ETV Bharat / business

'ఒమిక్రాన్‌తో ఆర్థిక వృద్ధికి విఘాతమే'

author img

By

Published : Dec 30, 2021, 8:07 AM IST

omicron
ఒమిక్రాన్‌తో ఆర్థిక వృద్ధికి విఘాతమే

దేశ ఆర్థిక వ్యవస్థకు ఒమిక్రాన్​ సవాలుగా మారనుందని ఆర్​బీఐ ఇటీవల పేర్కొంది. మరోవైపు ప్రైవేటు క్రిప్టోకరెన్సీ విలువల్లో తీవ్ర హెచ్చుతగ్గుల కారణంగా మోసాలకు అవకాశం ఉందని హెచ్చరించింది. బుధవారం విడుదల చేసిన రెండో 'ఆర్థిక స్థిరత్వ నివేదిక'లో ఈ విషయాలను పేర్కొంది.

ఆర్థిక వ్యవస్థలో రికవరీ స్థిరంగా కొనసాగుతున్నప్పటికీ.. కొవిడ్‌ ఒమిక్రాన్‌ రూపంలో మరో సవాలు ఎదురవబోతోందని రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా(ఆర్‌బీఐ) పేర్కొంది. ద్రవ్యోల్బణ ఒత్తిళ్లు కూడా దానికి తోడవుతాయని అంచనా వేస్తోంది. అంతర్జాతీయంగా ప్రతికూల పరిణామాలు ఎదురైనా కొవిడ్‌ రెండో దశ (ఏప్రిల్‌-మే 2021) తరవాత వృద్ధి అంచనాలు మెరుగయ్యాయని ఆర్‌బీఐ గవర్నర్‌ శక్తికాంత దాస్‌ తెలిపారు. బుధవారం విడుదల చేసిన రెండో 'ఆర్థిక స్థిరత్వ నివేదిక'లోని ముందు మాటలో ఆయన ఈ విషయాన్ని ప్రస్తావించారు. 'ప్రైవేటు పెట్టుబడులు, ప్రైవేటు వినియోగం పుంజుకుంటున్నందున, రికవరీ స్థిరంగా, బలంగా కొనసాగుతున్నా, కరోనా ముందు స్థాయిల కంటే దిగువనే ఉంది. ద్రవ్యోల్బణం కూడా ఆందోళనకరంగానే ఉంది. ఆహార, ఇంధన ధరలను అదుపులో ఉంచడానికి సరఫరా వైపు బలమైన చర్యలు తీసుకోవాలి. విధాన, నియంత్రణ మద్దతు కారణంగా ఆర్థిక మార్కెట్లు, ఆర్థిక సంస్థలు స్థిరత్వాన్ని, బలాన్ని సంతరించుకోగలిగాయ'ని ఆయన వివరించారు.

ఆర్థిక స్థిరత్వ నివేదికలో ఏముందంటే..

  • బ్యాంకుల్లో స్థూల నిరర్థక ఆస్తులు (ఎన్‌పీఏలు) 2021 సెప్టెంబరులో 6.9 శాతంగా ఉండగా.. 2022 సెప్టెంబరు కల్లా 8.1-9.5 శాతానికి చేరొచ్చని అంచనా. ఒమిక్రాన్‌ పరిణామాలతో ఆర్థిక వ్యవస్థ తీవ్ర ఒత్తిడికి గురైతే మొండి బకాయిలు గరిష్ఠంగా 9.5 శాతానికి చేరొచ్చని అంచనా.
  • ప్రభుత్వ రంగ బ్యాంకుల స్థూల ఎన్‌పీఏలు ఈ ఏడాది సెప్టెంబరులో 8.8 శాతంగా ఉండగా.. వచ్చే ఏడాది సెప్టెంబరుకు 10.5 శాతానికి చేరొచ్చు.
  • ప్రైవేటు బ్యాంకుల స్థూల ఎన్‌పీఏలు 4.6 శాతం నుంచి 5.2 శాతానికి; విదేశీ బ్యాంకుల ఎన్‌పీఏలు 3.2 శాతం నుంచి 3.9 శాతానికి పెరగొచ్చు.
  • సానుకూల అంశం ఏమిటంటే.. షెడ్యూల్డ్‌ వాణిజ్య బ్యాంకుల మూలధనం-ఒత్తిడిలోని ఆస్తుల నిష్పత్తి(సీఆర్‌ఏఆర్‌) 2021 సెప్టెంబరులో 16.6 శాతానికి చేరడం.
  • రిటైల్‌ రుణాల్లో ఒత్తిడి స్థాయి పెరుగుతోంది. ఈ ఆర్థిక సంవత్సరంలో అది రెండంకెలకు చేరింది.
  • ఎన్‌బీఎఫ్‌సీల్లో చాలా వరకు ద్రవ్యలభ్యత లేక ఇబ్బందుల పాలుకావొచ్చు.

రికవరీ వేగంలో మందగమనం

  • సూక్ష్మ, చిన్న, మధ్య స్థాయి కంపెనీ(ఎమ్‌ఎస్‌ఎమ్‌ఈ)ల్లో ఒత్తిడి సంకేతాలు కనిపిస్తున్నాయి. వీటి పోర్ట్‌ఫోలియోలను సునిశితంగా పరిశీలించాలి.
  • దేశీయంగా టీకాల కార్యక్రమం వేగం అందుకోవడం వల్ల కరోనా రెండో దశ అనంతరం రికవరీ సాధ్యమైంది. కార్పొరేట్‌ రంగం బలం పుంజుకోవడం వల్ల బ్యాంకుల్లో రుణ వృద్ధి పెరుగుతోంది. అయితే రికవరీ వేగం మందగిస్తున్న సంకేతాలు కనిపిస్తున్నాయి.
  • ప్రైవేటు క్రిప్టోకరెన్సీల వల్ల వినియోగదార్లకు తక్షణం నష్టభయం కలగొచ్చు. విలువల్లో తీవ్ర హెచ్చుతగ్గుల కారణంగా మోసాలకు అవకాశం ఉంది. సరికొత్త చట్టవ్యతిరేక ఆర్థిక పద్ధతులు మరిన్ని ఎదురవ్వొచ్చు. ఈ విషయంలో అప్రమత్తంగా ఉండాలి. వర్థమాన దేశాల్లో అగ్రగామి 100 క్రిప్టోకరెన్సీల మార్కెట్‌ విలువ 2.8 లక్షల కోట్ల డాలర్లకు చేరింది. క్రిప్టోల కొనుగోలుపై వ్యక్తులకు స్వేచ్ఛ ఉండడం, ఆయా దేశాల మూలధన నియంత్రణ వ్యవస్థలను అణగదొక్కేలా ఉంది.

ఇదీ చూడండి : Bank Holidays in January 2022: జనవరిలో 16 రోజులు బ్యాంకులు బంద్​!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.