ETV Bharat / business

ఎల్‌ఐసీ ఐపీఓ.. సెబీకి ముసాయిదా పత్రాలు దాఖలు

author img

By

Published : Feb 13, 2022, 8:44 PM IST

Updated : Feb 14, 2022, 3:19 AM IST

LIC IPO: భారతీయ జీవిత బీమా సంస్థ (ఎల్‌ఐసీ) పబ్లిక్ ఇష్యూకు రానున్న క్రమంలో సెబీకి ముసాయిదా పత్రాలు దాఖలు చేసింది కేంద్ర ప్రభుత్వం. ఎల్‌ఐసీ పబ్లిక్‌ ఇష్యూను మార్చిలో తేవాలని ప్రభుత్వం భావిస్తోంది.

LIC IPO
ఎల్‌ఐసీ ఐపీఓ

LIC IPO: ఎల్‌ఐసీ పబ్లిక్‌ ఇష్యూ కోసం మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీకి ప్రభుత్వం ముసాయిదా పత్రాలను ఆదివారం దాఖలు చేసింది. మార్చిలో ఈ ఐపీఓ స్టాక్‌ మార్కెట్లౖiకు వచ్చే అవకాశం ఉంది. ఎల్‌ఐసీలో 5 శాతం వాటాకు సమానమైన 31.6 కోట్లకు పైగా రూ.10 ముఖ విలువ కలిగిన ఈక్విటీ షేర్లను ప్రభుత్వం విక్రయించనుందని పెట్టుబడులు, ప్రజా ఆస్తుల నిర్వహణ విభాగం (దీపం) కార్యదర్శి తుహిన్‌ కాంత పాండే వెల్లడించారు. ఇందువల్ల రూ.63,000 కోట్ల వరకు ఖజానాకు చేరతాయని మర్చంట్‌ బ్యాంకర్ల అంచనా. తద్వారా ఇదే దేశీయంగా అతిపెద్ద ఇష్యూగా నిలవనుంది. ఇష్యూ పూర్తిగా ఆఫర్‌ ఫర్‌ సేల్‌ (ఓఎఫ్‌ఎస్‌) రూపంలో జరగనుంది. సంస్థలో 100 శాతం వాటా (632.49 కోట్ల షేర్లను) కలిగిన ప్రభుత్వం 5 శాతం వాటాను ఇలా విక్రయించబోతోంది. కొత్తగా షేర్లు ఏమీ జారీ చేయడం లేదు. ఎల్‌ఐసీ ఎంబెడెడ్‌ విలువను రూ.5.4 లక్షల కోట్లుగా అంతర్జాతీయ సంస్థ మిల్లీమన్‌ అడ్వైజర్స్‌ నిర్ధారించింది. ఎల్‌ఐసీ మార్కెట్‌ విలువను ప్రభుత్వం వెల్లడించలేదు. అయితే ఎంబెడెడ్‌ విలువకు 3 రెట్లుగా.. రూ.16 లక్షలకు పైగా సంస్థ మార్కెట్‌ విలువ ఉండొచ్చని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. ఎల్‌ఐసీ ఐపీఓ ఇష్యూలో 10% పాలసీదార్లకు, 5 శాతాన్ని సంస్థ ఉద్యోగులకు కేటాయిస్తారు. వీరికి షేరు ధరలో ఎంత రాయితీ ఇస్తారో వెల్లడి కాలేదు. మార్చిలో ఐపీఓ ముగించుకుని, స్టాక్‌ ఎక్స్ఛేంజీల్లో ఎల్‌ఐసీని నమోదు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది.

అంతకు ముందు ఎల్‌ఐసీ ఐపీఓ ప్రతిపాదనకు కంపెనీ బోర్డు ఆమోదం తెలిపింది.

  • ఐపీఓ తరవాత ఎల్‌ఐసీ మార్కెట్‌ విలువ 293 బిలియన్‌ డాలర్లు (సుమారు రూ.22.1 లక్షల కోట్లు) అవుతుందనే అంచనాలున్నాయి. తద్వారా ప్రపంచంలోనే అత్యంత విలువ కలిగిన నమోదిత జీవితబీమా సంస్థగా ఎల్‌ఐసీ నిలుస్తుందని చెబుతున్నారు.
  • ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో వాటాల ఉపసంహరణ ద్వారా సమీకరించాలనుకున్న మొత్తం అంచనాలను రూ.1.75 లక్షల కోట్ల నుంచి రూ.78,000 కోట్లకు ప్రభుత్వం తగ్గించిన సంగతి విదితమే. ఈ మొత్తం సమీకరణకు ఎల్‌ఐసీ ఐపీఓ కీలకం కానుంది.

ఇదీ చూడండి: 'బ్లూ హైడ్రోజన్‌ తయారీలో అగ్రస్థానమే లక్ష్యం'

Last Updated :Feb 14, 2022, 3:19 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.