ. 700 -800 సరిపోతుందని చెబుతున్నారు. విద్యుత్‌ కార్లు కూడా గంటకు గరిష్ఠంగా 140 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తున్నాయని కంపెనీలు చెబుతున్నాయి.

ఛార్జింగ్‌ కేంద్రాలు అంతంతే..
తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుతం సుమారు లక్ష విద్యుత్‌ వాహనాలుండగా, ఛార్జింగ్‌ స్టేషన్లు 450 మాత్రమే ఉన్నాయి. వీటిల్లో ఛార్జింగ్‌కు గంటకు రూ.20-30 చొప్పున వసూలు చేస్తున్నారు. 2 కిలోవాట్‌ అవర్‌ బ్యాటరీ ఛార్జింగ్‌కు 2.5 గంటల వరకు పడుతుంది.

  • దేశవ్యాప్తంగా 2026 సంవత్సరానికి 70వేలు, 2030కి లక్ష ఛార్జింగ్‌ స్టేషన్లను అందుబాటులోకి తేవాలన్నది ప్రణాళిక.
  • నాలుగేళ్లల్లో జాతీయ రహదారులపై ప్రతి 25కిలోమీటర్లకు రెండు వైపులా ఒక్కోటి, మెట్రో నగరాలు, పట్టణాల్లో ప్రతి 3 కిలోమీటర్లకు ఒకటి చొప్పున ఛార్జింగ్‌ స్టేషన్లు ఏర్పాటు చేయనున్నారు.

అప్పుడు నెలకు రూ.5000.. ఇప్పుడు రూ.500
"వ్యాపార పనుల నిమిత్తం రోజుకు 100 కిలోమీటర్లకు పైగా బైక్‌పై తిరుగుతా. 3 రోజులకు రూ.500 చొప్పున, నెలకు రూ.5000 దాకా పెట్రోల్‌ బిల్లు అయ్యేది. 6 నెలల క్రితం రూ.1.40లక్షలతో విద్యుత్తు స్కూటర్‌ కొన్నా. ఇంట్లోనే ఛార్జింగ్‌ పెట్టుకుంటున్నా. ఒకసారి ఛార్జింగ్‌తో 80-90 కిలోమీటర్లు వెళ్తోంది. నెలకు వాహన ఛార్జింగ్‌కు రూ.500 సరిపోతోంది."

--వినయ్‌, బంగారు నగల వ్యాపారి

ఒకసారి ఛార్జింగ్‌తో 320- 400 కి.మీ.
"విద్యుత్‌ బ్యాటరీ కారును 2 నెలల క్రితం కొన్నా. ఒకసారి ఛార్జింగ్‌తో నగరంలో 320 కిలోమీటర్లు, జాతీయ రహదారులపై 400-440 కి.మీ. ప్రయాణించగలుగుతున్నా. బ్యాటరీ రీ-ఛార్జ్‌ అయ్యేందుకు 9 గంటలు పడుతోంది. పెట్రోల్‌ ఖర్చుతో పోలిస్తే చాలా ఆదా అవుతోంది."

--హరికుమార్‌ బాలకృష్ణ పిళ్లె, వ్యాపారి

ద్విచక్ర వాహనాల ఛార్జింగ్‌కు పోర్టబుల్‌ పరిష్కారం
సొంత ఇళ్లలోని వారు వాహనాల ఛార్జింగ్‌కు ఏర్పాట్లు చేసుకుంటున్నా, అపార్టుమెంట్లలో మాత్రం ఇబ్బందులు తప్పడం లేదు. అందుకే కంపెనీలు పోర్టబుల్‌ బ్యాటరీల (వాహనం నుంచి తీసుకెళ్లి, ఇంట్లోనే ఛార్జింగ్‌ పెట్టుకునేవి)పై దృష్టి సారిస్తున్నాయి. హీరో సంస్థ వీదా మోడల్‌తో పాటు హైదరాబాద్‌ కేంద్రంగా పనిచేస్తున్న ఫ్రాంక్లిన్‌ ఈవీ ఇండియా కూడా తమ 3 స్కూటర్లకు ఇలాంటి బ్యాటరీలనే అమర్చింది. అయితే బ్యాటరీలను రాత్రంతా ఛార్జింగ్‌ పెట్టి ఉంచకూడదని, అవసరం మేర 2-3 గంటల పాటు ఛార్జింగ్‌ పెడితే బ్యాటరీల వల్ల ప్రమాదాలు ఉండవని ఫ్రాంక్లిన్‌ ఈవీ డైరెక్టర్‌ రంజిత్‌ తెలిపారు. 10-12 కిలోల బరువుండే 2.1 కిలోవాట్‌ అవర్‌ బ్యాటరీని పూర్తిగా ఛార్జింగ్‌ చేసేందుకు 2 యూనిట్ల విద్యుత్తు (ఖర్చు రూ.15) అవుతుందని, 100 కిలోమీటర్ల వరకు ప్రయాణించొచ్చని తెలిపారు.

  • విద్యుత్‌ వాహనాలపై కేంద్ర ప్రభుత్వం ఫేమ్‌2 పథకం కింద కిలోవాట్‌ అవర్‌ బ్యాటరీకు ద్విచక్ర వాహనాలకు రూ.15వేలు, ఆటోలు, కార్లకు రూ.10వేల చొప్పున రాయితీ ఇస్తోంది. ఈవీలకు జీవితకాలపు పన్ను మినహాయించడంతో పాటు విద్యుత్‌ బస్సులను కొనుగోలు చేసే రాష్ట్రాలకు ఆర్థికంగా సహకరిస్తోంది.
.
auto expo 2023 tata avinya
.
Last Updated :Jan 14, 2023, 7:00 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.