ETV Bharat / business

దేశంలో పన్ను సంస్కరణలకు నేటితో మూడేళ్లు

author img

By

Published : Jul 1, 2020, 12:35 PM IST

Updated : Jul 1, 2020, 12:57 PM IST

దేశ పన్నుల విధానంలో సమూల మార్పులకు ఆజ్యం పోసిస జీఎస్​టీ అమలులోకి వచ్చి మూడేళ్లు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా జీఎస్​టీ​పై 'ఈటీవీ భారత్' అందిస్తున్న ప్రత్యేక కథనం మీ కోసం.

gst completes three years
జీఎస్​టీకి మూడేళ్లు

'ఒకే దేశం.. ఒకే పన్ను' నినాదంతో ప్రవేశపెట్టిన వస్తు సేవల పన్ను (జీఎస్​టీ)కు బుధవారంతో మూడేళ్లు పూర్తయ్యాయి. 2017, జులై 1న ఈ నూతన పన్నుల విధానం అమల్లోకి వచ్చింది. అమలుకు ముందూ తర్వాత ఎన్నో రాజకీయ విమర్శలకు దారి తీసింది జీఎస్​టీ విధానం.

ఎందుకీ జీఎస్​టీ?

ఎగవేతలకు అడ్డుకట్ట వేయడమే ప్రధాన లక్ష్యంగా జీఎస్​టీని అమలు చేసింది కేంద్ర ప్రభుత్వం. ఇంతకు ముందున్న సంప్రదాయ పన్నుల విధానంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విడివిడిగా పన్నులు వసూలు చేసేవి. ఇలా చేయడం వల్ల వస్తువులపై పన్నుల భారం ఎక్కువగా ఉండేది. వీటితో పాటు పన్నులు కూడా వేరు వేరుగా ఉండేవి. వీటన్నింటిని ఏకతాటి పైకి తీసుకురావడం కూడా జీఎస్​టీ ప్రధాన ఉద్దేశాల్లో ఒకటి.

2003లోనే బీజం

ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల్లో జీఎస్​టీ అమలులో ఉంది. ఈ విధానాన్ని మన దేశానికి తీసుకువచ్చేందుకు 2003లోనే అడుగులు పడ్డాయి. 2004లో ప్రభుత్వం మారడం వల్ల కొన్నాళ్లు జీఎస్​టీ అంశం ఊసేలేకుండా పోయింది. 2007లో అప్పటి ఆర్థిక మంత్రి చిదంబరం 2010 నుంచి జీఎస్​టీ అమలు చేయడానికి ప్రయత్నించారు. ఇందుకోసం ఓ ఉన్నతస్థాయి కమిటీని ఏర్పాటు చేశారు. ఆ తర్వాత 2011లో అప్పటి ఆర్థిక మంత్రి ప్రణబ్​ ముఖర్జీ జీఎస్​టీ కోసం రాజ్యాంగ సవరణ బిల్లును పార్లమెంట్​లో ప్రవేశపెట్టారు. ఈ బిల్లుపై వ్యతిరేకత ఎక్కవగా ఉన్నకారణంగా జీఎస్​టీ అమలు సాధ్యపడలేదు.

2016లో ఆమోదం

అధికారంలోకి వచ్చిన వెంటనే ఎన్డీఏ ప్రభుత్వం జీఎస్​టీపై కసరత్తు ముమ్మరం చేసింది. ఇందులో భాగంగా 2016, ఆగస్టు 3న రాజ్యసభలో జీఎస్​టీ బిల్లు ప్రవేశపెట్టగా అదే రోజు ఆమోదం పొందింది. అదే నెల 8న లోక్​సభలో బిల్లును ప్రవేశపెట్టగా అక్కడా ఆమోదముద్ర పడింది. 2016 సెప్టెంబర్​ 8న బిల్లుపై రాష్ట్రపతి సంతకం చేశారు.

జీఎస్​టీలో భాగాలు

సమాఖ్య విధానం కారణంగా జీఎస్​టీని మూడు భాగాలుగా రూపొందించారు.

  1. సీ-జీఎస్​టీ: వస్తు సేవలపై కేంద్రం విధించే పన్నులు.
  2. ఎస్​-జీఎస్​టీ: వస్తు సేవలపై రాష్టాలు విధించే పన్నులు.
  3. అంతర్రాష్ట్ర జీఎస్​టీ: రెండు రాష్ట్రాల మధ్య సరకు రవాణాపై జీఎస్​టీని కేంద్రం విధిస్తుంది. ఆ మొత్తాన్ని కేంద్రమే ఇరు రాష్ట్రాలకు పంచుతుంది.

రాష్ట్రాల విన్నపం...

జీఎస్​టీ కారణంగా తమకు పన్నుల ద్వారా వచ్చే ఆదాయం తగ్గుతుందని రాష్ట్ర ప్రభుత్వాలు ఆవేదన వ్యక్తం చేశాయి. ఈ మేరకు ఆ నష్టాన్ని ఐదేళ్ల వరకు కేంద్రమే భరిస్తుందని హామీ ఇచ్చింది. ఇందులో భాగంగానే ప్రతినెలా జీఎస్​టీ నష్ట పరిహారం ఇస్తుంది కేంద్రం.

మరిన్ని..

  • 2019-20 జీఎస్​టీ వసూళ్ల వార్షిక సగటు రూ.101,918 కోట్లు.
  • 2018-2019 జీఎస్‌టీ వసూళ్ల వార్షిక సగటు రూ.98,114 కోట్లు.
  • 2017-18 (2017 ఆగస్టు నుంచి 2018 మార్చి 31 వరకు) జీఎస్‌టీ వసూళ్ల వార్షిక సగటు రూ.89,750 కోట్లు.
  • జీఎస్​టీ అమలయ్యాక 2019 ఏప్రిల్​లో అత్యధికంగా రూ.1,13,865 కోట్లు వసూలయ్యాయి.
  • లాక్​డౌన్​ కారణంగా.. 2020 ఏప్రిల్​లో అత్యల్పంగా రూ.32,294 కోట్లు మాత్రమే వసూలయ్యాయి.
  • ప్రస్తుతం 0, 5, 12, 18, 28 శాతం శ్లాబుల్లో జీఎస్​టీ వసూలు చేస్తున్నారు. భవిష్యత్​లో కేవలం మూడు శ్లాబులనే అందుబాటులోకి తీసుకురావాలని ప్రభుత్వం భావిస్తోంది.

ఇదీ చూడండి:విమాన సంస్థలకు షాక్​.. ఏటీఎఫ్ ధరలు పైపైకి

Last Updated : Jul 1, 2020, 12:57 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.