ETV Bharat / business

'నాల్గో త్రైమాసికంలో సానుకూల వృద్ధి రేటు'

author img

By

Published : Dec 2, 2020, 5:48 PM IST

Niti Aayog VC on GDP growth
జీడీపీ వృద్ది రేటుపై నీతి ఆయోగ్ వైస్​ ఛైర్మన్ అంచనాలు

దేశ ఆర్థిక వ్యవస్థ కరోనా నుంచి తేరుకుని 2020-21 నాల్గో త్రైమాసికంలో సానుకూల వృద్ధి దశలోకి చేరుతుందని నీతి ఆయోగ్ వైస్ ఛైర్మన్​ రాజీవ్ కుమార్ అంచనా వేశారు. కేంద్రం ఇప్పటికే తెచ్చిన, త్వరలో తేనున్న సంస్కరణల ప్రోత్సాహంతో 2021-22లో వృద్ధి రేటు భారీగా పుంజుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు.

కరోనా మహమ్మారి వల్ల సంక్షోభంలో కూరుకుపోయిన దేశ ఆర్థిక వ్యవస్థ తిరిగి తేరుకుంటోందని నీతి ఆయోగ్ వైస్ ఛైర్మన్ రాజీవ్ కుమార్ అన్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం నాల్గో త్రైమాసికంలో ఆర్థిక వ్యవస్థ సానుకూల దశలోకి ప్రవేశిస్తుందని అంచనా వేశారు.

రెండో త్రైమాసికంలో వృద్ధి రేటు -7.5 శాతంగా నమోదవ్వడం.. దేశం వేగంగా రికవరీ అవుతుందనేందుకు సంకేతంగా చెప్పుకొచ్చారు రాజీవ్ కుమార్. మూడో త్రైమాసికంలో గత ఏడాది ఇదే సమయంలో నమోదైన స్థాయికి వృద్ధి రేటు చేరొచ్చన్నారు. నాల్గో త్రైమాసికంలో మాత్రం స్వల్ప సానుకూల వృద్ధి రేటు నమోదవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

ప్రభుత్వ సంస్కరణలే పునాదులు..

ప్రభుత్వం తీసుకొచ్చిన సంస్కరణలు వృద్ధిని ప్రోత్సహిస్తాయని ఆయన వివరించారు. మరిన్ని సంస్కరణలు రానున్నట్లు కూడా సంకేతాలిచ్చారు. ఇవన్నీ 2021-22లో భారీ వృద్ధి రేటు సాధించేందుకు బలమైన పునాదులు వేయనున్నాయని తెలిపారు.

కొవిడ్-19 వల్ల నెలకొన్న సంక్షోభ పరిస్థితులు పూర్తిగా ప్రకృతి వైపరీత్యం వల్ల ఏర్పడినవని.. అందువల్ల ఆర్థిక వ్యవస్థ సాంకేతికంగా ఆర్థిక మాంద్యంలోకి జారుకుందనే వాదన సరైంది కాదని రాజీవ్ కుమార్ అభిప్రాయపడ్డారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం క్యూ2లో తయారీ రంగం 0.6 శాతం వృద్ధిని నమోదు చేయడం ఆశ్చర్యం కలిగించినట్లు వివరించారు.

రైతుల ఆందోళనపై స్పందన..

దిల్లీ సరిహద్దుల్లో రైతుల ఆందోళనపైనా స్పందించారు రాజీవ్ కుమార్​. కేంద్రం తీసుకొచ్చిన నూతన వ్యవసాయ చట్టాలు రైతుల ఆదాయం పెంచే విధంగా ఉన్నాయని.. వాటిని తప్పుగా అర్థం చేసుకోవడం వల్లే ప్రస్తుత సమస్యలు తలెత్తినట్లు పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా నూతన వ్యవసాయ చట్టాలకు మంచి ఆదరణ లభించిన విషయాన్ని గుర్తించాలని అన్నారు.

ఇదీ చూడండి:రెపో రేటు మళ్లీ యథాతథమేనా?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.