ETV Bharat / business

పద్దు 2021: పర్యటక రంగానికి మద్దతు దక్కేనా?

author img

By

Published : Jan 31, 2021, 5:22 PM IST

కొవిడ్​-19తో తీవ్రంగా దెబ్బతిన్న రంగాల్లో పర్యటకం, ఆతిథ్య ముందు వరుసలో ఉంటుంది. దేశంలో పర్యటకం కరోనా ముందరి స్థితికి చేరుకోవాలంటే ప్రభుత్వ మద్దతు అవసరం. ఈ క్రమంలో సోమవారం ప్రవేశపెట్టే బడ్జెట్​లో ఎలాంటి ఉద్దీపన చర్యలు ప్రకటించాలి, ఏ మార్పులు అవసరం అనే విషయాలను ఈటీవీ భారత్​తో పంచుకున్నారు పర్యటక రంగ నిపుణులు సుభాశ్​​ గోయల్​.

travel & tourism industry
పర్యటకం, ఆతిథ్య రంగం

కొవిడ్​-19 సంక్షోభం మధ్య సోమవారం 2021-22 బడ్జెట్​ను ప్రవేశపెట్టనుంది కేంద్రం. ఆర్థికంగా పీకల లోతులో కూరుకుపోయిన పర్యటకం, ఆతిథ్య రంగం.. ఈ బడ్జెట్​లో చేయూతను కోరుకుంటోంది. లాక్​డౌన్​ కాలానికి అనుమతుల రుసుముల మినహాయింపు, హోటళ్లు, రెస్టారెంట్లపై ఇన్​పుట్​ క్రెడిట్​తో 10 శాతంగా ఒకే విధమైన జీఎస్​టీ రేట్లతో పాటు ఇతర ఉపశమన చర్యలు ప్రకటిస్తారని ఆశిస్తోంది.

భారత పర్యటకం, ఆతిథ్య రంగ సమాఖ్య ప్రధాన కార్యదర్శి, పర్యటక రంగ నిపుణులు సుభాశ్​​ గోయల్​.. బడ్జెట్​లో పర్యటక రంగానికి ఇవ్వాల్సిన ఉపశమన చర్యలను 'ఈటీవీ భారత్'​తో పంచుకున్నారు.

"ఇప్పటికీ హోటళ్లపై జీఎస్​టీ రేటును నిర్ణయించలేదు. దానిపై మేము ఇన్​పుట్​ క్రెడిట్​ను పొందలేదు. ఒక స్థిరమైన పద్దును కోరుకుంటున్నాం. హోటళ్ల స్థాయిని బట్టి గతంలో జీఎస్​టీ 18 నుంచి 12 శాతం వరకు ఉండేది. అందుకే ఇన్​పుట్​ క్రెడిట్​తో కూడిన ఒకే విధంగా 10 శాతం జీఎస్​టీ కోరుకుంటున్నాం.

కరోనాతో పర్యటకం రంగం తీవ్రంగా దెబ్బతింది. ఈ రంగంపై ప్రత్యక్షంగా, పరోక్షంగా 7.5 కోట్ల మంది ఆధారపడి ఉపాధి పొందేవారు. కరోనా దెబ్బకు 3 కోట్లు మంది ఉపాధి కోల్పోయారు. కోటి మంది వరకు జీతాలు లేక సెలవుపై వెళ్లారు. సుమారు 53 వేల మంది ట్రావెల్​ ఏజెంట్లు, 1.3 లక్షల మంది టూర్​ ఆపరేటర్లు, వేల సంఖ్యలో ట్రాన్స్​పోర్టర్లు, టూరిస్ట్​ గైడ్లు జీవితాన్ని నెట్టుకొచ్చేందుకు ఇబ్బందులు పడుతున్నారు."

- సుభాశ్​​ గోయల్​, పర్యటక రంగ నిపుణులు

ఇతర దేశాలలో మాదిరిగా పర్యటక రంగానికి ప్రత్యేక ప్యాకేజీలు మన ప్రభుత్వం నుంచి అందలేదన్నారు గోయల్​. కాబట్టి ఈ బడ్జెట్​లో పర్యటకానికి పలు ఉపశమనాలు కల్పిస్తుందనే భరోసాతో ఉన్నట్లు చెప్పారు. దాని ద్వారా పర్యటక రంగం నిలదొక్కుకోవటమే కాకుండా.. లక్షలాది మందికి ఉద్యోగాలు దక్కుతాయని వివరించారు.

ఏడాది పాటు పన్ను మినహాయింపు ఇవ్వాలి..

దేశంలో పర్యటకం, ఆతిథ్య రంగం మళ్లీ పట్టాలెక్కాలంటే ఏడాది పాటు పన్ను మినహాయింపు కల్పించాలని కోరారు గోయల్​. అలాగే.. లాక్​డౌన్​ కాలంలో విద్యుత్తు బిల్లు, ఎక్సైజ్​ రుసుము, ట్రాన్స్​పోర్ట్​ అనుమతుల రుసుములను రద్దు చేయాలన్నారు.

ప్రభుత్వ మద్దతు అవసరం..

ఆతిథ్య రంగం తిరిగి వేగంగా పూర్వ స్థితికి చేరుకునేందుకు ప్రభుత్వం మద్దతు చాలా కీలకమని బడ్జెట్​ ముందస్తు సూచనల్లో తెలిపింది భారత హోటళ్ల సంఘం(హెచ్​ఏఐ). అది కేవలం ఆచరణాత్మక విధానాల రూపకల్పన, పన్ను రేట్లలో హేతుబద్దీకరణ, సులభమైన అనుమతులు, సులభతర వాణిజ్యానికి ప్రోత్సాహాలతోనే సాధ్యమవుతుందని పేర్కొంది. కరోనాతో తీవ్రంగా దెబ్బతిన్న రంగాల్లో హోటళ్లు కూడా ఒకటిగా రిజర్వ్​ బ్యాంక్​ గుర్తించినట్లు తెలిపింది హెచ్​ఏఐ. దేశంలోని హోటళ్లలో ఉన్న 90 శాతం గదులు సాధారణ విభాగంలోకి పడిపోయాయని, అందులో చాలా వరకు భారతీయ పర్యటకులకే కేటాయించినట్లు గుర్తు చేసింది. దేశంలో 40 శాతం హోటళ్లు శాశ్వతంగా మూతపడే దశకు చేరుకున్నాయని పేర్కొంది. కరోనా ముందరి స్థితికి ఆతిథ్య రంగం చేరుకోవాలంటే 3 ఏళ్ల సమయం పడుతుందని అభిప్రాయపడింది.

ఇవీ చూడండి: బడ్డెట్: 'చిన్న పరిశ్రమ'కు ఊతమిచ్చేనా?

బడ్జెట్ 2021: అంకురాల ఆశలు నెరవేరేనా?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.