ETV Bharat / business

'రూ.1500 కోట్లతో కిమ్స్​ హాస్పిటల్స్ విస్తరణ'

author img

By

Published : Jun 12, 2021, 8:31 AM IST

వచ్చే అయిదేళ్లలో 5,000 పడకల సామర్థ్యానికి చేరుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్నామని కిమ్స్‌ హాస్పిటల్స్‌ (కృష్ణా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌ లిమిటెడ్‌) ఛైర్మన్ బి.భాస్కరరావు తెలిపారు. చెన్నై, బెంగళూరుల్లో కొత్త ఆస్పత్రులు ఏర్పాటు చేస్తామని చెప్పారు. భవిష్యత్తులో ఒక్కో ఆస్పత్రి సామర్థ్యాన్ని 700- 800 పడకలకు పెంచాలనే ఆలోచన ఉందని 'ఈటీవీ భారత్​'కు వెల్లడించారు.

kims hospitals hyderabad
కిమ్స్​ హాస్పిటల్స్​ హైదరాబాద్​

హైదరాబాద్‌ కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న కిమ్స్‌ హాస్పిటల్స్‌ (కృష్ణా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌ లిమిటెడ్‌) పెద్దఎత్తున విస్తరణ ప్రణాళిక సిద్ధం చేసింది. వచ్చే అయిదేళ్లలో 5,000 ఆస్పత్రి పడకల సామర్థ్యానికి చేరుకోవాలని లక్ష్యంగా పెట్టుకుంది. దీని కోసం రూ.1500 కోట్ల వరకు పెట్టుబడి అవసరం. కొన్ని ఆస్పత్రులను కొనుగోలు చేయటం సహా మరికొన్ని కొత్త ఆస్పత్రులు నెలకొల్పడం ద్వారా ఈ లక్ష్యాన్ని చేరుకుంటామని కిమ్స్‌ హాస్పిటల్స్‌ ఛైర్మన్‌ డాక్టర్‌ బి.భాస్కరరావు 'ఈటీవీ భారత్​'కు వెల్లడించారు.

కిమ్స్‌ హాస్పిటల్స్‌ ప్రధానంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల్లో వైద్య సేవలు అందిస్తోంది. ప్రస్తుతం 9 ఆస్పత్రులు, 3064 పడకలు ఉన్న ఈ సంస్థ త్వరలో చెన్నై, బెంగళూరు నగరాలకు విస్తరించనుంది. ఈ రెండు నగరాల్లో 250- 300 పడకల సామర్థ్యం గల ఆస్పత్రులు ఏర్పాటు చేస్తామని, భవిష్యత్తులో ఒక్కో ఆస్పత్రి సామర్థ్యాన్ని 700- 800 పడకాలకు పెంచాలనే ఆలోచన ఉందని భాస్కరరావు తెలిపారు. చెన్నైలో స్థలం ఎంపిక, అనుమతుల కోసం దరఖాస్తు చేయడం పూర్తయిందని, త్వరలో పనులు ప్రారంభిస్తామన్నారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల్లో పడకలను ఇంకా పెంచుకుంటామని వివరించారు.

సగం వరకు సొంత నిధులే

"విస్తరణ కార్యకలాపాలకు అయ్యే సొమ్ములో సగం వరకు సొంత నిధులే ఖర్చు చేస్తాం. మిగతా సగానికి బ్యాంకుల నుంచి అప్పు తీసుకుంటాం. ఒకేసారి నిధులు సేకరించాల్సిన పనిలేదు, ఏటేటా కొంత సమీకరిస్తే సరిపోతుంది. గత దశాబ్ద కాలానికి పైగా మేము 20 శాతం చొప్పున వార్షిక వృద్ధి నమోదు చేశాం. ఇదే స్థాయి వృద్ధిని భవిష్యత్తులోనూ కొనసాగించాలనేది మా ఉద్దేశం"

-బి.భాస్కరరావు, కిమ్స్ హాస్పిటల్స్​ ఛైర్మన్​

మహమ్మారిని ఎదుర్కొనేందుకు సన్నద్ధత

"కొవిడ్‌-19 రెండోదశకు సన్నద్ధంగా లేకపోవడం వల్ల ఎదురైన ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని, భవిష్యత్తులోనూ మళ్లీ ఇటువంటి పరిస్థితి వస్తే, మెరుగైన వైద్య సేవలు అందించేందుకు మా ఆస్పత్రుల్లో పూర్తిస్థాయిలో ఏర్పాట్లు చేస్తున్నాం. ఆక్సిజన్‌ పడకలు, వెంటిలేటర్‌ సదుపాయాలు, వైద్యులు- సిబ్బంది నియామకాలు, పిల్లల వార్డుల ఏర్పాటు.. వంటి అంశాలపై దృష్టి సారించాం. జీవనశైలి వ్యాధులు పెరుగుతున్నందున, సంబంధిత విభాగాల్లో అధునాతన చికిత్సలు అందించేందుకు సిద్ధపడుతున్నాం."

-బి.భాస్కరరావు, కిమ్స్ హాస్పిటల్స్​ ఛైర్మన్​

ఈ నెల 16 నుంచి పబ్లిక్‌ ఇష్యూ

కిమ్స్‌ హాస్పిటల్స్‌ ఈక్విటీ షేర్ల తొలి పబ్లిక్‌ ఇష్యూ (ఐపీఓ) ఈ నెల 16న ప్రారంభమై 18న ముగియనుంది. బుక్‌బిల్డింగ్‌ పద్ధతిలో ఒక్కో షేరుకు రూ.815 నుంచి రూ.825 ధర నిర్ణయించారు. ఐపీఓ ద్వారా కంపెనీ రూ.200 కోట్లు సమీకరిస్తోంది. ఇదేగాక ఆఫర్‌ ఫర్‌ సేల్‌ (ఓఎఫ్‌ఎస్‌) కింద ప్రమోటర్లు, ప్రస్తుత ఇన్వెస్టర్లు కలిపి 2,35,60,538 షేర్లు విక్రయిస్తున్నారు. ఇందులో జనరల్‌ అట్లాంటిక్‌ సింగపూర్‌ కేహెచ్‌ పీటీఈ లిమిటెడ్‌ 1,60,03,615 షేర్లు విక్రయిస్తోంది. దీని ప్రకారం చూస్తే, ఇది దాదాపు రూ.2,150 కోట్ల ఇష్యూ అవుతోంది. కంపెనీకి పబ్లిక్‌ ఇష్యూ ద్వారా లభించే రూ.200 కోట్ల నుంచి రూ.150 కోట్లతో అప్పు తీర్చనున్నట్లు డాక్టర్‌ భాస్కరరావు వెల్లడించారు. మిగిలిన రూ.50 కోట్ల కార్పొరేట్‌ అవసరాలకు, భాగస్వామ్యాలు- ఇతర అవసరాలకు కేటాయిస్తారు.

ఇదీ చూడండి: వచ్చే వారం ఐపీఓకు కిమ్స్, దొడ్ల డెయిరీ

ఇదీ చూడండి: కిమ్స్ టు అపోలో... గ్రీన్‌ ఛానెల్ ద్వారా పేషంట్ తరలింపు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.