ETV Bharat / business

నువ్వా.. నేనా అంటున్న 'యాపిల్'​, 'ఆరామ్​కో'.. ఏమైందంటే..?

author img

By

Published : May 29, 2022, 5:32 AM IST

Apple Aramco: ఒకటేమో సాంకేతికత దిగ్గజం సంస్థ. మరొకటేమో చమురు రంగంలో అతిపెద్ద కంపెనీ. ఈ రెండింటికీ సారూప్యతే లేదు. రెండు కంపెనీలవీ వేర్వేరు దార్లు. అయితే ఒక విషయంలో మాత్రం ఇవి గట్టిగా పోటీ పడుతున్నాయి. నువ్వా.. నేనా అంటూ సవాలు విసురుకుంటున్నాయి.

Apple Aramco
Apple Aramco

Apple Aramco: యాపిల్‌, సౌదీ ఆరామ్‌కోల రేసు కొత్తగా వచ్చిందే. ఎందుకంటే ఈ ఏడాది ప్రారంభంలో యాపిల్‌ మార్కెట్‌ విలువ 3 లక్షల కోట్ల డాలర్లుగా ఉంది. అదే సమయంలో సౌదీ ఆరామ్‌కో మార్కెట్‌ విలువ యాపిల్‌ కంటే 1 లక్ష కోట్ల డాలర్లు తక్కువగా ఉండేది.
ఆ తర్వాత పరిణామాలు మారిపోయాయి. రెండు వారాల కిందటి వరకు అంటే మే మధ్యలో.. కథేమింటే..

2022లో జనవరి-మే మధ్య వరకు యాపిల్‌ షేరు 20% వరకు నష్టపోయింది. అదే సమయంలో సౌదీ ఆరామ్‌కో 28% మేర పెరిగింది. దీంతో యాపిల్‌ను సౌదీ ఆరామ్‌కో వెనక్కి నెట్టింది. ప్రపంచంలోనే అత్యంత విలువైన కంపెనీగా మారింది. ముడి చమురు ధరలు పెరగడంతో చమురు తయారీదారైన ఆరామ్‌కో షేర్లు దూసుకెళ్లగా.. ద్రవ్యోల్బణం పెరగడంతో టెక్నాలజీ షేర్లు డీలా పడడంతో ఇదంతా జరిగింది. రెండు వారాల కిందటి గణాంకాలను చూస్తే.. సౌదీ అరేబియాకు చెందిన జాతీయ పెట్రోలియం, సహజ వాయువు కంపెనీ విలువ 2.42 లక్షల కోట్ల డాలర్లుగా నిలిచింది. నెల రోజులుగా షేరు ధర పతనమవుతూ వస్తుండడంతో యాపిల్‌ మార్కెట్‌ విలువ 2.37 లక్షల కోట్ల డాలర్లకు పరిమితమైంది. సరఫరా వ్యవస్థలో ఒత్తిళ్లు, స్మార్ట్‌ఫోన్లకు అంతర్జాతీయ గిరాకీ కాస్త తగ్గడం, ద్రవ్యోల్బణం పెరగడం ఇందుకు కారణాలుగా నిలిచాయి. అయితే అమెరికాలో అతిపెద్ద కంపెనీగా యాపిల్‌ తన స్థానాన్ని నిలబెట్టుకుంది. ఆ దేశంలో రెండో స్థానంలో ఉన్న మైక్రోసాఫ్ట్‌ మార్కెట్‌ విలువ 1.95 లక్షల కోట్ల డాలర్లుగానే ఉంది.

గత రెండు వారాల్లో ఏం జరిగిందంటే..
రెండు వారాలు గడిచాయో లేదో మళ్లీ యాపిల్‌ తన స్థానాన్ని కైవసం చేసుకుంది. ప్రపంచంలోనే అత్యంత విలువైన కంపెనీగా అవతరించింది. ఈ వారంలో షేరు 8.54 శాతం మేర రాణించడంతో.. యాపిల్‌ విలువ 2.42 లక్షల కోట్ల డాలర్లకు చేరుకుంది. మరో వైపు శుక్రవారం ఆరామ్‌కో షేర్లు కాస్త తగ్గడంతో వెనకబడి 2.38 లక్షల కోట్ల డాలర్లుగా నిలిచింది.

మరి భవిష్యత్‌ మాటేమిటి?
ఈ ఏడాది తొలి మూడు నెలల్లో యాపిల్‌ అంచనాలను మించి ఫలితాలను ప్రకటించింది. అయితే చైనా లాక్‌డౌన్‌; సరఫరా వ్యవస్థ ఇబ్బందుల వల్ల జూన్‌ త్రైమాసిక ఫలితాలు 4-8 బి. డాలర్లు తగ్గొచ్చని హెచ్చరించింది. ఇక చమురు దిగ్గజం సౌదీ ఆరామ్‌కో గతేడాది నికర లాభంలో 124 శాతం వృద్ధితో 110 బిలియన్‌ డాలర్లకు చేరుకుంది. ఈ ఏడాదిలో ఇప్పటిదాకా లెక్కవేస్తే.. సౌదీ ఆరామ్‌కో షేరు ధర, విలువ 25% వరకు పెరిగితే.. యాపిల్‌ షేరు 17.78% మేర డీలా పడింది. ఇప్పటికీ యాపిల్‌ ద్రవ్యోల్బణ ఒత్తిళ్లను ఎదుర్కొంటోంది. కానీ కొంత మంది విశ్లేషకులు మాత్రం యాపిల్‌ షేరుపై నమ్మకంగానే ఉన్నారు. జూన్‌ 2022లో మరో దశ సాఫ్ట్‌వేర్‌ను యాపిల్‌ విడుదల చేయనుంది. మరిన్ని ఉత్పత్తులను ఈ ఏడాది చివర్లో తీసుకురానుంది. ఇక ఆరామ్‌కోకు పెరుగుతున్న చమురు ధరల నుంచి దన్ను లభించవచ్చు. ఇన్ని అంశాల మధ్య ఈ రేసులో ఎవరు ముందు నిలుస్తారో.. ఎవరు వెనకబడతారో?

ఇవీ చదవండి: రష్యాపై ఐరోపా దేశాల ఆంక్షలు.. భారత కంపెనీలకు కష్టాలు!

ఆ డిమాండ్లకు ఒప్పుకుంటేనే.. భారత్​లో ప్లాంట్​పై మస్క్ క్లారిటీ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.